ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్
కొవ్వూరు ఒకటో వార్డులో జ్వర బాధితులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలందించేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు.
ప్రభుత్వాసుపత్రిలోనే మెరుగైన వైద్యసేవలందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. బాధితులు భయాందోళనకు గురికావొద్దన్నారు. ఇప్పటికే వైద్యాధికారులతో ప్రాథమిక దర్యాప్తు చేపట్టామన్నారు. బాధితుల రక్తనమూనాలు బ్యాబ్‌లలో పరీక్షలు నిర్వహించి, నివేదికలు పరిశీలించామన్నారు.
ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేసి, ప్రతీవీధిలో ఒక ఎఎన్‌ఎం, ఇద్దరు ఆశా కార్యకర్తలను నియమించామన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని మిశ్రా తెలిపారు. ప్రస్తుతం జ్వరం కేసులు అదుపులో ఉన్నాయని తెలిపారు. డిఎంహెచ్‌ఒ ఆధ్వర్యంలో కొవ్వూరు సిహెచ్‌సిలో జనరల్ ఎక్స్‌పర్ట్ ఫిజిషియన్, పిల్లల డాక్టర్లను తాత్కాలికంగా నియమించామన్నారు.
డెంగీ, మలేరియా వంటి జ్వరాలు నమోదు కాలేదని, వైరల్ జ్వరాలుగా ప్రాథమికంగా అంచనాకి వచ్చామని తెలిపారు. ఇప్పటికే ఫీవర్ సర్వే పూర్తయిందని, మరోసారి చేస్తున్నామన్నారు. కొవ్వూరు ఆర్‌డిఒ, మునిసిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో రోజుకు రెండుసార్లు శానిటేషన్ చేసేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. వైరల్ ఫీవర్‌కు సంబంధించిన వైద్య సదుపాయాలు కొవ్వూరు ఆస్పత్రిలో ఉన్నాయన్నారు. తాగునీరు, తినుబండారాలు, బ్లడ్, పొలాలకు సంబంధించిన శాంపిల్స్ పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణకు చర్యలు తీసుకుంటామన్నారు. తాగనీటి ట్యాంకును ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. డిఎంహెచ్‌ఒ బి.రవి, డిసిహెచ్‌ఎస్ ఎవిఆర్.మోహన్, కొవ్వూరు ఆర్‌డిఒ ఎస్.మల్లిబాబు, డిప్యుటీ డిఎంహెచ్‌ఒ పి.రామగురురెడ్డి, నోడల్ అధికారి పిడి.వర్మ, ప్రభుత్వ వైద్యులు, ఎస్.ధర్మరాజు, బి.శ్రీనివాస్, కె.సత్యవతి పాల్గొన్నారు.

