Dailyhunt
హర్షణీయం

హర్షణీయం

ప్రభుత్వ విభాగాల్లో ఏళ్ల పర్యంతం తాత్కాలిక ప్రాతిపదికన తక్కువ వేతనాలకు పని చేయించుకోవడం శ్రమ దోపిడీ కిందికే వస్తుందని పేర్కొంటూ రాష్ట్ర హైకోర్టు వెలువరించిన తీర్పు స్వాగతించదగినది.

విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌, తెలుగుగంగ ప్రాజెక్టుల్లోని కొందరు ఉద్యోగులు తమకు దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయంపై సవాల్‌ చేయగా హైకోర్టు ధర్మాసనం ప్రగతిశీల తీర్పు చెప్పింది. పిటిషనర్ల సర్వీస్‌లను రెండు మాసాల్లో క్రమబద్ధీకరించాలని ఆదేశించింది. తీర్పులో ధర్మాసనం లేవనెత్తిన పలు అంశాలు ప్రభుత్వాల విధానాలను ఎండగడతాయి. తాత్కాలికం పేరిట అవసరమైనప్పుడల్లా నిరంతరాయంగా పని చేయించుకోవడం శ్రమ దోపిడీయేనని చాలా ఏళ్లుగా కార్మికులు, ఉద్యోగులు వాపోతున్నా ప్రభుత్వాలు నిమ్మకునీరెత్తినట్లున్నాయి. శాశ్వత ప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేయకపోవడం మూలంగా శ్రమ దోపిడీ అంతకంతకూ పెరుగుతూ ఉంది. రెగ్యులర్‌ ఉద్యోగులు చేస్తున్న పనులనే తాత్కాలిక ఉద్యోగులూ చక్కబెడుతున్నారు. కాని జీతాలు, సౌకర్యాల విషయంలో సమానత లేదు. ఇది ఏకపక్షం, రాజ్యాంగ, చట్ట విరుద్ధం అని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం శ్రమ దోపిడీకి ఆస్కారం ఇవ్వకూడదని, రాజ్యాంగ బద్ధంగా, ఆదర్శవంతంగా నడుచుకోవాలని గడ్డి పెట్టింది. తమను పర్మినెంట్‌ చేస్తారన్న ఆశతో ఏళ్లకు ఏళ్లు తక్కువ వేతనాలకు పని చేసి కొత్త ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని న్యాయస్థానం ఆందోళన వెలిబుచ్చింది. కేవలం సాంకేతిక కారణాలతో రెగ్యులరైజేషన్‌ చేయకపోవడమేంటని ప్రశ్నించి ప్రభుత్వాన్ని అభిశంసించినంత పని చేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రపంచబ్యాంక్‌ ఆదేశిత విధానాలు ప్రారంభమయ్యాక ప్రభుత్వరంగంలో ఉద్యోగ నియామకాలు నిలిచిపోయాయి. దేశంలో నయా-ఉదారవాద ఆర్థిక విధానాలు ఊపందుకున్నాక అటు కేంద్ర ప్రభుత్వంలో ఇటు ఆ విధానాలను పుణికిపుచ్చుకున్న రాష్ట్రాల్లో కొత్త రిక్రూట్‌మెంట్‌ తగ్గిపోయింది. రోజువారీ అవసరాల నిమిత్తం కాంట్రాక్టు, ఔట్‌సోర్స్‌ వచ్చి చేరాయి. వీరికి అరకొర జీతాలు తప్ప రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ సహా ఎలాంటి సదుపాయాలూ లేవు. కనీసం టైంస్కేల్‌ కూడా లేదు. మన రాష్ట్రంలో శాశ్వత ఉద్యోగులతో సమాన సంఖ్యలో తాత్కాలిక ఉద్యోగులు పని చేస్తున్నారు. మూడు లక్షల మంది ఔట్‌సోర్స్‌, లక్ష మంది కాంట్రాక్టు, మరో 50 వేల వరకు దినసరి, ఎన్‌ఎంఆర్‌, కంటింజెంట్‌, పార్ట్‌టైం, కన్సాలిడేట్‌ పేర్లతో పని చేస్తున్నారు. అంగన్‌వాడీలు, ఆశాలు, వెలుగు విఒఎలు, మెప్మా ఆర్‌పిలు వెట్టి చాకిరీ చేస్తున్నారు. వాస్తవానికి పాలన సాగేది వీరిపైనన్నది నిజం. వీళ్లు లేకపోతే ప్రభుత్వ పథకాల అమలు అసాధ్యం. ప్రభుత్వానికి, ప్రజలకు వారధులు వీరే. కాని వారు అనుభవిస్తున్న క్షోభను ఆలకించడానికి సిద్ధపడకుండా తమ ప్రభుత్వం ఎంప్లాయి ఫ్రెండ్లీ అని ఎవరు చెప్పినా నీటి మీది రాతగా పరిగణించాల్సి ఉంటుంది.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ల కోసం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ను తలకెత్తుకుంది. ప్రైవేట్‌ పెట్టుబడుల కోసం వెంపర్లాడుతున్న చంద్రబాబు ప్రభుత్వం స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ను ప్రవేశపెట్టింది. రెండు ప్రభుత్వాలూ కార్మిక వ్యతిరేకత, కార్పొరేట్ల అనుకూలతను సంతరించుకొని విధానాలు రూపొందిస్తున్నాయి. స్వాతంత్య్రం పూర్వం నుంచే కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్‌ కోడ్స్‌గా కుదించింది. కార్మిక వర్గం లేబర్‌ కోడ్స్‌ను ఉపసంహరించుకోవాలని పోరాడుతోంది. మోడీ కంటే ముందే రాష్ట్రంలో కార్మిక చట్టాలకు కూటమి ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ తరుణంలో హైకోర్టు వెలువరించిన తీర్పు కార్మికులకు, ఉద్యోగులకు కారుచీకటిలో కాంతి రేఖ. అందుకే అన్ని వర్గాల నుంచి కోర్టు తీర్పుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా గతంలో వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల విషయంలో హైకోర్టు ప్రభుత్వ తీరును తప్పుబట్టగా ప్రభుత్వం స్పందించకుండా దాటవేసింది. ఇప్పుడు కూడా అటువంటి కుయుక్తులకు అవకాశం ఉంది. కార్మికులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. హైకోర్టు తీర్పుకనుగుణంగా తాత్కాలిక ఉద్యోగుల, కార్మికుల సర్వీసులను ప్రభుత్వం తక్షణం క్రమబద్ధీకరించాలి. అప్పటి వరకు రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సదుపాయాలు కల్పించాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti