Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IPL 2026: బెంగళూరుతో ఢీ కొట్టేదెవరో..?

IPL 2026: బెంగళూరుతో ఢీ కొట్టేదెవరో..?

  • నేడు రాజస్తాన్ × గుజరాత్ మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్
  • రాత్రి 7.30గం||లకు

న్యూ ఛండీగడ్: ఇండియన్ ప్రీమియర్ లీగ(ఐపిఎల్) సీజన్2026లో ఫైనల్ బెర్తు కోసం మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది.

ముల్లాన్‌పూర్ వేదికగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో నెగ్గిన జట్టు ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో ఢీ కొట్టనుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అయితే ఎలిమినేటర్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించిన రాజస్థాన్.. భీకర ఫామ్‌లో ఉంది. మరోవైపు క్వాలిఫయర్-1లో ఆర్సీబీ చేతిలో చిత్తుగా ఓడిన గుజరాత్.. మరో అవకాశం దక్కించుకొని క్వాలిఫయర్-2 మ్యాచ్ కు సిద్ధమైంది. ఈ రెండు జట్ల మధ్య ముఖాముఖి పోరులో గుజరాత్ టైటాన్స్‌దే స్పష్టమైన ఆధిక్యత. ఇప్పటి వరకు ఐపిఎల్‌లో 10 సార్లు తలపడగా.. అందులో గుజరాత్ 7 సార్లు, రాజస్థాన్ మూడింట్లోనే గెలుపొందింది. ఈ సీజన్ లో ఇరుజట్లు రెండుసార్లు తలపడగా.. తొలి మ్యాచ్ లో రాజస్తాన్ 6 పరుగుల తేడాతో గుజరాత్ ను చిత్తుచేయగా.. రెండోసారి గుజరాత్ 77 పరుగుల తేడాతో రాజస్తాన్ ను ఓడించింది.

ముల్లాన్‌పూర్‌లో రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు ఆడిన ఏ మ్యాచులోనూ ఓడిపోలేదు. క్వాలిఫయర్ 2కి కూడా ఇదే వేదిక కావడం.. రాజస్తాన్ బ్యాటర్లు వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ భీకర ఫామ్‌లో ఉండటం శుభ పరిణామం. బుధవారం ఎస్ఆర్‌హెచ్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ ఓడినప్పటికీ తొలుత బ్యాటింగ్ కు దిగిన రాజస్తాన్.. 243 పరుగుల భారీ స్కోర్ చేసిన సంగతి తెలిసిందే.

టోర్నీ ఆరంభంలో వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చిన రాజస్థాన్ రాయల్స్ ఆ తర్వాత గాడి తప్పింది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ముంబైపై తప్పక గెలవాల్సిన పోరులో విజయం సాధించి.. ప్లే ఆఫ్స్‌కు చేరింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న హైదరాబాద్‌ను ఎలిమినేటర్‌లో చిత్తు చేసింది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ దూకుడుకు చెక్ పెట్టగలిగితేనే గుజరాత్‌కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే గుజరాత్ టైటాన్స్‌ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. సిరాజ్, హోల్డర్, ప్రసిద్ధ్ కృష్ణ, రబడా, రషీద్ ఖాన్ వంటి బౌలర్లు విజృంభిస్తున్నారు. కాగా ఈ పోరులో నెగ్గిన జట్టు ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్లో ఆర్సీబీతో టైటిల్ కోసం తలపడనుంది.

జట్లు (అంచనా)…
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్(కెప్టెన్), సాయి సుదర్శన్, బట్లర్(వికెట్ కీపర్), హోల్డర్, సుందర్, నిషాంత్ సింధు, రషీద్ ఖాన్, తెవాటియా, రబడా, సిరాజ్, ప్రసిద్ధ్.
రాజస్థాన్ రాయల్స్: రియాన్ పరాగ్(కెప్టెన్), జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, జురెల్(వికెట్ కీపర్), ఫెరెరా, శనకా, జడేజా, ఆర్చర్, బర్గర్, బ్రిజేష్, యశ్ రాజ్ పుంజా.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti