శత జయంతి ఉత్సవాల క రపత్రాలను విడుదల చేస్తున్న సిపిఐ నాయకులుప్రజాశక్తి పత్తికొండ : పేదల పెన్నిధి, కష్టజీవుల పక్షపాతి, పోరాటయోధుడు సిపిఐ పూర్వపు కర్నూలు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ చదువుల రామయ్య శతజయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.
రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక చదువుల రామయ్య భవనంలో శత జయంతి ఉత్సవాల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామ్రేడ్ చదువుల రామయ్య తుగ్గలి మండలం మారెళ్ళ లో చదువుల హనుమప్ప, చదువుల నాగమ్మ దంపతుల ఏకైక పుత్రుడు గా 1926 జనవరి 22వ తేదీన జన్మించారని అన్నారు.
పాఠశాల విద్య డోన్ లో, ఓల్డ్ ఇంటర్మీడియట్ గుంటూరులో చదువుతూ నే సమాజంలో జరుగుతున్న భూస్వామ్య, పెత్తందారి విధానాలకు, కుల వివక్షతకు వ్యతిరేకంగా దేశంలో కమ్యూనిస్టు పార్టీ జరుపుతున్న పోరాటాలకు ఆకర్షితుడై తన చదువును మధ్యలోనే ఆపేసి కమ్యూనిస్టు పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్నారని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ చీలిక తర్వాత పత్తికొండ తాలూకా సిపిఐ కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారని, భూమిలేని నిరుపేదలకు భూములు పంచాలని జీవరాల మలతాండ, రోల్లపాడు తాండ లో ఫారెస్ట్ భూములను, భూస్వాముల మిగుల భూములు మొలగవల్లి లో 1100 ఎకరాలు, బొమ్మనపల్లి లో 300 ఎకరాలు, తిరునాంపల్లిలో మిగులు భూములను భూ పోరాటాల ద్వారా పేదలకు పంచారని అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భూములు ఆక్రమించి ఇళ్ల స్థలాలు పంచి పేదలకు గృహ వసతి కల్పించారన్నారు. కామ్రేడ్ చదువుల రామయ్య జన్మించి 2026 సంవత్సరానికి 100 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా ఈనెల 9 న పత్తికొండలో శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నామని, పార్టీ శ్రేణులు, సానుభూతిపరులు శతజయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి పి. భీమ లింగప్ప, జిల్లా కార్యవర్గ సభ్యులు డి. రాజా సాహెబ్, పత్తికొండ, తుగ్గలి, మద్దికేర మండల కార్యదర్శిలు యు. కారుమంచి, సుల్తాన్, నాగరాజు, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, జిల్లా సమితి సభ్యులు గురుదాస్, తిమ్మయ్య, కారన్న, సురేంద్ర కుమార్, పెద్ద ఈరన్న, గిడ్డయ్య గౌడ్, పార్టీ ప్రజా సంఘాల నాయకులు రంగన్న, మండల సాయి కార్యదర్శి చలాపం కాసిం, సిద్దు సూరి, ఉమాపతి, తదితరులు పాల్గొన్నారు.

