Monday, 16 Mar, 12.00 am ప్రజాశక్తి

తాజావార్తలు
కుర్చీలో నిరంకుశత్వం - ప్రతిపక్షంలో ప్రజాస్వామ్యం

నవ మాసాలు అధికారాన్ని మోసిన మన ముఖ్యమంత్రి ఆదివారం మొట్టమొదటిసారి మీడియా ముందుకు వచ్చి ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించి మాట్లాడతారని ఆశించినవారికి నిరాశ ఎదురైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై దాడి చేయడానికి ఆయన ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు. ఎన్నికల కమిషన్‌ చర్యను విమర్శించవచ్చు. ఆ నిర్ణయంతో విబేధించవచ్చు. కాని శాసించాలనుకోవడం పద్ధతి కాదు. గతంలో ప్రతిపక్షంలో ఉండగా ప్రజాస్వామ్యం గురించి, పౌరహక్కుల గురించి నిరంతరాయంగా మాట్లాడారు. తన సభలకు అనుమతించడం లేదని, తమ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, ఎన్నికలను తొత్తేరని ఇలా అనేక రకాల ఆరోపణలను ఆయన అధికారపక్షంపై చేశారు. అదే జగన్‌ మోహన్‌ రెడ్డి నేడు అధికారానికి రాగానే అవే పద్ధతులను అనుసరిస్తున్నారు. విక్రమార్క సింహాసనం లాగా కుర్చీ లోకి ఎక్కగానే అధికార దురహంకారాన్ని వంటబట్టిస్తుంది. అందరూ తన మాటే వినాలని, తను చెప్పినట్టే నడుచుకోవాలని కోరుకుంటున్నారు.
స్థానిక ఎన్నికలకు కరోనా వైరస్‌ పట్టింది. ఆరు వారాలపాటు ఐసియులో పెట్టారు. ఈ ఎన్నికల నిర్వహణ మొదటి నుండీ వివాదాస్పదంగానే మారింది. రిజర్వేషన్ల పేరుతో కోర్టులో నలిగి నలిగి ఆఖరికి ఓబిసిలకున్న రిజర్వేషన్ల శాతాన్ని తగ్గించి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. రాత్రికి రాత్రే రిజర్వేషన్లు ఫైనల్‌ చేసి అప్పటికప్పుడు షెడ్యూల్‌ ప్రకటించి నోటిఫికేషన్‌ కూడా ఇచ్చేశారు. కనీసం ఏ ప్రాదేశిక నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని పెట్టుకోవాలో నిర్ణయించుకోవడానికి కూడా ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వలేదు. నామినేషన్ల ఘట్టం ప్రారంభం నుండే ప్రతిపక్ష అభ్యర్థులపై బెదిరింపులు, దాడులకు దిగారు. ఇందుకోసం అధికారులు, పోలీసు యంత్రాంగాన్ని విచ్చలవిడిగా వినియోగించుకోవడం పరాకాష్ట. అవినీతిని నిరోధించే పేరుతో ప్రతిపక్ష పార్టీల నాయకులపై ఎసిబి, పోలీసు, ఎక్సైజ్‌ దాడులు చేయించి భయభ్రాంతులకు గురిచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు అధికార పార్టీలో చేరేటట్లు చేసుకోగలిగారు. బహుశా సిఎం గారికి మోడీ స్ఫూర్తినిచ్చి వుంటారు. ఇతర పార్టీల నుండి నామినేషన్లు వేసిన వారి పాత కేసులు బయటకు తీసి అరెస్టులు చేయడం, నామినేషన్లు వేయకుండా పోలీసులే అడ్డగించడం, అడిగితే ఎదురు కేసులు పెట్టడం వంటి చర్యలతో ఏకగ్రీవాలు లెక్కకు మిక్కిలి జరిగాయి. ముఖ్యంగా గుంటూరు, చిత్తూరు కడప జిల్లాల్లో ఈ ప్రహసనం చాలా విస్తృతంగా జరిగింది. ఆ తరువాత స్థానంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలున్నాయి. మొత్తం 7,287 ఎంపీటీసి స్థానాలకు గానూ 2,406 స్థానాల్లో ఏకగ్రీవాలు అయ్యాయి. అంటే మూడో వంతు స్థానాల్లో ఎన్నికలు లేనట్లే. ఇందులో 95 శాతం అధికార పక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 126 జడ్‌.పి.టి.సి లు ఏకగ్రీవమయ్యాయి. అన్నీ వైసిపికే వచ్చాయి. దీనిని బట్టే ఏకగ్రీవాలు ఎంత ఫార్సో అర్థమవుతుంది. ఏ ప్రజాస్వామ్యం లోనూ ఇలా జరగదు. ప్రజలే స్వేచ్ఛగా కూర్చొని బలాబలాలను బట్టి నిజాయితీపరులైన అభ్యర్థులను ఏకగ్రీవం చేసుకుంటే అది అభినందించదగినదే. కానీ ఇది అందుకు భిన్నంగా ఏకపక్షంగా జరిగింది. గతంలో తెలుగుదేశం ఏ తప్పు చేసిందో అదే తప్పు నేడు ప్రతీకార వాంఛతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కూడా చేస్తున్నది.
ఎన్నికల కమిషన్‌ పోలింగు వాయిదా వేయడాన్ని ముఖ్యమంత్రి తప్పు పట్టారు. ఆయనకు ఉక్రోషం రావడాన్ని అర్థం చేసుకోవచ్చు. తనకుగానీ, ఉన్నత స్థాయి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకుగానీ కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఎన్నికల కమిషన్‌ ఇలాంటి నిర్ణయం చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌ తొందరపాటు కనిపిస్తున్నది. నామినేషన్ల సందర్భంగా అక్రమాలు జరుగుతున్నా ఎన్నికల కమిషన్‌ కబోధి లాగా వ్యవహరించింది. సకాలంలో జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు కూడా ఆ స్థానాల్లో ఎన్నికల రద్దు చేయకుండా అదే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. అక్రమాలు జరిగిన చోట అధికారులపై చర్యలు తీసుకున్నారు. కాని అక్రమాలను కొనసాగిస్తామనడం ఎలా న్యాయం?
ముఖ్యమంత్రి స్థాయిని కూడా మరచి ఎన్నికల కమిషన్‌కు దురుద్దేశ్యాలు ఆపాదించారు. నెలన్నర పాటు అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా అడ్డుకోవడానికే ఇలా వాయిదా వేశారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని ఆగ్రహించారు. కానీ ఎన్నికల అక్రమాల గురించి కనీసం మాట మాత్రంగా ప్రస్తావించలేదు. ఎన్నికల కమిషన్‌ అధికారాల గురించి ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి తన అధికార పరిధిని మాత్రం గుర్తించడం లేదు. ఎన్నికల కమిషన్‌ స్వతంత్ర పాత్రను గుర్తించ నిరాకరిస్తూ తానే సర్వాధికారినని చెప్పుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సూచన. రాజ్యాంగం, ప్రజాస్వామిక విలువలు ఈ రోజు ముఖ్యమంత్రికి గుర్తుకు రావడం మంచిదే. తనది అవధులు లేని అధికారం కాదన్న విషయం బహుశా ఈ ఘటనతో ఆయనకు అనుభవమై ఉంటుంది. ఇదే ముఖ్యమంత్రి ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉందన్న విషయం మర్చిపోతున్నారు. ప్రతిపక్షంలో ఉండగా పౌరహక్కుల గురించి రోజూ మాట్లాడిన జగన్‌ మోహన్‌ రెడ్డి గారికి అధికారం లోకి రాగానే అవే పౌరహక్కుల్ని అణగదొక్కేయడానికి క్షణం పట్టలేదు. నేడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏళ్ళ తరబడి 144 సెక్షన్‌, 30(ఎ) పోలీసు యాక్టు అమలులో ఉంటున్నాయి. ఎక్కడా ఊరేగింపులను, ధర్నాలను అనుమతించరు. సమ్మెలను అణచివేస్తున్నారు. భిన్నాభిప్రాయాలను అణగదొక్కుతున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినట్లు గానే అర్థరాత్రి యూనియన్‌ నాయకుల ఇళ్ళకు వెళ్ళి పోలీసులు బెదిరిస్తూనే ఉన్నారు. రాజకీయ పార్టీలకు ఉద్దేశాలు ఆపాదించి నోరెత్తకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరూ ప్రపంచబ్యాంకు పాఠశాలలో చదివిన విద్యార్థులే.
ఈరోజు జగన్‌ మెహన్‌ రెడ్డి అనుసరించిన పద్ధతులు గతంలో చంద్రబాబు నాయుడు అనుసరించిన పద్ధతులకు ఏమాత్రం భిన్నమైనవి కావు. కాకుంటే వ్యక్తులు మారారు. జెండాలు మారాయి. రంగులు మారాయి. ఎజెండా మాత్రం అదే. బడా కార్పొరేట్లకు ఊడిగం చేసే విధానాలే. నాడు కుట్రదారుడుగా జగన్‌ అభివర్ణించిన ముఖేష్‌ అంబానీ ఈరోజు మిత్రుడైపోయాడు. ఆయన చెప్పిన అభ్యర్థికి ఏకంగా రాజ్యసభ సీటు ఇచ్చారు. ఈ రాష్ట్రం లోని పెట్రో వనరులన్నీ దోచుకొని ఇతర రాష్ట్రాలకు, దేశాలకు అమ్ముకొని లక్షల కోట్లు వెనకేసుకునే అంబానీ అభ్యర్థి పరిమళ్‌ నత్వాని ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఎలా కాపాడగలుగుతాడో ముఖ్యమంత్రి ఇంత వరకు వివరణ ఇవ్వలేదు. రాజ్యసభ సభ్యుడంటే రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించాలి. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. నత్వాని అలా కాపాడగలరని జగన్‌ మాటివ్వగలరా? గత ప్రభుత్వం బాట లోనే ప్రయివేటీకరణ విధానాలు అనుసరిస్తున్నారు. నాడు తెలుగుదేశం విధానాలపై పోరాడిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీలు, ఆశాలు, గ్రామ సేవకుల ధర్నాలు, ఆందోళనలకు పిలవకుండానే వచ్చి వైఎస్సార్‌ నాయకులు కూర్చున్నారు. నేడు అదే వైఎస్సార్‌ పార్టీ అధికారం చేపట్టగానే వాళ్ళను అణచివేయడం మొదలు పెట్టింది. సిపియస్‌ ఉద్యమానికి నాడు మద్దతు తెలియజేసి నేడు చుట్ట చుట్టి పక్కన పడేసింది. తాము తెలుగుదేశంతో ఎందులో భిన్నమో నిరూపించుకోవాల్సిన బాధ్యత వైఎస్సార్‌ పార్టీకి వుంది.
అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చోగానే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రజాస్వామ్య హక్కులు గుర్తుకొచ్చాయి. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఇప్పుడు ఆయన ఊరూరా తిరిగి పౌర హక్కుల గురించి ఉపన్యాసాలు దంచుతున్నారు. తాను అధికారంలో ఉన్నంతకాలం కుర్చీ శాశ్వతం అనుకున్నారు. ప్రజా ఉద్యమాలను అణచి వేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కారు. వామపక్షాల మాటలను పెడచెవిన పెట్టారు. కాలం చెల్లిన వామపక్షాలని, అభివృద్ధి నిరోధకులని తూలనాడారు. నేడు అవే వామపక్షాల మద్దతు వారికి కావాల్సి వచ్చింది. ఇప్పటికిప్పుడు ఓటు బలం లేకున్నా, ప్రజల్లో కమ్యూనిస్టులకు వున్న నైతిక బలం ఇదే.
ప్రపంచీకరణ సంక్షోభంలో పడ్డ నేపథ్యంలో వైఎస్సార్‌సిపి, తెలుగుదేశం పార్టీలు పాఠాలు నేర్చుకోవాలి. కమ్యూనిస్టులు మారడం లేదని విమర్శిస్తూ కూర్చోవడం కాకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వారూ మారాలి. ప్రపంచ వ్యాపితంగా పోరాట గాలులు వీస్తున్నాయి. విఫలమైన ప్రపంచీకరణకు ప్రత్యామ్నాయం కోసం యువత అన్వేషిస్తున్నది. అమెరికా లాంటి దేశాల్లోనే సోషలిజంపై బహిరంగ చర్చ నడుస్తున్నది. విద్యా, వైద్య, రవాణా రంగాలను ప్రభుత్వ రంగంలో నిర్వహించాలన్న వాణి పైచేయి సాధిస్తున్నది. మాంద్యంతో పరిశ్రమలు విలవిలలాడిపోతున్నాయి. ప్రభుత్వ ఖజానాలు ఖాళీ అవుతున్నాయి. బ్యాంకులు దివాళా ఎత్తుతున్నాయి. ఈ స్థితిలో పాలకుల్లో ప్రజల పట్ల నమ్రత, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం కావాలి. మారుతున్న పరిస్థితులను గుర్తించి నడుచుకుంటే ప్రజావిశ్వాసాన్ని చూరగొంటారు.

- వి శ్రీనివాసరావు (వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు)

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top