తిరుపతి: ప్రముఖ క్యారియర్ ఏసీ తయారీ యూనిట్‌కు రాష్ట్ర విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం భూమి పూజ చేయనున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.
వెంకటేశ్వర్ తెలిపారు. శ్రీ సిటీలో శంకుస్థాపన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు హెలిప్యాడ్, భూమి పూజ స్థలం తదితర అవసరమైన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, శ్రీ సిటీ ఎండీ రవి సన్నారెడ్డి లతో కలిసి సంయుక్తంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అమెరికాకు చెందిన ప్రముఖ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ క్యారియర్ గ్లోబల్ కార్పోరేషన్ (Carrier Global Corporation) ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో భారీ పరిశ్రమ స్థాపనకు సిద్ధమైందన్నారు. గృహేతర అవసరాలకు అనువైన ఆధునిక ఏసీ ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం మే 6న ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని, సంస్థ సీఎండీ డేవిడ్ గిట్‌లిన్ కూడా పాల్గొననున్నారని పేర్కొన్నారు. శంకుస్థాపన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని తెలిపారు. హెలిప్యాడ్, భూమి పూజ స్థలం తదితర ఏర్పాట్లను జిల్లా ఎస్పీ మరియు శ్రీ సిటీ ఎండీతో కలిసి పరిశీలించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ ఆచారి, ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్, స్పెషల్ బ్రాంచ్ సిఐ విక్రమ్ తహసీల్దార్, పరిశ్రమల శాఖ, శ్రీసిటీ, క్యారియర్ సిబ్బంది , పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

