Dailyhunt
డెయిరీ కాలుష్యంతో ఇబ్బందులు

డెయిరీ కాలుష్యంతో ఇబ్బందులు

ప్రజాశక్తి -గాజువాక : విశాఖ డెయిరీ కాలుష్యంతో అక్కిరెడ్డిపాలెం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు తెలిపారు.

గాజువాక పరిసర ప్రాంతాల్లో కాలుష్య నివారణ కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన చేపట్టిన పాదయాత్ర మూడో రోజు అక్కిరెడ్డిపాలెంలో సాగింది. మంగళవారం పాదయాత్రను జగ్గునాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖ డెయిరీ అక్కిరెడ్డిపాలెంతోపాటు గాజువాక పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన కాలుష్యం వెదజల్లుతుందన్నారు. దీనివల్ల ప్రజలు అనేక వ్యాధులకు గురవుతున్నారని చెప్పారు.

విశాఖ డెయిరీ యాజమాన్యం రూ.వేల కోట్లలో ఆదాయం సంపాదిస్తున్నా.. కాలుష్య నివారణకు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చలేదు సరికదా, డెయిరీ యాజమాన్యంతో కుమ్మక్కై కాలుష్య నివారణ చర్యలు చేపట్టలేదని విమర్శించారు. డెయిరీ యాజమాన్యం దాదాపుగా 315 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించి దుర్మార్గమైన చర్యకు పాల్పడిందన్నారు.

కాలుష్యంపై వెంటనే విశాఖ డెయిరీ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే సంప్రదించి తగు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సిపిఎం గాజువాక జోన్‌ కార్యదర్శి ఎం.రాంబాబు మాట్లాడుతూ, అక్కిరెడ్డిపాలేనికి ఆనుకొని విశాఖ డెయిరీతో పాటు ప్రజల ప్రాణాలను తీసే కాలుష్యంతో కూడిన గొడౌన్లను ఏర్పాటుచేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే డెయిరీ వల్ల అనేకమంది కేన్సర్‌ వంటి వ్యాధులకు గురయ్యారన్నారు. అక్కిరెడ్డిపాలెం, పంచవటి టౌన్‌షిప్‌, డెయిరీ కాలనీ, సింగపూర్‌ కాలనీలో పాదయాత్ర సాగింది. ప్రతి ఇంటికీ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి వై.సత్యవతి, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు డాక్టర్‌ రమేష్‌ కుమార్‌, త్రినాధ్‌ స్వామి, లోకేష్‌, ఎం.రమణ, ఎస్‌.జగన్నాథరావు, దాసరి అప్పారావు, జె.కోటేశ్వరరావు, ఎస్‌.అప్పలరాజు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti