Wednesday, 20 Nov, 12.00 am ప్రజాశక్తి

తాజావార్తలు
భారత్‌ బంద్‌లా జనవరి 8 సమ్మె

* కార్మిక, కర్షకులు సన్నద్ధం
* సిఐటియు జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ హేమలత
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి:
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజా కంటక విధానాలను వ్యతిరేకిస్తూ వచ్చే ఏడాది జనవరి ఎనిమిదిన సార్వత్రిక సమ్మెను భారత్‌ బంద్‌ మాదిరిగా నిర్వహిస్తామని సిఐటియు జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ కె హేమలత చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని జరుగుతున్న ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ తొమ్మిదో మహాసభ మూడో రోజుకు చేరుకుంది. ఈ మహాసభకు హాజరైన ఆమె మీడియాతో మంగళవారం మాట్లాడుతూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యాన తలపెట్టిన సర్వత్రిక సమ్మెలో పాల్గొనేందుకు కార్మికులు, కర్షకులతోపాటు అంగన్‌వాడీ ఉద్యోగులు, స్కీం వర్కర్లు సన్నద్ధమవుతున్నారని తెలిపారు. సమ్మెను జయప్రదం చేసేందుకు సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కార్మిక, కర్షకులను ఐక్యం చేసే కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. దేశం ఆర్థిక మాద్యంతో కొట్టుమిట్టాడుతోందని, అనేక ప్రయివేటు కంపెనీలు సైతం సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయని అన్నారు. ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోయారని, రానున్న కొద్ది కాలంలో మరో పది లక్షల మంది వరకూ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం పొంచివుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐటి, నిర్మాణ రంగం, గార్మెంట్స్‌, టెక్స్‌టైల్స్‌ వంటి రంగాల్లో పనిచేస్తోన్న ఉద్యోగులు రోడ్డున పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న ఆర్థిక విధానాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి పడిపోతోందని తెలిపారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు చర్యలు తీసుకోకుండా, కార్పొరేట్‌ కంపెనీలకు కేంద్రం రూ.2.15 లక్షల కోట్ల రాయితీలను ఇచ్చిందన్నారు. పెట్టుబడిదారులకు ఇచ్చిన రాయితీ సొమ్ముతో ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు వీలుగా ఉత్పాదక రంగంపై పెట్టినట్లయితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో లక్షలాదిగా ఉపాధి కోల్పోతున్న కార్మికులకు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందన్నారు. రెండోసారి అధికారంలోకొచ్చిన బిజెపి ప్రభుత్వం రక్షణ రంగంతోపాటు, రక్షణకు సంబంధించిన ఉత్పత్తుల తయారీని కూడా ప్రయివేటు కంపెనీలకు అప్పగించాలని చూస్తోందని చెప్పారు. మేకిన్‌ ఇండియా అంటూనే మరోవైపు ప్రభుత్వ రంగానికి ఉత్పత్తి ఆర్డర్లు ఇవ్వకుండా విదేశాల నుంచి దిగుమతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి దేశీయ ఉత్పత్తి కేంద్రాలను ధ్వంసం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విమర్శించారు. రైల్వేలను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు చేపట్టిందన్నారు. ఇప్పటికే 150 రైలు సర్వీసులను ప్రయివేటుకు అప్పగించిందని తెలిపారు. భవిష్యత్తులో రైల్వేశాఖ ద్వారా పేదలకు ఇచ్చే రాయితీలు అందకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వేలకు ఉన్న భూములను సైతం ప్రయివేటు వ్యక్తులకు కట్టబట్టే కుట్రలకు పాల్పడుతోంద న్నారు. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలను సాగించాలన్నారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను హరించేలా కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం మారుస్తోందన్నారు. కార్మిక వ్యతిరేక సవరణలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.

29న విజయవాడలో రాష్ట్ర సదస్సు : ఎ.వి.నాగేశ్వరరావు
షెడ్యూల్డ్‌ ఎంప్లాయిమెంట్‌లో ఉన్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 29న విజయవాడలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నామనిసిఐటియు రాష్ట్ర కోశాధికారి ఎ.వి.నాగేశ్వరరావు తెలిపారు. దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేసేందుకు జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో సద స్సులు, సమావేశాలు నిర్వహించి కార్మికులను సన్నద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు జి.బేబిరాణి, తూర్పు గోదావరి జిల్లా నాయకులు కెఎస్‌వి.రామచంద్రరావు, ఎస్‌ఎస్‌.మూర్తి పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top
// // // // $find_pos = strpos(SERVER_PROTOCOL, "https"); $comUrlSeg = ($find_pos !== false ? "s" : ""); ?>