Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గాజాకు వెళ్తున్న సహాయక నౌకలను అడ్డుకున్న ఇజ్రాయెల్

గాజాకు వెళ్తున్న సహాయక నౌకలను అడ్డుకున్న ఇజ్రాయెల్

జెరూసలేం/ఇస్తాంబుల్: గాజాలోని పౌరులకు మానవతాసాయాన్ని చేరవేసేందుకు అంతర్జాతీయ జలాల గుండా ప్రయాణిస్తున్న 'గ్లోబల్ సుముద్ ఫ్లొటిల్లా' నౌకలను ఇజ్రాయిల్ దళాలు అడ్డుకున్నాయి.

తూర్పు మధ్యధరా సముద్రంలో తమకు చెందిన 41 పడవలను ఇజ్రాయెల్ సైన్యం అడ్డగించిందని నిర్వాహకుల బృందం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. మరో 10 నౌకలు ఇంకా గాజా వైపు ప్రయాణిస్తున్నాయని, వీటిలో గాజాకు అత్యంత సమీపంలో ఉన్న 'సిరియస్' అనే నౌక ప్రస్తుతం 145 నాటికల్ మైళ్ల దూరంలో ఉందని వారు వెల్లడించారు. మే 14న (గతవారం) దక్షిణ టర్కీ నుండి ఈ ఫ్లోటిల్లా మూడవసారి బయలుదేరింది. 39 దేశాలకు చెందిన 54 నౌకలతో కూడిన ఈ ప్రయాణంలో మొత్తం 426 మంది సభ్యులు ఉన్నారు.

నౌకాదళంలోని శాంతియుత సిబ్బందిపై ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడిని టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ తీవ్రంగా ఖండించారు. మానవతా సాయాన్ని అడ్డుకుంటూ ఇజ్రాయెల్ సాగిస్తున్న ఇలాంటి అక్రమ దాడులకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

గాజా భూభాగం చుట్టూ విధించిన చట్టబద్ధమైన నావికా దిగ్బంధనాన్ని ఉల్లంఘించడానికి ఎవరినీ అనుమతించేది లేదని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ సోమవారమే తీవ్రంగా స్పందించింది. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న నౌకలన్నీ వెంటనే తమ మార్గాన్ని మార్చుకుని, వెనుతిరగాలని హెచ్చరించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti