చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు కూడా చేరకముందే ఐపీఎల్ నుంచి నిష్క్రమించే పరిస్థితి నెలకొనగా, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని భవిష్యత్తుపై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
వచ్చే సీజన్‌లో ధోనీ మళ్లీ పసుపు జెర్సీలో కనిపిస్తాడా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందిస్తూ, ధోనీ కొనసాగింపుపై తుది నిర్ణయం తనది కాదని, జట్టు యాజమాన్యమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. యువ ఆటగాళ్లను తీర్చిదిద్దే ఉద్దేశంతో ఈ సీజన్‌లో సీఎస్‌కే ధోనీని 'అన్‌క్యాప్డ్ ప్లేయర్'గా జట్టులో కొనసాగించింది. అయితే గాయం కారణంగా ఆయన ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయారు. లీగ్ దశలో ఇంకా ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ, ధోనీ ఇప్పటివరకు బ్యాట్ పట్టకపోవడంతో పాటు వికెట్ కీపింగ్ గ్లౌజులు కూడా ధరించలేదు. అయినప్పటికీ, డ్రెస్సింగ్ రూమ్‌లో ఆయన ఉనికి యువ ఆటగాళ్లకు ఎంతో ప్రేరణగా నిలిచిందని, జట్టుపై ధోనీ ప్రభావం ఇప్పటికీ బలంగానే ఉందని ఫ్లెమింగ్ పేర్కొన్నారు.
ఈ సీజన్ మొత్తం ధోనీ గైర్హాజరు చుట్టూ అనేక ఊహాగానాలు వినిపించాయి. గాయం కారణంగానే ఆయన దూరంగా ఉన్నారని సీఎస్‌కే యాజమాన్యం అధికారికంగా తెలిపినా, యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశపూర్వకంగానే పక్కకు తప్పుకున్నారనే వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి.

