Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎవరికీ లేని పరీక్ష .... మాకెందుకు ఈ శిక్ష...

ఎవరికీ లేని పరీక్ష .... మాకెందుకు ఈ శిక్ష...

  • ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి

  • స్పందించని ప్రభుత్వం, విద్యాశాఖపై యూటీఎఫ్‌ ఆగ్రహం

  • విద్యా భవన్‌ ముట్టడికి తరలివచ్చిన ఉపాధ్యాయుల అరెస్టులు

మంగళగిరి రూరల్: ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ యూటీఎఫ్‌ చేపట్టిన ఆందోళనలో భాగంగా గురువారం మంగళగిరి ఆత్మకూరులోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ విద్యా భవన్‌ ముట్టడికి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు తరలివచ్చారు. ఉపాధ్యాయుల సమస్యపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జోక్యం చేసుకోవాలని యూటీఎఫ్‌ ఇప్పటికే కార్యాచరణ ప్రకటించినప్పటికీ ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు నాయకులు తెలిపారు. గురువారం ఉదయం 9 గంటలకు ఆందోళన ప్రారంభమైంది. విద్యా భవన్‌ ముట్టడికి వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న ఉపాధ్యాయులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టు చేశారు. పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు తరలిరావడంతో పోలీసులు పలుదఫాలుగా అరెస్టులు కొనసాగించారు. అరెస్టు చేసిన ఉపాధ్యాయులను పోలీసు వాహనాలతో పాటు స్కూల్‌ బస్సుల్లో వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు.

పెదకాకాని, మంగళగిరి, మంగళగిరి పట్టణ, మంగళగిరి రూరల్‌, తాడేపల్లి తదితర పోలీస్‌స్టేషన్లకు ఉపాధ్యాయులను తరలించినట్లు యూటీఎఫ్‌ నాయకులు తెలిపారు. పలుచోట్ల ఉపాధ్యాయుల అరెస్టులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ తమ డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయులు ఆందోళన కొనసాగించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క వెంకటేశ్వర్లు, యూటీఎఫ్‌ సీనియర్‌ నాయకులు హనుమంతరావు తదితరులు ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు విషయంలో ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయుల సమస్యపై ప్రభుత్వం స్పందించకుండా అరెస్టులకు పాల్పడటం సరైన విధానం కాదని విమర్శించారు.

ఉపాధ్యాయుల డిమాండ్లపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని, ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు కల్పించాలని వారు కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని యూటీఎఫ్‌ నాయకులు స్పష్టం చేశారు.

స్పెషల్ టెట్ సమస్యల పరిష్కారానికై ఉపాధ్యాయులు చేపట్టిన చలో విద్యాభవన్ ను పోలీసులు అడ్దకున్నారు. విద్యాహక్కు చట్టం సెక్షన్ 23(1)కు సవరణ చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని స్పెషల్ టెట్ అర్హత మార్కులు 40%కు తగ్గించాలని, పరీక్షను ఆఫ్ లైన్ లో నిర్వహించాలని, భోధిస్తున్న సబ్జెక్టులోనే టెట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ చలో విద్యాభవన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకొని పలువురు ఉపాధ్యాయులను అరెస్టు చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti