Dailyhunt
కంగనాకు బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌..

కంగనాకు బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌..

ముంబయి : ఇటీవల పలు అంశాల్లో వివాదాస్పద ట్వీట్లు చేస్తున్న బాలీవుడ్‌ నటి కంగనారనౌత్‌కు ముంబయి కోర్టు బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ను జారీ చేసింది. ప్రముఖ కవి, గేయ రచయిత జావేద్‌ అక్తర్‌ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో .. అంథేరీ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు మార్చి 1న కోర్టుకు హాజరుకావల్సిందిగా సమన్లు జారీ చేసింది. కాగా, ఆమె సోమవారం కోర్టుకు హాజరుకాలేదు. దీంతో మెజిస్ట్రేట్‌ ఆర్‌ఆర్‌ ఖాన్‌ కంగనాకు అరెస్ట్‌ వారెంట్‌ను జారీ చేశారు. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదావేశారు.
కాగా, కోర్టు ఫిబ్రవరి 1న కంగనాకు సమన్లు జారీచేసే సమయంలో.. న్యాయ విధానాలను పాటించలేదని ఆమె తరపు న్యాయవాది రిజ్వాన్‌ సిద్ధిఖీ కోర్టులో వాదించారు.

ఈ సమన్లను సవాలు చేస్తూ.. బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలైందని అన్నారు. కాగా, గతేడాది జూన్‌లో బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఒక ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ.. బాలీవుడ్‌లోని కొందరి కేటగిరీ గురించి మాట్లాడుతూ.. తన పేరును ప్రస్తావించారని, తనకు పరువు నష్టం కలిగే విధంగా వ్యాఖ్యానించారని జావేద్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti