లండన్ : ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా మధ్య కుదిరిన కొత్త అకస్ మిలటరీ ఒప్పందాన్ని ప్రమాదకరమైనదిగా బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీ సభ్యులు పేర్కొన్నారు.
'మన ముఖ్యమైన సంబంధాలను బ్రిటన్ చూసుకోవాల్సి వుందని' వ్యాఖ్యానించారు. అయితే, తీర్మానాన్ని 70-30 శాతంతో ఆమోదించారు. కన్జర్వేటివ్ ప్రధాని బోరిస్ జాన్సన్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ ఒప్పందం వల్ల ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరత పెరుగుతుందని జాన్సన్ చేసిన ప్రకటనతో వారు విభేదించారు.
వాస్తవానికి ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే ప్రమాదకరమైన చర్య అని వ్యాఖ్యానించారు. తీర్మానం ఆమోదంతో ప్రతిపక్ష లేబర్ పార్టీలో గల విబేధాలు తెరపైకి వచ్చాయి. మాజీ నేత జెర్మీ కార్బిన్ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాగా వర్కర్స్ యూనియన్ అనుబంధ సంస్థ జిఎంబి యూనియన్ ఈ తీర్మానాన్ని ఖండించింది. కొత్త సైనిక ఒప్పందాన్ని వ్యతిరేకించడం వల్ల పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని పేర్కొంది. బ్రిటన్ తయారీ రంగానికి ఇదొక నిజమైన అవకాశమని వ్యాఖ్యానించింది. ఈ అవకాశాలను తోసిపుచ్చడం అర్ధం లేని పని అని జిఎంబి ప్రాంతీయ కార్యదర్శి హాజెల్ నోలాన్ విమర్శించారు.

