ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : హంద్రీనీవా కాలువపై హైడ్రో ఎనర్జీ ప్రాజెక్టు రూపకల్పన సాధ్యాసాధ్యాల పరిశీలనకు ప్రభుత్వం నిపుణల కమిటీని నియమించింది. ఈ మేరకు నివేదికను రూపొందించే పనిని ఇన్నోవేటివ్ హైడ్రో ఎనర్జీ ప్రయివేటు లిమిటెడ్ సంస్థకు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలో అటు పోలవరం, ఇటు హంద్రీనీవా రెండింటిపైనా ఈ ప్రాజెక్టులను చేపట్టే యోచనలో ప్రభుత్వమున్నట్టు తెలుస్తోంది. గతేడాదే దీనిపై అనంతపురం జెఎన్‌టియులో ఇంజినీర్లు, నిపుణులతోనూ ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో చర్చించిన అంశాల ప్రకారం చూస్తే హంద్రీనీవా కాలువలో నీటి ప్రవాహాం ఏటా ఎనిమది నెలల వరకు ఉంటోంది. ఆగస్టు నుంచి మార్చి ఆఖరు వరకు ఉంటుంది.
హంద్రీనీవా కాలువపై హైడ్రో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి సాధ్యాసాధ్యాలు, వ్యయంతోపాటు అయ్యే ఖర్చును అంచనా వేసేందుకు బెంగళూరుకు సంబంధించిన ఒక ప్రయివేటు సంస్థకు బాధ్యతలు అప్పగించారు. ఈ సంస్థ 45 రోజుల్లో పరిశీలన జరిపి నివేదికను రూపొందిస్తుంది. ఈ నివేదికను పరిశీలించేందుకు, ఆ సంస్థ ఇచ్చిన నివేదికను పరిశీలించేందుకు జలవనరుల శాఖ ఇఎన్‌సి నారాయణరడెడ్డి అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. దీనికి హైడ్రాలజీ చీఫ్ ఇంజినీరు టివిఎన్‌ఎఆర్ కుమార్ కన్వీనర్‌గానూ, చీఫ్ ఇంజనీరు కె.శ్రీనివాస్, ఎన్‌ఐహెచ్ డైరెక్టరు వై.సత్యాజీరావులు సభ్యులుగా నియమించారు.
ఇటువంటి ప్రాజెక్టులు దేశంలో ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి కొత్త ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల పరిశీలనకు చేపట్టడం, అందులో హంద్రీనీవాపై చేపట్టే ఆలోచన చేయడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే అటు సోలార్, విండ్ పవర్ ఉత్పత్తిలో రాష్ట్రంలోనే అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది ఇక్కడే కావడం గమనార్హం. ఇప్పుడు కెనెటిక్ హైడ్రో పవర్ జనరేషన్ కూడా ఆమోదం పొందితే జిల్లా విద్యుత్ ఉత్పిత్తికి ప్రధాన కేంద్రంగా మారనుంది. అటు హంద్రీనీవా, ఇటు తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ వందల కిలోమీటర్లు కాలువలున్నాయి. వీటన్నింటిలోనూ సగటున ఆరు మాసాల కంటే ఎక్కువగానే నీటి ప్రవాహం ఉంటోంది.

