Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాధ్యతలు స్వీకరించిన గొటబాయ...!

బాధ్యతలు స్వీకరించిన గొటబాయ...!

* అందరితో మైత్రీబంధాన్ని కొనసాగిస్తామని వెల్లడి
కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన గొటబాయ రాజపక్స సోమవారం అనూరాధపురాలో జరిగిన ఒక కార్యక్రమంలో అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దేశాలతో మైత్రీ సంబంధాలను కొనసాగిస్తామని, అంతర్జాతీయ శక్తులు ప్రమేయం వున్న విషయంలో తాము తటస్థ వైఖరిని అనుసరిస్తూ ఘర్షణలకు దూరంగా వుంటామని చెప్పారు. కొలంబో నగరానికి 200 కి.మీ దూరంలో వున్న అనూరాధపురాలో వున్న బౌద్ధుల పవిత్ర స్థూపం రువాన్‌ వెలి సెయ వద్ద రాజపక్స ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. బాధ్యతలుస్వీకరించిన అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ అన్ని దేశాలతో మైత్రీబంధాన్ని కొనసాగిస్తామని చెప్పినట్లు లంక మీడియా తన వార్తా కథనాలలో వెల్లడించింది.

చైనా అభినందనలు
లంక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన గొటబాయ రాజపక్సకు చైనా ప్రభుత్వం సోమవారం అభినందనలు తెలియచేసింది. ద్వైపాక్షిక సంబంధాలను అభివృద్ధి చేసుకుని, బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ ప్రాజెక్టులో భాగంగా అత్యంత నాణ్యతతో కూడిన ప్రాజెక్టుల నిర్మాణానికి లంక ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా వున్నామని వెల్లడించింది.
పార్లమెంట్‌కు ముందస్తు ఎన్నికలు?
రాజపక్స కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలుస్వీకరించిన నేపథ్యంలో లంక పార్లమెంట్‌కు ముందస్తు ఎన్నికలుజరిగే అవకాశాలున్నాయని పాలక యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ (యుఎన్‌పి) వర్గాలు చెప్పాయి. ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన వైఖరిపై చర్చించేందుకు ఒక పార్లమెంటరీ గ్రూప్‌ను ఏర్పాటుచేశామని, పార్లమెంట్‌కు తాజా ఎన్నికలు నిర్వహించేందుకు తాము మొగ్గు చూపుతున్నామని ఈ వర్గాలు వివరించాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti