ఎపిఇపిడిసిఎల్ సిఎండి పృథ్వీతేజ్, ఎమ్మెల్యే నాగమాధవి
డెంకాడలో సోలార్ ప్లాంట్లు ప్రారంభం
ప్రజాశక్తి-డెంకాడ : ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం కింద డెంకాడ మండలంలోని ఎస్‌సి కాలనీలో రెండు 2 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్లను ఎపిఇపిడిసిఎల్ చైర్మన్ ,మేనేజింగ్ డైరెక్టర్ ఇమ్మడి పృథ్వీతేజ్, ఎమ్మెల్యే లోకం నాగ మాధవి మంగళవారం ప్రారంభించారు.
ఈ ప్లాంట్లను లబ్ధిదారులు సిహెచ్. రాంబాబు, శ్రీ సిహెచ్. లక్ష్మణ గార్ల ఇళ్ల వద్ద ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఎమ్‌డి పృథ్వీతేజ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా దేశవ్యాప్తంగా కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తి చేయడమే కాకుండా వినియోగదారులకు విద్యుత్ బిల్లుల్లో గణనీయమైన ఆదా కలుగుతుందని తెలిపారు.
ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం రూ.75,021 కోట్ల సబ్సిడీని కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని విస్తతంగా అమలు చేస్తూ, ఎస్‌సి, ఎస్‌టి వినియోగదారుల కోసం యుటిలిటీ లెడ్ అగ్రిగేషన్ విధానంలో 2 కిలోవాట్ల సౌర రూఫ్‌టాప్ ప్లాంట్లను ఉచితంగా ఏర్పాటు చేస్తోందన్నారు. జిల్లాలో మొత్తం 50,946 ఎస్సీ, ఎస్టీ గహ వినియోగదారులలో మొదటి విడతగా 15,018 మందికి రూ.170.48 కోట్ల వ్యయంతో 30.04 మెగావాట్ల సౌర రూఫ్‌టాప్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే లోకం నాగ మాధవి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం జగ్జీవన్ జ్యోతి యోజన ద్వారా ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు.
నియోజకవర్గంలో 5089 మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు ఉండగా, మొదటి విడతగా 1443 మందికి 2.866 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.16.29 కోట్ల రాయితీ అందిస్తున్నట్లు చెప్పారు. తీరప్రాంత గ్రామాల వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలన్నారు. డెంకాడ గ్రామంలో 21 సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవడానికి ఎస్‌సి, ఎస్‌టి కుటుంబాలు ముందుకు వచ్చాయన్నారు. మండలంలో 246 కుటుంబాలు ఈ ఉచిత సోలార్‌కు ముందుకు వచ్చాయని వీటిలో 128 కుటుంబాలకు సోలార్ ప్యానల్ బిగించామని చెప్పారు. కార్యక్రమంలో విద్యుత్తుశాఖ ఎస్‌ఇ ఎం.లక్ష్మణరావు, రూరల్ ఎస్‌ఇ ఆపరేషన్ జి.సురేష్ బాబు, డిఇ ఆపరేషన్ భోగాపురం సిహెచ్ మాధవ నాయుడు, ఎఇ అప్పలస్వామినాయుడు, ఎంపిపి బంటుపల్లి వెంకట వాసుదేవరావు, మాజీ ఎంపిపి కంది చంద్రశేఖరరావు, మాజీ జెడ్‌పిటిసి కందిసూర్యనారాయణ, టిడిపి నాయకులు పాణిరాజు, జనసేన రీజనల్ కోఆర్డినేటర్ తుమ్మిలక్ష్మీ రాజ్, మండల జనసేన కోఆర్డినేటర్ పైలశంకర్, జనసేన నాయకుడు సిరి అప్పారావు విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. .

