శుక్రవారం కెన్యాలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు పది మంది మృతి చెందారు. ప్రత్యేకించి వర్షాలకు దేశంలోని తూర్పు ప్రాంతం బాగా ప్రభావితమైందని కెన్యా పోలీసులు తాజాగా వెల్లడించారు.
ఈ వర్షాలకు తూర్పు ప్రాంతంలోనే అత్యధికంగా ఏడుగురు మరణించారని జాతీయ పోలీససు సర్వీసు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేసింది.
కాగా, తీరప్రాంతంలోని క్వాలేలో ఉన్న మ్వేనా వంతెన, తూర్పు ప్రాంతంలోని కిటుయిలో ఉన్న న్ఫోమెని వంతెన తుఫాను కారణంగా దెబ్బతిన్నాయి. దీనివల్ల రవాణాకు, కొన్ని ప్రాంతాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. టాంబచ్ (పశ్చిమ)లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో నివాసితులకు మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లింది. రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ ప్రారంభించాయని పోలీసులు తెలిపారు. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాద ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

