క్వాడ్ సదస్సుపై చైనా
బీజింగ్ : ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకుని చేసే ప్రయత్నాలు ప్రజాదరణ పొందవని, భవిష్యత్ కూడా వుండదని చైనా వ్యాఖ్యానించింది.
ఈ నెల 24న అమెరికా అధ్యక్షతన వాషింగ్టన్‌లో జరగనున్న క్వాడ్ సదస్సుకు భారత ప్రధాని మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిడె సుగా హాజరు కానున్నారు. దేశాల మధ్య సహకారం తృతీయ పక్షాలను లక్ష్యంగా చేసుకోరాదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ వ్యాఖ్యానించారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధికి చైనా చోదక శక్తిగా మాత్రమే కాదు, శాంతి పరిరక్షణలో ప్రధాన శక్తిగా కూడా వుండాలని కోరుకుంటున్నామని చెప్పారు. సంబంధిత దేశాలన్నీ ప్రచ్ఛన్న యుద్ధం మనస్తత్వాన్ని, సంకుచిత స్వభావంతో కూడిన భౌగోళిక, రాజకీయ శతృత్వ భావనను విడనాడాల్సి వుందన్నారు. ఈ ప్రాంతంలోని ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ, ప్రాంతీయ సంఘీభావానికి, సహకారానికి అనుగుణంగా మరిన్ని చర్యలు చేపట్టాల్సి వుందన్నారు.

