ప్రజాశక్తి - బైరెడ్డిపల్లి (చిత్తూరు) : సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన కిట్లు, పాఠ్య పుస్తకాలు, యూనిఫాంల ప్యాకింగ్, పంపిణీ కార్యక్రమాల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ, బైరెడ్డిపల్లి మండలంలో మాత్రం వాటిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాల ప్రకారం … ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను ఈ పనులకు వినియోగించకూడదని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, బైరెడ్డిపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద విద్యార్థులకు వచ్చిన విద్యా సామాగ్రి పనుల్లో సిఆర్పీలు, ఎంఈఓ కార్యాలయానికి సంబంధించిన పనులు చేసే వారిపై ఒత్తిడి తెచ్చి పనులు చేయిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికులు, విద్యా వర్గాల సమాచారం మేరకు, సంబంధిత సిబ్బందిని విధులకు మించి ఉపయోగిస్తూ వెట్టిచాకిరిలా పని చేయిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం స్పష్టంగా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, మండల స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ఘటనలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

