Wednesday, 28 Nov, 11.00 am ప్రజాశక్తి

తాజా వార్తలు
కార్మికులూ కర్షకులూ ప్రసాదరావూ

- నేడు ఎన్‌పిఆర్‌ వర్థంతి
సెప్టెంబరు 5వ తేదీ దేశ రాజధానిలో కార్మికులూ, కర్షకులూ కదం తొక్కారు. 'కార్మికులూ, కర్షకులూ ఒక్కటే!' అంటూ గొప్ప సందేశమిచ్చారు. వర్షాన్ని లెక్కచెయ్యలేదు. రాంలీలా మైదానంలో, వానకి తడిసిన చిత్తడి నేలల్లో రాత్రి బస చేసి, పగలు ప్రదర్శనలు చేశారు. ఆ ప్రదర్శన ఆసాంతం చూసిన నేను 37 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాను. 37 ఏళ్ల క్రితం 1981 నవంబరులో 'కార్మిక మహా ప్రదర్శన'లో పాల్గొనటానికి కామ్రేడ్‌ ప్రసాదరావు ప్రోద్భలంతో ఢిల్లీ మహా నగరానికి వచ్చాను. ఆయన వెనకాలే తిరిగాను. ఎర్రకోట వెనక చిత్తడి నేలల్లో ఏర్పాటు చేసిన బసలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వేలాది కార్మికులు, కార్మిక నేతల్ని ఆయన పరిచయం చేస్తూ, అక్కడ ఏర్పాట్లను వివరిస్తున్న జ్ఞాపకాలు సుళ్లు తిరిగాయి. పదిహేడేళ్లు గడిచిపోయాయి ఆయన చనిపోయి. 90వ పుట్టిన రోజు జరుపుకొన్న కొద్ది రోజులకే 2001 నవంబరు 29న తుది శ్వాస విడిచారు. కొత్తగా కార్మిక వర్గ శ్రేణుల్లో చేరుతూ దుష్ట సమాజం పతనం కోసం శక్తిని ధారపోస్తున్న నవతరానికి ఆయన పరిచయం అవసరం.
'ఎన్‌పిఆర్‌'గా కామ్రేడ్లు అందరికీ తెలిసిన నండూరి వర ప్రసాదరావు పుట్టింది 1912 సెప్టెంబరు 24న కృష్ణాజిల్లా ఆరుగొలను గ్రామంలో, శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో. వారి తండ్రి, తాతలు వందల ఎకరాల మొఖాసాదార్లు. ఆయన జీవిత విశేషాలు చెప్పమని వెంటపడగా పడగా, చనిపోవడానికి కొద్ది నెలల ముందు ఇంగువ మల్లికార్జున శర్మకి ఇచ్చిన ఇంటర్వ్యూ (పుస్తకంగా వచ్చింది) చదివితే, కొన్ని విషయాలు తెలుస్తాయి.
బడిలో చదువుకుంటున్న ప్రసాదరావును దేశ స్వాతంత్య్ర సమరం ఉద్యమంలోకి ఉరికించింది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు అయ్యదేవర కాళేశ్వరరావు ఆయనకు వేలు విడిచిన మేనమామ. ఆ ప్రభావం కూడా పడింది. బందరు కాలేజీలో చదువుకునే రోజుల్లో బ్రిటీషు సామ్రాజ్యవాదుల మీద కోపంతో 'బ్రిటన్‌ చరిత్ర' పరీక్ష పేపరు రాయడానికి నిరాకరించారు. ఫలితం పరీక్ష తప్పడం. అలా ఆనాడు ఏర్పడ్డ సామ్రాజ్యవాద వ్యతిరేక బీజాలు వటవృక్షంలా పెరిగాయి. జీవితాన్ని ప్రజా ఉద్యమాలకు అంకితమయ్యేలా చేశాయి. 'సొంతం' అనే మాటని ఆయన 'డిక్షనరీ' నుండి తొలగించాయి.
దేశంలోని యువత ఉన్నత చదువుల కోసం పండిత మదన్‌ మోహన్‌ మాలవ్య కాశీలో విశ్వవిద్యాలయం స్థాపించారు. అదే 'బెనారస్‌ హిందూ యూనివర్శిటీ'. ఇటీవల విద్యార్థినుల ఉద్యమాలతో వినతికెక్కింది. ఇదే విశ్వవిద్యాలయంలో చదివిన ఎందరో యువకులు సోషలిస్టులయ్యారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో కమ్యూనిస్టు ఉద్యమం బీజాలు నాటారు. చండ్ర రాజేశ్వరరావు, పొన్నం వీరరాఘవయ్య, కాట్రగడ్డ శ్రీనివాసరావు వంటి ప్రముఖులతో పాటు ప్రసాదరావు కూడా బెనారస్‌ యూనివర్శిటీలో చేరారు. కొంతకాలానికి చదువుకు స్వస్తి చెప్పి వెనక్కి తిరిగి వచ్చారు. భార్య నగలు అమ్మి గుంటూరులో కాలేజీ విద్యార్థుల కోసం మెస్సు నడిపారు. అప్పటికే అక్టోబరు విప్లవం విజయవంతమై రష్యాలో కార్మిక కర్షక రాజ్యం ఏర్పడింది. ప్రజల పాలిట భూతల స్వర్గంగా పేరు పడింది. పతితులు, భ్రష్టులు, బాధాతప్త ద్రష్టలు లేని మరో ప్రపంచం, అన్నార్తులు, అభాగ్యులుండని నవయుగం నవతరాన్ని ప్రభావితం చేసింది. సోషలిస్టు భావాలు ప్రజల్లో వ్యాపింపజేయడం కన్నా, దోపిడీని అంతం చేయడం కన్నా వేరే జీవితాశయం లేదనుకున్నారు. అందుకే విద్యార్థుల్లో సోషలిస్టు భావాలు వ్యాపింపజేసేందుకు పూనుకున్నారు. విద్యార్థులకు సోషలిజం పాఠాలు చెప్పారు. మెస్సు దివాలా తీసింది. అయితేనేం, కమ్యూనిస్టు ఉద్యమానికి పునాదులు వేసిన వారిలో ఒకరుగా నండూరి ప్రసాదరావు నిలిచిపోయారు.
పుచ్చలపల్లి సుందరయ్య ప్రోద్భలంతో తూర్పు గోదావరి జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి పూనుకున్నారు. కొద్ది కాలానికే దేశంలో అనేక చోట్ల రైతాంగ పోరాటాలు, జమీందారీ, జాగీర్దారీ వ్యతిరేక పోరాటాలు పెల్లుబికాయి. మన రాష్ట్రంలోనూ ఆ ప్రభావం పడ్దది. ఇచ్ఛాపురం నుండి తడ వరకు కొమ్మారెడ్డి సత్యనారాయణ సారథ్యంలో 'రైతు రక్షణ యాత్ర' సాగింది. ఈ పోరాటాల్లో మగవాళ్లతో పాటు ఆడవాళ్లు కూడా సమ ఉజ్జీలుగా పాల్గొన్నారు. 'గుండెనిచ్చిన గున్నమ్మ, బావిరెడ్డి వియ్యమ్మ' మందస, చల్లపల్లి జమీందార్ల తుపాకి గుళ్లకు నేలకొరిగారు. అదే వరసలో సాగిన 'మునగాల పరగణా' రైతాంగ పోరాటానికి ఎన్‌పిఆర్‌ సారథ్యం వహించారు. 'మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం' 1946 నుండి 51 వరకు సాగింది. ఆ పోరాటానికి నేతృత్వం వహించిన వారిలోను ప్రసాదరావు ఒకరు. నిరక్షరాస్యులు, కాకుంటే వానాకాలం చదువులు చదివిన రైతాంగం వందలు, వేల సంఖ్యలో దొరలు, దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా పోరాటంలోకి వచ్చారు. అటువంటి వారికి 'గతి తార్కిక భౌతికవాదం, రాజకీయ అర్థశాస్త్రం' వంటి శాస్త్రీయ సోషలిజం పాఠాలు బోధించారు.
స్వతంత్ర భారతావనికి ఏర్పడ్డ మొట్టమొదటి పార్లమెంటు సభ్యులుగా ఆయన ఎన్నికయ్యారు. అఖిల భారత కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. శ్రీకాకుళం ప్రాంతంలో గిరిజనులను సంఘటితం చెయ్యడంలోను భాగస్వామ్యం వుంది. 1955 తరువాత కమ్యూనిస్టు ఉద్యమానికి ఆటుపోట్లు ఎదురయ్యాయి. 1964లో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఏర్పాటులో, ఎన్‌పిఆర్‌ ముఖ్య నాయకులు. 1964, 67ల్లో మితవాద, అతివాద పెడ ధోరణుల కారణంగా బలహీనపడ్డ పార్టీ, ప్రజా ఉద్యమాలను పునర్నిర్మించడానికి పూనుకున్నారు. మళ్లీ మొక్కా మోడు ఏరుకుని పార్టీ పునర్నిర్మాణానికి, 1970లో రాష్ట్రంలో సిఐటియు నిర్మాణానికి పూనుకున్నారు. పంచ, లాల్చీ కట్టిన ప్రసాదరావు ప్యాంటూ, షర్టులోకి మారిపోయారు. కార్మికులూ ట్రేడ్‌ యూనియన్లు-చట్టాలు-అగ్రిమెంట్లు- ఇదో కొత్త బాధ్యత. అరవైల్లోకి అడుగుపెట్టినా...పర్సా సత్యనారాయణ, బాలాజీదాస్‌, లకీëదాస్‌, భాస్కరరావు వంటి సీనియర్‌ నాయకుల సహకారంతో యువ కార్యకర్తల్ని తయారు చేసుకుంటూ ఉద్యోగ, కార్మికులను సంఘటితం చేస్తూ, కొత్త కొత్త యూనియన్లు పెట్టారు. కార్మిక వర్గ శ్రేణుల్లో అట్టడుగునున్న పారిశుధ్య కార్మికులను మొదలుకొని అత్యంత సాంకేతిక నైపుణ్యం గల విశాఖ స్టీలు, డిఫెన్సు, బ్యాంకు, ఇన్సూరెన్సు తదితర ఉద్యోగుల్ని సంఘటితం చేయడానికి, ఆయన యజ్ఞమే చేశారు.
ప్రసాదరావు వ్యక్తిత్వం నిబద్ధత, కార్మికవర్గ దృక్పథం ఆయన అడుగుజాడల్లో నడిచి పని చేసిన వారందరికీ అనుభవం. ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగిన శ్యామ్‌ సుందర్‌ కొన్ని ఘటనలు చెప్పారు. మచ్చుకు ఒక్క ఘటన. ఒకసారి ఎన్‌పిఆర్‌, కామ్రేడ్‌ మధుసూధనరావు కలిసి మచిలీపట్నంలో రిక్షాలో వెళ్తుండగా, వెనక నుండి లారీ వచ్చి గుద్దింది. రిక్షా బోల్తా పడి ప్రసాదరావుగారి కాలు విరిగింది. ఆయన లేవడానికి సహాయం చెయ్యబోతే ముందు రిక్షా కార్మికుడు ఎలా ఉన్నాడో చూడండి అన్నారట! యాక్సిడెంటు కేసు కోర్టుకు వచ్చింది. కేసు నిర్ధారణ అయితే భారీ నష్ట పరిహారం వచ్చేది. సాక్షులంతా లారీ డ్రైవరు అతివేగమే కారణమని చెప్పారు. ఎన్‌పిఆర్‌ అందుకు భిన్నంగా లారీ మామూలుగానే వస్తున్నదని, రోడ్డు చిన్నది గావడంతో యాక్సిడెంటు అయిందని చెప్పారు. కేసు కొట్టి వేశారు. ఎందుకలా చెప్పారని అడిగిన ప్రశ్నకు 'డ్రైవరుకు శిక్ష పడితే, అతని కుటుంబం వీధిన పడుతుంది. ఇదా మనం కోరుకునేది!' అని చెప్పారట. కార్మికవర్గ దృక్పథానికి ఇదో ఉదాహరణ.
కామ్రేడ్‌ ప్రసాదరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. సైన్సు, శాస్త్రీయ సోషలిజం దగ్గర్నుండి వేదాలు, ఉపనిషత్తుల వరకు ఏ అంశం పైనైనా అవలీలగా మాట్లాడ్డం, రాయడం ఆయనకే సాధ్యమేమో! తనకన్నా వయసులోను, అనుభవంలోను, స్థాయిలోను అన్నిట్లోను ఎన్నో ఏళ్లు చిన్న వాళ్లతో, వాళ్ల కుటుంబాలతో కలిసిపోయే తీరు, ఆయనతో పరిచయమున్న ప్రతి ఒక్కరి పైనా బలమైన ముద్ర పడి వుంటుంది. ఆయన పరిచయం, ప్రోత్సాహంతో అనేక మంది యువ కార్యకర్తలు ఎదిగారు. సిఐటియు అధ్యక్షురాలు డా|| హేమలత వారిలో ఒకరు. ఎంతోమంది కార్యకర్తలకు ఆయన ఆత్మబంధువు. నాయకత్వం అనే బాధ్యతలకు నిలువెత్తు నిదర్శనం. నిరాడంబరత్వానికి మారు పేరు. మొదట చెప్పుకున్న ఎర్రకోట వెనక చిత్తడి నేలలు, అక్కడ వేసిన పందిళ్లలోనే మా అందరితో పాటు ఆయనా రాత్రుళ్లు నిద్రపోయేవారు. అప్పటికి ఆయన వయస్సు 70 సంవత్సరాలు. భేషజం అంటే ఏమిటో ఆయనకు తెలియదు. నాయకత్వానికి అర్థం ఆధిపత్యం కాదు మార్గదర్శకత్వం. అదే ఎన్‌పిఆర్‌ తత్వం.

- ఎస్‌ పుణ్యవతి ( రచయిత సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు )

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top