Wednesday, 04 Dec, 1.59 am ప్రజాశక్తి

తాజావార్తలు
బార్లు సరే.. మద్యం షాపుల సంగతేంటి?

* ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
* విచారణ 18కి వాయిదా
ప్రజాశక్తి, అమరావతి:
దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేయాలనుకుంటే బార్ల సంఖ్యను 40 శాతం తగ్గించినట్లుగానే రిటైల్‌ మద్యం షాపుల సంఖ్యను 40 శాతం ఎందుకు తగ్గించలేదని కోర్టు ప్రశ్నించింది. మద్యం షాపుల్ని తగ్గించకుండా బార్లను తగ్గిస్తే ఉపయోగం ఏముంటుందని కూడా ప్రశ్నించింది. ఒక వైపు మద్య నిషేధం అంటూ మరో వైపు బార్ల దరఖాస్తు రుసుము రూ.10 లక్షలుగా ఎలా నిర్ణయించారని నిలదీసింది. ఇంతటి ధరలు నిర్ణయించడం నిషేధం అంటూనే మద్యం ద్వారా ఆదాయం పెంపునకు అడుగులు వేయడం అవదా అనే సందేహాన్ని లేవనెత్తింది. చిత్తశుద్ధి ఉంటే మద్యం ద్వారా రాబడి పెంపు మార్గాలు ఎందుకు అన్వేషించాలని ప్రశ్నించింది. కొత్త బార్ల విధానాన్ని ముందుగా తీసుకువచ్చి ఆపై నిబంధనలను ఎలా తయారు చేస్తారనే ప్రశ్నను లేవనెత్తింది. బార్ల సంఖ్యను 40 శాతం తగ్గిస్తూ 2020 జనవరి 1 నుంచి 2021 డిసెంబర్‌ 31 వరకూ కొత్త బార్లకు అనుమతి కోసం ప్రభుత్వం గత నెల 22న జారీ చేసిన జీవో 473ను సవాల్‌ చేస్తూ పలు బార్లు, రెస్టారెంట్ల యజమానులు వేసిన రిట్లను మంగళవారం హైకోర్టు విచారించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జీకే మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.వెంకటరమణలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ పైవిధంగా పలు ప్రశ్నలు సంధించింది.
దీనిపై ఏజీ ఎస్‌ శ్రీరామ్‌ వాదిస్తూ.. ఈ నెల 7న కొత్త బార్ల కేటాయింపు, ఎంపికలను 15వ తేదీకి వాయిదా పడిందని చెప్పారు. బార్ల లైసెన్స్‌లను రద్దు చేసే అధికారం సర్కార్‌కు ఉందన్నారు. 2017లో లైసెన్స్‌లు ఇచ్చారని, కొత్త మద్యం విధానం కారణంగా తిరిగి అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. భారీగా రేట్ల పెంపు ద్వారా మద్యం ధరలు సామాన్యులకు అందుబాటులోకి లేకుండా చేయడమే రుసుం ఎక్కువగా నిర్ణయించడానికి కారణమన్నారు. గతంలో 4380 మద్యం షాపులు ఉన్నాయని, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో 3500 ఉన్నాయని తెలిపారు. గతంలో 780 బార్లను 487కు తగ్గిస్తామన్నారు. బార్ల తరఫు లాయర్లు వాదిస్తూ అయిదేళ్లకు అనుమతులు ఇచ్చి ఇప్పుడు రద్దు చేయడం అన్యాయమన్నారు. 2022 వరకూ అనుమతులు ఉన్నాయన్నారు. మద్య నిషేధం అంటూనే దరఖాస్తు రుసుం రూ.10 లక్షలుగా ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. ఆ రుసుం ప్రభుత్వం తిరిగి ఇవ్వదని, కొత్త బార్ల విధానాన్ని హైకోర్టు అడ్డుకోవాలని కోరారు. వాదనల తర్వాత ప్రభుత్వ వైఖరిపై పిటిషనర్లు కౌంటర్‌ వ్యాజ్యాలు వేయాలని డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. విచారణ ఈ నెల 18కి వాయిదా పడింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top