Monday, 11 Nov, 12.00 am ప్రజాశక్తి

తాజావార్తలు
'భరోసా' వర్తింపజేయాల్సిందే

* కౌలు రైతుల ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్లు
* సాధించే వరకూ పోరాటం : వక్తలు స్పష్టీకరణ

ప్రజాశక్తి- యంత్రాంగం
రైతు భరోసా పథకాన్ని తమకు వర్తింజేయాల్సిందేనంటూ ఎపి ఉభయ కౌలు రైతు సంఘాల రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు కౌలు రైతులు సోమవారం ఉద్యమించారు. కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించారు. అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. కౌలు రైతులకు డబుల్‌ ఫైనాన్స్‌తో సంబంధం లేకుండా స్టేట్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం సాగు చేస్తున్న పంటను బట్టి రుణాలు ఇవ్వాలని డిమాండు చేశారు. సిఆర్‌పిసి కార్డులు ఇవ్వాలని క్రాఫ్‌ బుకింగులో వాస్తవ కౌలుదారుల పేర్లను నమోదు చేయాలని కోరారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్‌ సమీపంలోని ధర్నా చౌక్‌లో నిర్వహించిన ధర్నాలో ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలురైతులున్నారని ప్రొఫెసర్‌ రాధాకృష్ణ కమిటీ చెప్పిందని తెలిపారు. భూమిలేని 15 లక్షల మంది కౌలు రైతులకు భరోసా అందిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ అసెంబ్లీ సాక్షిగా చెప్పినా ఆచరణకు నోచుకోలేదన్నారు. ఈ హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎపి రైతు సంఘం (దాసరి భవనం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివిఎస్‌. ప్రసాద్‌ మాట్లాడుతూ 2011 చట్టం ప్రకారం కౌలు రైతులందరికీ పంట రుణాలు ఇవ్వాలని, రాయితీలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. డిప్యూటీ కలెక్టర్‌ చక్రపాణి ధర్నా చౌక్‌ వద్దకు వచ్చి కౌలు రైతు సంఘాల నాయకుల నుంచి వినతి పత్రాన్ని స్వీకరించారు. అధికారుల స్థాయిలో పరిష్కరిం చాల్సిన సమస్యలను చర్చించి పరిష్కరిస్తామని, విధాన పరమైన నిర్ణయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని ఆయన హామీ ఇచ్చారు. నూజివీడులో కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగబోయిన రంగారావు, కె. నాగేశ్వరరావు పాల్గొన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని జిల్లా కలెక్టరేట్‌, నరసా పురంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద కౌలురైతులు మహాధర్నాలు నిర్వహించారు. నరసాపురం జరిగిన ధర్నాలో ఎపి కౌలురైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వ వైఖరి వల్ల రాష్ట్రంలోని 32 లక్షల మంది కౌలు రైతులకు అన్యాయం జరుగుతోంద న్నారు. ఖరీఫ్‌ పూర్తయి రబీ ప్రారంభమైనా నేటికీ పది శాతం మంది కౌలురైతులకు కార్డులుగానీ, రుణాలుగానీ మంజూరు కాలేదని తెలిపారు. జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టం కౌలు రైతులకు శాపంగా మారిందన్నారు. ఈ చట్టాన్ని సవరించి గ్రామసభల ద్వారా కార్డులిచ్చే విధంగా నిబంధనలు రూపొందించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.పెద్దిరెడ్డి మాట్లాడుతూ భూ యజమానితో సంబంధం లేకుండా కౌలురైతులందరికీ గుర్తింపుకార్డులిచ్చి రైతుభరోసా సాయం, పంటరుణాలు, నష్టపరిహారాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజుకు వినతిపత్రం అందజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో పాల్గొన్న ఎపి కౌలురైతు సంఘం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బరావు మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం భూయజమానులకు సేవ చేస్తోందని, కౌలు రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. పంట సాగు చేసిన కౌలు రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. మరణించిన కౌలు రైతుల కుటుంబాలకు నష్టపరిహారం కింద రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కౌలు రైతుల ధర్నాతో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్‌ దద్దరిల్లింది. ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పరిషత్తు సమావేశ మందిరం ఎదుట కౌలు రైతులు ధర్నా చేశారు. ఎపి వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్‌, డివైఎఫ్‌ఐ నాయకులు పాల్గొని సంఘీభావర తెపారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కడప కలెక్టరేట్‌ ఎదుట అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. శ్రీకాకుళంలో ధర్నా అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ కె.శ్రీనివాసులుకు స్పందన కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. విజయనగరం కలెక్టరేట్‌ వద్ద కౌలు రైతులు ధర్నా చేశారు. విశాఖలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్‌ వద్ద రైతు సంఘాల ఆధ్వర్యంలో కౌలు రైతులు నిరసన తెలిపారు. కర్నూలు కలెక్టరేట్‌ ముందు జరిగిన ధర్నాలో జగన్నాథం, పి.రామచంద్రయ్య పాల్గొన్నారు.
అనంతరం స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top
// // // // $find_pos = strpos(SERVER_PROTOCOL, "https"); $comUrlSeg = ($find_pos !== false ? "s" : ""); ?>