Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అవయవదానంపై ప్రతి కుటుంబం చర్చించాలి

అవయవదానంపై ప్రతి కుటుంబం చర్చించాలి

- వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అవయవదానంపై ప్రతి కుటుంబం చర్చించాలని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ కోరారు.

ఆదివారం జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బ్రెయిన్ డెడ్ అంటే మెదడు పూర్తిగా పనిచేయడం ఆగిపోయిన పరిస్థితి అని, ఇది కోమాతో పూర్తిగా భిన్నమని పేర్కొన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి తిరిగి కోలుకునే అవకాశం ఉండదని, అలాంటి పరిస్థితిలో కుటుంబం తీసుకునే అవయవదాన నిర్ణయం గరిష్ఠంగా ఎనిమిది మంది ప్రాణాలను కాపాడుతుందని తెలిపారు.

రాష్ట్రంలో అవయవ మార్పిడి కోసం వేలాది మంది ప్రాణాలతో పోరాడుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం 5,839 మంది దాతల కోసం నిరీక్షిస్తున్నారని తెలిపారు. మూత్రపిండాల కోసం 3,715 మంది,కాలేయం కోసం 2,009 మంది, గుండె కోసం 96 మంది, ఊపిరితిత్తులు కోసం 15 మంది, క్లోమగ్రంథి కోసం 4గురు ఎదురుచూస్తున్నారని వివరించారు. అందుకే ప్రతి కుటుంబం ముందుగానే అవయవదానంపై అవగాహన పెంచుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు.దాతల కుటుంబాలకు అంత్యక్రియల కింద ప్రస్తుతం రూ.10వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తునట్లు తెలిపారు. సదరు కుటుంబాల త్యాగాన్ని ఎలా గుర్తించాలన్న దానిపై పరిశీల చేస్తున్నామని పేర్కొన్నారు. అవయవాల కేటాయింపులో ఎలాంటి సిఫార్సులు, పలుకుబడి లేదా దళారీలకు అవకాశం లేకుండా జీవన్‌దాన్‌ కేంద్రీకృత డిజిటల్‌ విధానాన్ని అమలు చేస్తోందని తెలిపారు. వైజాగ్ లో అవయవ దానంపై జీవన్ దాన్ ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర స్థాయి కార్యక్రమం జరగనుందని వెల్లడించారు. రోగి నమోదు చేసిన తేదీ, వ్యాధి తీవ్రత, కణజాల సరిపోలిక వంటి ప్రమాణాల ఆధారంగానే అవయవాలను కేటాయిస్తున్నామని చీఫ్ ట్రాన్సప్లాంటేషన్ ఆఫిసర్ డాక్టర్ మన్మధరావు వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti