న్యూఢిల్లీ : యుఎఇలోని ఫుజైరా పెట్రోలియం జోన్ (ఎఫ్ఒఐజెడ్)లో భారతీయులపై జరిగిన దాడిని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) ఖండించింది. ఫుజైరాలో సోమవారం జరిగిన డ్రోన్ దాడిలో అగ్నిప్రమాదం సంభవించడంతో ముగ్గురు భారతీయ పౌరులు గాయపడిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనను ఖండిస్తూ ఎంఇఎ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ దాడి ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలపై, అమాయక పౌరులు లక్ష్యంగా జరుగుతున్న దాడులను తక్షణమే నిలిపివేయాలని పిలుపునిచ్చారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు, పశ్చిమ ఆసియా అంతటా శాంతి, స్థిరత్వం పునరుద్ధరించేందుకు దౌత్యం, చర్చలు చేపట్టేందుకు భారత్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం.. హార్ముజ్ జలసంధి నుండి స్వేచ్ఛాయుత, నిరాటంకమైన నౌకాయానం, వాణిజ్యం జరగాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సమస్యల శాంతియుత పరిష్కారం కోసం చేసే అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

