Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చిన్నారులపై కరోనా పడగ

చిన్నారులపై కరోనా పడగ

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: కరోనా వైరస్‌ దయాదాక్షిణ్యం లేకుండా విరుచుపడుతోంది. ఒంగోలు నగరంలో సంవత్సరం నిండిన ఓ బాలిక కరోనా బారిన పడింది. అద్దంకిలో మూడేళ్ళ బాలునికి కరోనా వైరస్‌ సోకింది. ఇప్పటివరకు 0-10ఏళ్ల లోపు వారు 154 మంది వైరస్‌ బారిన పడి చికిత్స పొందుతున్నారు. 10-20 ఏళ్ళ లోపు సుమారు 1200 మంది కోవిడ్‌ బారిన పడ్డారు. చిన్నారులలో తల్లిదండ్రుల నుంచి వ్యాధి సోకుతోంది. చిన్నారుల పట్ల అప్త్రమతంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో నెల రోజుల పాటు చిన్నారులు, వారి తల్లిదంద్రులు అప్రమత్తంగా ఉంటేనే వైరస్‌ బారిన పడకుండా ఉండవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
చిన్నారులపై కరోనా వైరస్‌ పడగ విప్పుతోంది.

20 సంవత్సరాల లోపు వారు 18 శాతం వైరస్‌ బారిన పడుతున్నారు. గత ఏడాది కరోనా మహమ్మారి విజృంభించిన 10 ఏళ్ళు లోపు చిన్నారులు కేవలం 8 శాతం మంది మాత్రమే కరోనా వైరస్‌ బారిన పడ్డారు. కరోనా వైరస్‌ రూపాలు మార్చుకోవటంతో ఏడాది చిన్నారులు ఎక్కువ మంది వైరస్‌కు గురవుతున్నారు. ఇటువంటి పరిణామం ఆందోళన కలిగిస్తోంది. గత నెలలో అన్ని వయస్సుల వారిని కలుపుకుంటూ 6398 మంది వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో 0-9 సంవత్సరాల లోపు చిన్నారులు 158(0.9 శాతం), 10-20 సంవత్సరాల లోపు చిన్నారులు 1200(10.20శాతం) మంది కరోనా వైరస్‌ బారిన పడటం తల్లిదండ్రుల్లో భయాందోళనలకు కారణమవుతోంది. అదేవిధంగా 21-40 సంవత్సరాల లోపు 2531(21.40శాతం) మంది, 41-59 సంవత్సరాల లోపు 1794(4.59 శాతం), 60 సంవత్సరాలు పైబడిన వారు 864 మంది వైరస్‌కు గురికావటం వ్యాధి తీవ్రతకు అద్దం పడుతోంది. కరోనా సెకండ్‌ వేవ్‌లో యువత కరోనా బారిన పడటం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఆయా వయస్సు గ్రూపుల వారు కరోనా వైరస్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
తల్లిదండ్రుల నుంచి సోకుతున్న వైరస్‌
చిన్నారులలో ప్రధానంగా తల్లిదండ్రుల నుంచే కరోనా వైరస్‌ సోకుతుంది. ఒక కుటుంబంలో తల్లి, తండ్రితో పాటు ఇద్దరు చిన్నారులు ఉంటే ఒకరు వైరస్‌ బారిన పడితే కుటుంబమంతటికీ సోకుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం చిన్నారులు ఇంట్లో మాస్క్‌ ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. కుటుంబమంతా ఒకేచోట కలసి ఉండటంతో వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో సైతం కరోనా నిబంధనలను కట్టుదిట్టంగా పాటించాలని వారు సూచిస్తున్నారు. చిన్నారులు భౌతిక దూరం పాటించటం, మాస్క్‌ ధరించటం, చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవటంతో పాటు వ్యక్తిగత శుభ్రతపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
డాక్టర్‌ తిరుమలరావు, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఇన్‌ఛార్జి
చిన్నారులలో కరోనా వైరస్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ విషయమై తల్లిదండ్రులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. చిన్నారులు అనవసరంగా బయట తిరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించటంతో చిన్నారులను ఇంట్లో ఉంచి కరోనా నిబంధనలు పాటించటం తప్పనిసరి. ముఖ్యంగా చిన్నారులు మాస్క్‌ ధరిస్తూ భౌతిక దూరం పాటించేలా చూడాలి. తద్వారా వైరస్‌ బారినపడే అవకాశాలను తగ్గించవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti