Dailyhunt
'ఎస్ఐఆర్` పేరుతో ఓట్లను దొంగతనం చేశారు : మమతా

'ఎస్ఐఆర్` పేరుతో ఓట్లను దొంగతనం చేశారు : మమతా

కొల్ కతా : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 'ఎస్ఐఆర్` పేరుతో బిజెపి ఓట్లను దొంగతనం చేసిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి నాయకులు మమతా బెనర్జీ విమర్శించారు.

సోమవారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న సందర్భంగా ఆమె ఈ విమర్శలు చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. 'ఏజెంట్లు, అభ్యర్థులు ఎవరూ కౌంటింగ్‌ కేంద్రాలను విడిచి వెళ్లొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది బిజెపి పథకం.

మొదటి రెండు, మూడు రౌండ్లలో వారే ఆధిక్యంలో ఉన్నట్లుగా చూపిస్తారని నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను. కొన్నిచోట్ల రెండు, మూడు రౌండ్ల తర్వాత కౌంటింగ్‌ ఆపేశారు. టిఎంసి అణచివేసేందుకు కేంద్ర బలగాలను బలవంతంగా ఉపయోగిస్తున్నారు. సీట్ల ఆధిక్యంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు.

ఎన్నికల సంఘం కేంద్ర బలగాలతో కలిసి ఇష్టానుసారం వ్యవహరిస్తోంది. రాష్ట్ర పోలీసులు కూడా కేంద్ర బలగాలకు పూర్తిగా లొంగిపోయారు' అని మమత ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ ఏజెంట్లు, కార్యకర్తలు ఆందోళన చెందొద్దని, ధైర్యంగా ఉండాలని కోరారు. ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయని..

తుది ఫలితాల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. బిజెపి ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తోందని, ఇందులో భాగంగా బిజెపి ముందుగా తమకు అనుకూలమైన ఫలితాలను చూపిస్తుందని తనకు ముందే తెలుసని, ఆ విషయాన్ని తాను ముందే ఊహించానని ఆమె అన్నారు. అయినప్పటికీ తాను, తన పార్టీ కార్యకర్తలు పులిపిల్లల వలే పోరాడుతామని చెప్పారు. ఎస్ ఐఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. సీట్లు గెలుచుకోవడానికి ఎస్ఐఆర్ పేరుతో ఓట్లను దోచుకున్నారని ఆరోపించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti