Dailyhunt
ఎయు చరిత్రను గ్రంథస్తం చేయించండి

ఎయు చరిత్రను గ్రంథస్తం చేయించండి

ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ : ఆంధ్రవిశ్వవిద్యాలయం వందేళ్ల చరిత్రను, విశిష్టతను భవిష్యత్‌ తరాలకు తెలియజేసే విధంగా ఎయు చరిత్రను గ్రంథస్తం చేయాలని పూర్వ రాజ్యసభ సభ్యులు, విశ్వ హిందీ పరిషత్‌ చైర్మన్‌ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ అన్నారు.

ఆంధ్రవిశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆధ్వర్యంలో శతాబ్ధి ఉత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీరామినేని కోదండ రామయ్య భవనంలో నిర్వహించిన శతాబ్ధి సాహితీ మహోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ప్రతిష్ట, విశిష్టతను, ముఖ్య ఘట్టాలను తెలిపే విధంగా ఒక ప్రత్యేక మ్యూజియాన్ని సైతం ఏర్పాటు చేసే దిశగా కృషి చేయాలని సూచించారు. వీటి వల్ల భవిష్యత్‌ తరాలకు ఆంధ్రవిశ్వవిద్యాలయం స్థాపన, ప్రగతి, వికాసం తెలిసే అవకాశం కలుగుతుందన్నారు. భాష, సాహిత్యం నేడు సామాన్యునికి చేరువయ్యాయని తెలిపారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఉపకులపతిగా పనిచేసిన సమయంలో సాహిత్యాన్ని ప్రోత్సహించిన విధానం, సందర్భాలను వివరించారు. ఎయు విసి ఆచార్య జి.పి రాజశేఖర్‌ మాట్లాడుతూ, ఎయు త్వరలో మరొక శతాబ్ధంలోకి అడుగు పెడుతుందన్నారు. ఇటువంటి క్రమంలో సాంకేతికత, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా తాను స్వయంగా రచించిన కొన్ని హైకూలను వేదికపై చదివి వినిపించారు. తెలుగు విభాగాధిపతి ఆచార్య జర్రా అప్పారావు తెలుగు శాఖ గొప్పదనాన్ని, భాష, సాహిత్య రంగాలకు విభాగం అందించిన సేవలను వివరించారు. కార్యక్రమంలో ప్రముఖ కవులు అట్టాడ అప్పల నాయుడు, తల్లావజఝల పతంజలి శాస్త్రి, తెలుగు బిఒఎస్‌ చైర్మన్‌ ఆచార్య నల్లా సత్యనారాయణ తదితరులు ప్రసంగించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti