Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎరువుల ధరలు మళ్లీ పెంచిన ఫాక్ట్

ఎరువుల ధరలు మళ్లీ పెంచిన ఫాక్ట్

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి-అమరావతి : కేంద్ర ప్రభుత్వ సంస్థ 'ది ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌' (ఎఫ్ఎసిటి-ఫాక్ట్‌) మరొకసారి ఎరువుల ధరలను పెంచింది.

తాను ఉత్పత్తి చేస్తున్న ఫాక్టంఫాస్‌ (20ః20ః0ః13) కాంప్లెక్స్‌ ఎరువు ధరను 50 కిలోల బస్తాపై ఈ నెలలో రెండు విడతల్లో రూ.600 పెంచింది. తొలుత రూ.300 పెంచడంతో అంతకుముందు బస్తా రూ.1,500 ఉన్నది కాస్తా 1,800 అయింది. మరొకసారి బస్తాపై రూ.300 పెంచింది. దాంతో బస్తా ధర 2,100 అయింది.

కొత్త ఎంఆర్‌పి శనివారం (మే 16) నుంచి అమల్లోకొచ్చినట్లు ఫాక్ట్ కంపెనీ పేర్కొంది. ఆ సంస్థ ఉత్పత్తి చేస్తున్న అమ్మోనియం సల్ఫేట్‌ ఎరువును సైతం బస్తాపై ఎకాయికిన రూ.430 పెంచింది. ఇంతకుముందు ఆ ఎరువు రేటు 970 ఉండగా ధర పెంచడంతో 1,400కు చేరింది. ఈ కొత్త ఎంఆర్‌పి సైతం శనివారం నుంచి అమల్లోకొచ్చినట్లు సదరు కంపెనీ వెల్లడించింది.

యుద్ధం బూచిని ఎరువుల కంపెనీలు ముందుకు తెచ్చి ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నాయంటూ ఇష్టానుసారం ఎరువుల ధరలను పెంచుతున్నాయి. అందుకు కేంద్రం అనుమతిస్తూ పోతోంది. ప్రస్తుతానికి యూరియా, డిఎపి ధరలు మాత్రమే పెరగలేదు. అందుక్కారణం వాటికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సబ్సిడీ భరిస్తోంది.

ఆ సబ్సిడీ కూడా తగ్గించుకొనేందుకు పలు దారులు వెతికింది. వాటి వాడకాన్ని బలవంతంగా తగ్గించేందుకు ప్రణాళికలు వేసింది. తతిమ్మా రసాయన ఎరువులకు నామమాత్రపు రాయితీతో సరిపెడుతోంది. అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు పెరిగిన సందర్భాల్లో, రూపాయి రికార్డు స్థాయి పతనం నేపథ్యంలోనూ పెరిగిన ఉత్పత్తి ఖర్చులకనుగుణంగా పోషకాధారిత సబ్సిడీని (ఎన్‌బిఎస్‌) పెంచడానికి మోడీ సర్కార్‌ సిద్ధపడట్లేదు.

ఎరువుల ధరలు పెంచి రైతులపై భారాలు మోపేందుకు సంకేతాలిస్తోంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఫాక్ట్‌ ఈ నెలలోనే రెండు తడవల్లో రూ.300 వంతున భారీగా ధరలు పెంచింది. ప్రభుత్వ సంస్థనే ఈ రకంగా ధరలు పెంచిందంటే, తన యాజమాన్యంలోని కంపెనీకి కూడా మోడీ ప్రభుత్వం అదనపు ఉత్పత్తి ఖర్చులు భరించట్లేదని అర్థమవుతుంది. ఈ పర్యవసానంగా ఇతర ప్రభుత్వ రంగ, సహకార, ప్రైవేట్‌ కంపెనీలు ఇంకా ఇంకా ఎరువుల ధరలు పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా కేంద్రం డీజిల్‌, పెట్రోలు ధరలు పెంచడం వలన మరింతగా ఎరువుల ధరలు పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్‌ వర్గాలు అంచనా వేశాయి. కాగా సరగ్గా సమయం చూసి ఖరీఫ్‌ ముంగిట కంపెనీలు తక్కువ వ్యవధిలో విడతల వారీగా ఎరువుల ధరలు పెంచడం వలన రైతులు అదనపు భారం మోయాల్సి వచ్చింది. సంక్షోభంలో ఉన్న రైతాంగానికి ఈ పరిణామం గోరుచుట్టుపై రోకలిపోటు చందం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti