తిరువనంతపురం : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి మూడు సీట్లు గెలుచుకోవడం రాష్ట్ర రాజకీయాలకు ప్రమాదం. ఈ విషయాన్ని లౌకిక పార్టీలన్నీ తీవ్రంగా పరిగణించాలని కేరళ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వమ్ సూచించారు.
బుధవారం ఆయన తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. 'బిజెపి కేవలం మూడు స్థానాల్లో పొందడమే కాదు.. ఆరు నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఇదే ఆందోళనకరమైన విషయం. తీవ్ర మితవాద రాజకీయాలు తమ పట్టును బిగించినప్పుడు, అది కేరళలోనే కాకుండా దేశవ్యాప్తంగా పెను ప్రభావాన్ని చూపించిందని ఇది తెలియజేస్తుంది. దీనిని ఎదుర్కోవాలంటే దేశంలోని వామపక్ష, లౌకిక శక్తులన్నీ దీనిపై సమగ్రంగా అధ్యయనం చేయాలి. ఎల్‌డిఎఫ్ ఓటమికి దారితీసిన కారణాలను పార్టీ కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని బినోయ్ విశ్వం అన్నారు.
కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ నుండి యూడీఎఫ్‌కు భారీ సంఖ్యలో ఓట్లు పోల్ అయ్యాయి. దీని వెనుక గల కారణాలను పరిశీలించాల్సి ఉంది. ఇందుకోసం జిల్లా, రాష్ట్ర స్థాయిలలో సమావేశాలు నిర్వహించి, అవసరమైన చోట తగిన మార్పులు చేస్తాం. ఎన్నికల్లో జరిగిన లోపాలు ఏమిటో, మేము ఎక్కడ విఫలమయ్యామో క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ఆ తర్వాత అవసరమైన మార్పులు, సవరణలు చేస్తాం. మొత్తం 140 సీట్ల ఫలితాలను కూడా మేము పరిశీలిస్తాం అని బినోయ్ అన్నారు. అలాగే ఓటమి కారణంగా సిపిఐ, ఎల్‌డీఎఫ్‌లు రాష్ట్ర రాజకీయాలను వీడబోవని, ప్రజల కోసం పనిచేస్తూ ముందుకు సాగుతాయని ఆయన అన్నారు.

