వాణిజ్య సిలిండర్‌పై రూ.42 పెంపు@ఐదు కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్‌పై రూ.11 వడ్డన
@దేశ ప్రజలకు మోడీ సర్కారు మరో షాక్
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ సర్కారు ఒకటో తారీఖున దేశ ప్రజలకు మరోసారి షాకిచ్చింది.
దేశంలో ఎల్ పిజి ధరలు మళ్లీ పెంచింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను రూ.42 పెంచింది. దీంతో ఢిల్లీలో ఒక సిలిండర్ ధర రూ.3,113.50కు చేరింది. అలాగే ఐదు కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్ పిజి సిలిండర్‌పై కూడా రూ.11 పెరిగి.. ధర రూ.821.50కు ఎగబాకింది. పెరిగిన ధరలతో వ్యాపార సంస్థలు, చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు, టీ దుకాణాలు, హాస్టళ్లు వంటి వాణిజ్య వినియోగదారులు ఈ పెంపు ప్రభావాన్ని నేరుగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ అదనపు భారం చివరకు వినియోగదారుల పైనే పడే అవకాశం ఉంది. ఇప్పటికే దేశంలో పెరిగిన నిత్యవసర ధరలతో ఆర్థికంగా పెను భారాన్ని మోస్తున్న సామాన్యుడికి.. గ్యాస్ ధరల వరుస వడ్డనలు మరింత షాక్ ఇస్తున్నాయి.
ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కమర్షియలు సిలిండర్ ధరలు ఒక్కోలా ఉన్నాయి. ఢిల్లీలో ఒక్క సిలిండర్‌పై రూ.42 పెరిగింది. దీంతో.. ధర రూ.3,113.50కు చేరుకుంది. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో రూ.53.50 పెంపు అమల్లోకి రావడంతో ధర రూ.3,255.50కు ఎగబాకింది. ఇక తెలంగాణలోని హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్‌పై రూ.52 పెరిగి.. దాని ధర రూ.3,315కు చేరుకుంది. విజయవాడలో వీటి ధరలు రూ.3,251.50, విశాఖపట్నంలో రూ.3,146.50కి ఎగబాకాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చమురు సంస్థలు చెప్తున్నాయి. ఇజ్రాయిల్-ఇరాన్ ఘర్షణలు, హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణాపై ఆంక్షలు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. ఫలితంగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 93 డాలర్లకు పైగా చేరింది. భారత తన చమురు అవసరాల్లో సుమారు 88 శాతం దిగుమతుల పైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో మోడీ సర్కారు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోని కారణంగా అంతర్జాతీయ ధరల పెరుగుదల దేశీయ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోందని విశ్లేషకులు చెప్తున్నారు.
మోడీ సర్కారు వైఫల్యం.. ప్రజలపై భారం
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ముందు చూపుతో వ్యవహరించాల్సిన మోడీ సర్కారు అటు వైపుగా ఆలోచనలు చేయలేదని పలువురు విమర్శిస్తున్నారు. ఇంధన ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యూహం రూపొందించడంలో విఫలమైందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు . అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గినప్పుడు దాని ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించని మోడీ సర్కారు… ధరలు పెరిగిన ప్రతీసారీ భారం ప్రజలపై మోపుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా చిరువ్యాపారులు, వలస కార్మికులు వినియోగించే 5 కిలోల సిలిండర్ ధర పెంపు సామాన్య వర్గాలపై మరింత ఒత్తిడి తీసుకువస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధాలు, అంతర్జాతీయ సంక్షోభాలు, దిగుమతి ఆధారిత ఇంధన విధానం, ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేకపోవడం వంటి కారణాలతో దేశ ప్రజలు మళ్లీ ధరల భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

