Wednesday, 16 Oct, 1.39 am ప్రజాశక్తి

తాజావార్తలు
కౌలు రైతుల భరోసాకు కోతలు

* ఇస్తానంది 15 లక్షలు
* ఇచ్చేది సుమారు 3 లక్షలు
* ఇప్పటికి సిసిఆర్‌సిలు 1.26 లక్షలే
* వారిలో సాయం దక్కేది ఇంకా తక్కువ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి:
వ్యవసాయదారులకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మంగళవారం ప్రారంభించిన రైతు భరోసా పథకం వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు అంతకంతకూ దూరం జరుగుతోంది. కౌల్దార్లకు సర్కారు విధించిన నిబంధనల మూలంగా స్వల్ప సంఖ్యలోనే భరోసా దక్కనుంది. ప్రజాసాధికార సర్వే, భూపరిపాలనా శాఖ, వ్యవసాయశాఖల అధ్యయనాలు ఎపిలో 15 లక్షల వరకు కౌలు రైతులున్నారని తేల్చగా, వారిలో మూడు లక్షల మందికే ప్రభుత్వం ఇచ్చే భరోసా రూ.13,500 వర్తిస్తుందని తెలుస్తోంది. సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ నాల్గవ సమావేశంలో ఈ విషయం వెల్లడైంది. ఇవి కూడా ఉజ్జాయింపు లెక్కలే. భరోసా పొందేందుకు కౌలు రైతులకు సర్కారు ప్రత్యేకంగా విధించిన షరతులన్నింటినీ దాటుకొని చివరికి ఎంత మందికి భరోసా దక్కుతుందోనన్న ఆందోళనలు కౌల్దార్లను వేధిస్తున్నాయి. వాస్తవంగా భూమిపై కష్టపడి పంట పండించే కౌలు రైతులకు అన్యాయం జరుగుతోంది. కౌలు రైతుల్లో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదలేనని సర్కారు అంగీకరిస్తోంది. ఆ తరగతులకే భరోసా అందకపోవడం గమనార్హం.

పంచపాండవులు..మంచంకోళ్లు
ప్రభుత్వాల విధానాల, మారుతున్న గ్రామీణ ఆర్థిక పరిస్థితులతో ఇటీవలికాలంలో కౌలు సాగు అంతకంతకూ విస్తరిస్తోంది. ఎపి వ్యాప్తంగా సాగుయోగ్యమైన భూమిలో సగానికంటే ఎక్కువ కౌలు రైతుల చేతుల్లోనే ఉంది. కోస్తాలోని ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అయితే 70-80 శాతం సేద్యం కౌలు రైతులదే. ప్రకాశం, నెల్లూరులో ఒక మాదిరిగా, ఉత్తరాంధ్ర, రాయలసీమలో కాస్త తక్కువగా కౌలు సేద్యం కొనసాగుతోంది. అక్టోబర్‌ 15 నుంచి రైతు భరోసాను ప్రారంభిస్తామని కొన్ని నెలల ముందే ప్రకటించిన సర్కారు, ఆ మేరకు పిఎం కిసాన్‌ డేటాతోపాటు ప్రభుత్వ విభాగాల వద్ద ఉన్న సమాచారం ఆధారంగా అంచనాలు కట్టింది. వైసిపి వచ్చాక నిర్వహించిన తొలి బడ్జెట్‌ సమావేశాల్లో విడుదల చేసిన 2018-19 సామాజిక, ఆర్థిక సర్వేలో రైతు భరోసా పొందే కౌలు రైతు కుటుంబాలు 15,35,642 అని పేర్కొంది. అంతమందికీ రూ.12,500 వంతున ఇవ్వాలంటే రూ.1,919.55 కోట్లు కావాలని అంచనా వేసింది.
ప్రస్తుతం సాయాన్ని రూ.వెయ్యి పెంచినందున అనుకున్న దానికంటే బడ్జెట్‌ పెరగాలి. అప్పుడే ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్‌లో సైతం భరోసా పొందే కౌలు రైతుల సంఖ్య 15.37 లక్షలుగా పేర్కొంది. ఆర్థిక సర్వే అంచనాలు, బడ్జెట్‌ లెక్కలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. కాగా పథకం ప్రారంభం దగ్గరకొచ్చేసరికి భరోసా కేవలం మూడు లక్షల కౌల్దార్లకేనంటోంది. కౌలు రైతుల విషయంలో సర్కారు వ్యవహరిస్తున్న తీరు 'పంచ పాండవులు- మంచం కోళ్లు' మాదిరి తయారైంది. అంచనాలకు, ఆచరణకు మధ్య తేడా కొంచెం అటూ ఉండవచ్చేమోకానీ, ఇంత భారీగా 12 లక్షలు తగ్గడం కౌల్దార్లను ఆవేదనకు గురి చేస్తోంది.

మరీ ఇంత తక్కువా?
కౌలు రైతుల గుర్తింపునకు గత చట్టాలను రద్దు చేసి కొత్త చట్టాన్ని వైసిపి సర్కారు తీసుకురావడం, భరోసా పొందేం దుకు కౌల్దార్లకు పెట్టిన అదనపు షరతులు వీటి వలన వాస్తవ సాగుదారులకు భరోసా దూరమవుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు 15 లక్షల పైచిలుకు కౌలు రైతులుండగా వారిలో సెంటు కూడా సొంత భూమి లేని కుటుంబాలు ఆరున్నర లక్షల లోపని సర్కారు నిర్ధారణకొచ్చిందని తెలిసింది. భరోసా కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకేనని, ఇతర పేదలను తిరస్కరించడం, కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని ఒక్క కౌలు రైతుకేననడంతో లబ్ధి పొందే కౌల్దార్ల సంఖ్య అమాంతం మూడు లక్షలకు తగ్గినట్లు తెలుస్తోంది.
కాగా గతంలో జారీ చేసిన ఏడు లక్షల ఎల్‌ఇసి కార్డులు, సాగు ధ్రువీకరణ పత్రాలు (సివొసి) కలిపి సుమారు 11 లక్షలు ఉండగా వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. కొత్త చట్టం ప్రకారం పంట సాగుదారు హక్కు పత్రం (సిసిఆర్‌సి) ద్వారా ఈ నెల 2 నుంచి కౌలు రైతులను గుర్తిస్తున్నారు. భరోసా స్కీం ప్రారంభం నాటికి 1,26,412 మందికే సిసిఆర్‌సిలను మంజూరు చేశారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, వారిలో కూడా కుటుంబానికి ఒక్కరికే ఇస్తే 50 వేల మందికి కూడా భరోసా దక్కదని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top
// // // // $find_pos = strpos(SERVER_PROTOCOL, "https"); $comUrlSeg = ($find_pos !== false ? "s" : ""); ?>