పశ్చిమ గోదావరి
కమ్యూనిస్టులకు వారసత్వ రాజకీయాలు ఉండవు : ప్రజాసంఘాల భవన నిర్మాణ శంకుస్థాపనలో వక్తలు

పశ్చిమ గోదావరి (ఆచంట) : కమ్యూనిస్టులకు వారసత్వ రాజకీయాలు ఉండవని ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు అన్నారు. అమరజీవి కామ్రేడ్ నెక్కంటి రామదాసు, అన్నపూర్ణమ్మ ప్రజా సంఘాల భవనం, కామ్రేడ్ ప్రేరేప మృత్యుంజయుడు, కామ్రేడ్ తాళ్ల బసవ మల్లయ్య స్మారక కేంద్రం శంకుస్థాపన కార్యక్రమం మృత్యుంజయ సొసైటీ రైస్‌మిల్ ఎదురుగా ఉన్న స్థలంలో ఆదివారం జరిగింది. ముందుగా ఎమ్మెల్సీలు వెంకటేశ్వరరావు, రాము సూర్యరావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పూర్వ రాష్ట్ర ఉపాధ్యక్షులు మంతెన సీతారాం, ఆచంట మాజీ శాసనసభ్యులు దిగుపాటి రాజగోపాల్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజా సంఘాల భవనాలకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కేత గోపాలం అధ్యక్షత వహించారు. అనంతరం ఎమ్మెల్సీ వెంకటేశ్వర మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ పార్టీల నుంచి కొన్ని కుటుంబాలు వారసత్వ రాజకీయాల్లోకి వస్తుంటాయని, కమ్యూనిస్టులకు మాత్రం వారసత్వ రాజకీయాలు ఉండవని అన్నారు. కమ్యూనిస్టులు ప్రజల కోసం ప్రజా ఉద్యమాల కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడరన్నారు.
మంతెన సీతారాం మాట్లాడుతూ.. ఆచంట ఏరియాలో అమరవీరులు కామ్రేడ్ ప్రేరేప మృత్యుంజయుడు, తాళ్ల బసవ మల్లయ్య ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తుపాకీ గుండ్లకు బలి చేశారని, వారు చేసిన తప్పు కేవలం ఎర్రజెండా పట్టుకోవడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరువురు పేరున నిర్మించనున్న స్మారక కేంద్రం ప్రజా ఉద్యమాల కేంద్రంగా ఉంటుందని అన్నారు. దిగుపాటి రాజగోపాల్ మాట్లాడుతూ.. అంటరానితనాన్ని వ్యతిరేకించి హరిజనవాడలో సహపంక్తి భోజనం అనుసరించిన నాయకుడు రామదాస్ అని కొనియాడారు ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ.. డబ్బు, సంపాదన, అధికారం, పదవులను కమ్యూనిస్టులు ఏనాడు కోరుకోవడం లేదని, ప్రజల కోసం ప్రజా ఉద్యమాల కోసం ఎంతటి త్యాగాలకైనా వెనుకాడరని అన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి కేత వెంకటేశ్వరరావు, వైసిపి నాయకులు వైట్ల కిషోర్ కుమార్, టిడిపి మండల అధ్యక్షులు కేత మీరయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు నెక్కంటి సతీష్, విశ్రాంతి సైంటిస్ట్ డాక్టర్ చిలుకూరి సుబ్బారావు, బొక్క నాగేశ్వరరావు, తమినిడి ప్రసాద్ భరద్వాజ, కాశీ విశ్వేశ్వరరావు, బాదంపూడి రాజు, సిఐటియు మండల అధ్యక్ష, కార్యదర్శులు వైట్ల ఉషారాణి, వద్దిపర్తి అంజిబాబు, ఐద్వా మండల నాయకురాలు చదలవాడ జయలక్ష్మి, సిపిఎం మండల కార్యదర్శి బండి రంగారావు, తోటపల్లి సత్యనారాయణ, వద్దిపర్తి శ్రీను, తలుపురి బుల్లి అబులు, కొండేటి సత్యనారాయణ, ఇంజేటి వీరయ్య, బుర్ర ధర్మారావు, తదితరులు పాల్గొన్నారు.
related stories
-
వ్యాసం విప్లవాల మిత్రుడికి విప్లవాంజలి
-
తెలంగాణ తాజావార్తలు చట్టాలు రద్దు చేస్తేనే ఆందోళన విరమణ
-
కర్నూలు ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి : సిఐటియు