పారిస్ : హార్ముజ్ జలసంధి మూసివేతతో ఏప్రిల్‌లో చమురు సరఫరాలో అంతరాయం రెట్టింపు కానుందని, ఐరోపాపై కూడా తీవ్ర ప్రభావం పడనుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఇఎ) అధ్యక్షుడు ఫతిహ్ బిరోల్ బుధవారం పేర్కొన్నారు.
ఎల్‌ఎన్‌జి నష్టానికి అదనంగా, ఏప్రిల్‌లో చమురు నష్టం మార్చి కన్నా రెట్టింపు కానుందని అన్నారు. ప్రస్తుతం ప్రధానంగా జెట్ ఇంధనం, డీజిల్ కొరత ఆసియాదేశాల్లో చూస్తున్నామని, ఏప్రిల్ లేదా మేలో ఈ సంక్షోభం ఐరోపాను కూడా చుట్టుముట్టనుందని అన్నారు. నార్జెస్ బ్యాంక్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిఇఓ నికోలాయ్ టాంగెన్‌తో ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న బిరోల్ మాట్లాడుతూ.. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇప్పటివరకు రోజుకు 12 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా నిలిచిపోయిందని అన్నారు. యుద్ధంతో మధ్యప్రాచ్యంలో సుమారు 40 కీలక ఇంధన వనరులు దెబ్బతిన్నాయని అన్నారు. జెట్ ఇంధనం, డీజిల్ కొరత ప్రస్తుతం ఉన్న అతిపెద్ద సమస్యలని, ఒక వేళ ముడి చమురు సంక్షోభం ఏర్పడితే ఐఇఎ జోక్యం చేసుకునే అవకాశం ఉందని అన్నారు. ఇంధన కొరతను, ధరల పెరుగుదలను భర్తీ చేసేందుకు వ్యూహాత్మక నిల్వల నుండి రికార్డు స్థాయిలో చమురు నిల్వలను విడుదల చేసేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే.

