Saturday, 09 Nov, 1.37 am ప్రజాశక్తి

తాజావార్తలు
కౌలు రైతులకు 'భరోసా' కోసం 11న కలెక్టరేట్ల ముట్టడి

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో :
భూ యజయానితో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, సొంత భూమిలేని ప్రతి కౌలు రైతుకు రైతు భరోసా అందించాలని రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు పేర్కొన్నారు. కౌలు రైతులకు న్యాయం కోసం, వారి సమస్యలను ప్రభుత్వం తీసుకెళ్లేందుకు ఈ నెల 11వ తేదీన కలెక్టరేట్లను ముట్టడించాలని, 20 నుంచి 25 వరకూ స్థానికంగా ఆందోళనలు చేపట్టాలని సమావేశం తీర్మానించింది. శుక్రవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఎపి కౌలు రైతు సంఘం, కౌలు రైతు సంఘం(దాసరి భవన్‌) ఆధ్వర్యాన రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. దీనికి ఉభయ సంఘాల నాయకులు నాగబోయిన రంగారావు, యల్లమందారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ గ్రామసభలు నిర్వహించి, నేరుగా కౌలు రైతులను ప్రభుత్వమే గుర్తించి, సాగు హక్కు గుర్తింపు కార్డులు (సిసిఆర్‌సి) ఇవ్వాలన్నారు. ఎలాంటి షరతులూ లేకుండా, సొంత భూమి లేని కౌలు రైతులందరికీ రైతు భరోసాను చెల్లించాలని పేర్కొన్నారు. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం సాగుచేస్తున్న భూమి నిష్పత్తిని బట్టి పంట రుణాలివ్వాలని తెలిపారు. దేవాదాయ, వక్ఫ్‌భూములు, పూజారి మాన్యాలను సాగు చేస్తున్న కౌలు రైతులందరికీ (సిసిఆర్‌సి) కార్డులు ఇవ్వాలన్నారు.

ఈ క్రాప్‌ బుకింగ్‌లో వాస్తవ సాగుదారుల పేర్లను, వారి పంటలను నమోదు చేయాలని తెలిపారు. కౌలు రైతు సమస్యల్లో ఈ ఐదు అంశాలపై తీర్మానం చేశారు. ఎపి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి మాట్లాడుతూ యజమాని అంగీకారం అడగటం వల్ల రైతు భరోసాతోపాటు ఇతర రుణాలు, సబ్సిడీలకు కౌలు రైతులు దూరమవుతున్నారని తెలిపారు. ఇది ముమ్మాటికీ రైతులను మోసం చేయడమేనన్నారు.

ఎపి రైతు సంఘం (దాసరి భవన్‌) రాష్ట్ర కార్యదర్శి కెవివి ప్రసాద్‌ మాట్లాడుతూ వామపక్షాలు సంయుక్తంగా పోరాడి సాధించిన 2011 కౌలు రైతు చట్టం పక్కనపెట్టి, వైసిపి తెచ్చిన కొత్త చట్టం లోపభూయిష్టంగా ఉందని అన్నారు. పాతచట్టంలో తప్పులను సవరించకుండా మరిన్ని తప్పులు చేశారని విమర్శించారు. తేదీలను పొడిగించినా దరఖాస్తులు రాకపోవడానికి అందులోని లోపాలే కారణమని చెప్పారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ నలుగురు నాయకులకు మంత్రి పదవులు ఇస్తే సామాజిక న్యాయం జరిగిపోయినట్లు కాదని, అన్ని వర్గాల రైతులకు, కౌలు రైతులకు కుల, మతాలకు అతీతంగా పథకాలను చేరువ చేసినప్పుడే న్యాయం జరుగుతుందని అన్నారు.

అఖిల భారత కిసాన్‌సభ నాయకులు తోట అంజనేయులు మాట్లాడుతూ రెవెన్యూ, అగ్రికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి కౌలు రైతులను గుర్తించాల్సింది పోయి, వారినే ఆధారాలు తీసుకురమ్మని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయ కులు కొండలరెడ్డి మాట్లాడుతూ సిసిఆర్‌సికి ఓ ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎపి రైతు కూలీ సంఘం నాయకులు గొల్లపూడి ప్రసాద్‌ మాట్లాడుతూ భూమిలేనివారు అసలు రైతే కాదు అనేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు బ్రహ్మయ్య మాట్లాడుతూ రైతు భరోసా కేవలం ప్రచారానికే పరిమితం అయినట్లుందని అన్నారు. రైతు స్వరాజ్య వేదిక ఉత్తరాంధ్ర నాయకులు బాలు మాట్లాడుతూ అర్హుల గుర్తిం పు కోసం ఆధారాలంటూ కాలయాపన చేయకుండా రేషన్‌ కార్డు ఆధారంగా మంజూరు చేయాలన్నారు. ఈ కార్య క్రమంలో వృత్తిదారుల సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, గొర్రెలు మేకల పెంపకందార్ల సహకార యూనియన్‌తోపాటు పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top