Dailyhunt
చిన్ని చెల్లి - తెల్ల పిల్లి​

చిన్ని చెల్లి - తెల్ల పిల్లి​

చిన్నిచెల్లి, చిట్టి చెల్లి ​ఆ ఇంటను బుల్లి చెల్లి
​మంకుపట్టు పట్టిందంటే
​పెంకు లెగిరి పోతవి మరి.
ఒక్కరోజు ఉదయాన్నే
​మొదలెట్టింది రాగం.
​ఏమికావాలో చెప్పదు.

​ఏడుపేమో ఆపలేదు.
​అప్పుడే వచ్చినాడు
​అన్న చిన్ని కృష్ణుడు.
​చెల్లెలికి అన్నవాడు.
​దాని మనసు తెలిసినోడు.​
కుక్కపిల్ల కావాలా
​పిల్లి పిల్ల కావాలా
​రెక్కల గుర్రం తేవాలా
​చుక్కల గౌను తేవాలా
​అంటూ బుజ్జగించినాడు
​మంచినీరు ఇచ్చినాడు
​అన్న అన్నమాటలకు
​తెప్పరిల్లే బుల్లి చెల్లి
పిల్లి పిల్ల కావాలి
​తెల్లరంగు ఉండాలి
​మ్యావ్ మ్యావ్ అనాలి
​పెట్టింది తినాలి
​అంటూ తన మాటచెప్పి
​మళ్ళీ మొదలు పెట్టింది
ఆరన్నోకటవ రాగం
​ఆపమన్న ఆపకుండా
చెల్లె కోరిక తీర్చాలని
​వీధులన్నీ తిరిగే అన్న
ఒక్కరోజు ఉదయాన్నే
​మొదలెట్టింది రాగం.
​ఏమికావాలో చెప్పదు.
​ఏడుపేమో ఆపలేదు.
​నల్ల పిల్లి లే గాని
​తెల్ల పిల్లి దొరకదాయే
​అలసిపోయి కూర్చొన్న
​కృష్ణ పక్క చేరెనొకడు
​తెల్లపిల్లి లేకపోతే
​తల్లడిల్లి పోవుటేల
నల్లపిల్లి ఒకటిపట్టి
​తెల్లరంగు వేస్తే పోలే
​సలహా ఒకటిచ్చినాడు
​కాలరు ఎగరేసినాడు
వాడి సలహా నచ్చింది
​నల్లపిల్లి దొరికింది
​తెల్లరంగు తెచ్చివేయ
​రంగుమారి పోయింది
​దానికొక్క బొట్టుపెట్టి
​చెల్లి చేతి కందివ్వగ
​చిన్నచెల్లి మురిసిపోయే
​ఆటలాడి అలసిపోయే
సాయంత్రం కాగానే
​స్నానానికి పోయేచెల్లి
​తనతో పాటుగా పిల్లిని
​నీళ్లు పోయ తీసుకెళ్లే
సబ్బురుద్ది నీళ్లు పోయ
పిల్లి రంగు మారిపోయే
​తెల్లపిల్లి రంగు పోయి
​నల్ల పిల్లి అయిపోయే
ఒక్కసారి పిల్లి నొదిలి
​అన్నకడకు పరిగెత్తి
​పిల్లి రంగు మారిందని
​చెప్పి ఏడ్చే బుల్లి చెల్లి
సబ్బు రుద్ద కూడదమ్మ
​అది మనకు మాత్రమే
​జంతువులకు రుద్దితే
​రంగు ఇట్లే పోవును
మరలా ఓ మంచిదాన్ని
​వెతికి తెచ్చి ఇస్తాను
​అంతవరకు బుద్దిగా
​చదువుకోవాలి చక్కగా
​అంటూ ఓదార్చినాడు
​దారిలోకి తెచ్చినాడు
​అర్థమయ్యేలా చెప్పాడు
​ముద్దులెన్నో ఇచ్చాడు

​- కూచిమంచి నాగేంద్ర
​91821 27880

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti