@6.5 శాతం నుంచి 6.2 శాతానికి కోత న్యూఢిల్లీ : పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో భారత వృద్ధి రేటు అంచనాలకు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా కోత పెట్టింది.
గతంలో భారత వృద్ధి రేటు 6.5 శాతంగా ఉండవచ్చని అంచనా వేసిన ఇక్రా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దానిని 6.2 శాతానికి కుదించింది. కాగా.. ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను భారత జిడిపి 7.5 శాతంగా ఉండవచ్చని ఇక్రా పేర్కొంది. ఇది జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఒ) అంచనా వేసిన 7.6 శాతం కంటే స్వల్పంగా తక్కువ. వృద్ధి అంచనాలను తగ్గించడానికి గల కారణాలను ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్ వివరించారు. 'పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు నిరంతరాయంగా పెరుగుతున్నాయి. గతంలో మేము బ్యారెల్ చమురు ధర సగటున 85 డాలర్లుగా ఉండవచ్చని అంచనా వేయగా.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇది సగటున 95 డాలర్లకు చేరవచ్చని భావిస్తున్నాము. ఈ ఇంధన ధరల ప్రభావం వల్లే దేశ బేస్‌లైన్ వృద్ధి అంచనాను 6.5 శాతం నుండి 6.2 శాతానికి తగ్గించాల్సి వచ్చింది' అని ఆమె స్పష్టం చేశారు.

