Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాల సాహిత్యంలో సామాజిక వాస్తవికత

బాల సాహిత్యంలో సామాజిక వాస్తవికత

సాహిత్యమంటే కేవలం పదాలతో గారడీ చేసే అలంకారిక క్రీడ కాదు.అది సామాజిక వాస్తవికతను ప్రతిబింబించే, పౌరులలో చైతన్యాన్ని రగిలించే ఒక పదునైన ఆయుధం. బాలల కోసం రాసే కథలు అభూత కల్పనలకు,అస్తిత్వంలేని లోకాలకు పరిమితం కాకూడదు.వాటికి స్పష్టమైన సామాజిక ప్రయోజనం ఉండాలి.

ఆసూరి ఉషారాణి రచించిన "ఉప్పు మూట - దూది మూట" సంకలనం సమాజాన్ని వాస్తవిక దృష్టితో చూసే క్రమంలో పిల్లలు వేసే తొలి అడుగుల వంటిది. ఈ సంకలనంలో మొత్తం 44 పొట్టి కథలు ఉన్నాయి. చిన్న పరిమాణంలో ఉన్నా, ప్రతి కథలోనూ జీవన విలువలు,నైతిక బోధలు, అనుబంధాల ఆవశ్యకత వంటి అంశాలను హృద్యంగా ప్రతిబింబించారు. "నాన్నమ్మ దీవెనలు" కథలో ఆధునిక జీవనశైలిలో పెద్దల పట్ల నిర్లక్ష్యాన్ని చూపుతూ, నాన్నమ్మ అనుబంధాల విలువను గుర్తుచేస్తుంది. "తల్లి మాట" కథలో పెద్దల మాట వినకపోవడం వల్ల కలిగే పరిణామాలను సున్నితంగా తెలియజేస్తుంది. "ఆత్మ సౌందర్యం"లో గ్రంథాలయాల ప్రాముఖ్యతను వివరించే కథ. పల్లెలకూ పుస్తక భాండాగారాల అవసరాన్ని స్పష్టంగా ప్రతిపాదించారు. "మా బడి" కథ ప్రకృతి ప్రేమను పెంపొందించే కథగా నిలుస్తుంది. చెట్ల సంరక్షణ, పక్షులు,తేనెటీగలు,ఉడుతల సహజ జీవనాన్ని కాపాడాల్సిన బాధ్యతను గురువు పాత్ర ద్వారా పిల్లల్లో నింపారు. "జింక కాళ్లు" కథ ద్వారా అవయవాల్లో దేనికదే ప్రాధాన్యత ఉంటుందనే జీవన సత్యాన్ని సరళంగా తెలియజేశారు. "అభిషేకం" కథలో మానవత్వం, పరస్పర సహాయం వంటి విలువలు ప్రతిబింబిస్తాయి.ఇక "మాతృ ఋణం" కథలో తల్లి ప్రేమను,తల్లి ఋణాన్ని ఎప్పటికీ తీర్చలేమనే భావాన్ని హృదయాన్ని కదిలించే విధంగా ఆవిష్కరించారు.ఈ కథ పాఠకుల్లో పఠనాసక్తిని పెంపొందించడమే కాకుండా,భావోద్వేగ అనుభూతిని కలిగిస్తుంది.​ "పక్షుల ప్రేమ" కథలో తాత-మనవడు సంభాషణ ద్వారా ప్రకృతి జీవన సౌందర్యాన్ని వివరించారు. ఏసీ సౌకర్యాల కంటే ఆరుబయట గాలి గొప్పదని, పక్షులకు ఆహారం అందించాలనే మనసును పిల్లల్లో పెంపొందించే ప్రయత్నం కనిపిస్తుంది.ఈ సంకలనానికే ప్రాణం లాంటిది "పుట్టినరోజు"కథ.ఒక పనిమనిషి కొడుకు ఇచ్చిన 'పెద్ద బాలశిక్ష' పుస్తకాన్ని, యజమాని కొడుకు అత్యంత విలువైనదిగా భావించడం అనేది వర్గ భేదాలను నిరాకరించే ప్రగతిశీల లక్షణం.నేటి కంప్యూటర్ యుగంలో పుస్తకాల ప్రాముఖ్యతను గుర్తు చేసే కథగా ఇది నిలుస్తుంది.​​పుస్తకానికి శీర్షిక అయిన "ఉప్పు మూట- దూది మూట" కథలో'గుడ్డిగా కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి' అనే ముగింపు హేతువాదానికి పునాది.వాతావరణ మార్పులను గమనించి వ్యవహరించడం అనేది భౌతిక పరిస్థితులను అర్థం చేసుకుని, మనిషి తన పరిణామంలో ముందుకు వెళ్లాలనే సత్యానికి అద్దం పడుతోంది.మొత్తానికి పొట్టి కథలే కానీ అన్నీ గట్టి కథలే.. అనే మాటకు ఈ సంకలనం నిజమైన ఉదాహరణ.సరళమైన భాష, బొమ్మల ఆకర్షణ, లోతైన భావాలు కలిసి.. ఈ పుస్తకాన్ని పిల్లలతో పాటు పెద్దలకూ ఆలోచన కలిగించే గ్రంథంగా నిలబెడుతున్నాయి.​అన్నీ ఇందులో చెప్పడం సాధ్యం కాదు కనుక పుస్తకంలోని కథలన్నీ చదవాల్సినవే.. పిల్లల్లో మంచి విలువలు, మానవత్వం,ప్రకృతి పట్ల ప్రేమ, పెద్దల పట్ల గౌరవం పెంపొందించాలనుకునే ప్రతి తల్లిదండ్రి,ఉపాధ్యాయుడు తప్పక చదవాల్సిన,చదివించాల్సిన మంచి కథా సంకలనం ''ఉప్పు మూట - దూది మూట''. పఠనాసక్తిని పెంపొందించడంలో, విలువల విద్యను అందించడంలో ఈ గ్రంథం విశిష్ట స్థానాన్ని సంపాదిస్తుంది.

రచయిత: ఆసూరి ఉషారాణి

పుస్తకం వెల:120/- రూ.లు

పుస్తకాల కోసం : 9441646016.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti