Dailyhunt
Layoff: కాగ్నిజెంట్‌లో భారీ కోతలు!

Layoff: కాగ్నిజెంట్‌లో భారీ కోతలు!

- ఐటీ రంగంలో ఆందోళన

న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్‌ భారీ స్థాయిలో ఉద్యోగులను తగ్గించుకునే ప్రణాళికలో ఉందన్న వార్తలు ఐటీ రంగంలో ఆందోళన కలిగిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 12,000 నుంచి 15,000 మంది ఉద్యోగాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ ఉద్యోగ కోతలలో అధిక భాగం భారతదేశంలోనే ఉండే అవకాశముంది. ఈ ఏడాది ఇప్పటికే ఒరాకిల్, అమెజాన్ సంస్థలు చేపట్టిన తొలగింపుల తర్వాత, ఐటీ రంగంలో ఇది అతిపెద్ద ఉద్యోగ కోతలలో ఒకటిగా భావిస్తున్నారు.
ప్రస్తుతం కాగ్నిజెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 3.57 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, భారతదేశంలోనే 2.5 లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు. కంపెనీ 'ప్రాజెక్ట్ లీప్' పేరుతో చేపడుతున్న పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఏప్రిల్ 29న జరిగిన త్రైమాసిక ఫలితాల సమావేశంలో, ఉద్యోగ కోతలకు గురయ్యే వారికి అందించే ప్రయోజనాల కోసం సుమారు ₹1,900 కోట్లు ($230 మిలియన్) నుంచి ₹2,650 కోట్లు ($320 మిలియన్) వరకు కేటాయిస్తామని కంపెనీ వెల్లడించింది. భారతదేశంలో ఒక ఉద్యోగి సగటు వార్షిక వేతనం సుమారు రూ. 15 లక్షలు ఉండగా, ఆరు నెలల వేతనం పరిహారంగా ఇస్తే ఒక్కొక్కరికి సుమారు రూ. 7.5 లక్షలు లభించే అవకాశం ఉంది. ఈ లెక్కల ప్రకారం, భారతదేశంలోనే 12,000-13,000 మంది వరకు ఉద్యోగాలు కోల్పోయే అవకాశముందని అంచనా.

పరిశ్రమ వర్గాల ప్రకారం, క్లయింట్లు ఇకపై ప్రవేశ స్థాయి ఉద్యోగులపై అధికంగా ఆధారపడే పాత విధానాన్ని తగ్గిస్తూ, నైపుణ్యం కలిగిన సిబ్బందిపై దృష్టి సారిస్తున్నారు. కొత్త ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంపై ఖర్చు పెట్టడానికి కూడా వారు వెనుకంజ వేస్తున్నారు. ఇదే నేపథ్యంలో కాగ్నిజెంట్‌ కంపెనీ సీఈఓ ఎస్ రవికుమార్ సంస్థ పునర్‌వ్యవస్థీకరణకు సంకేతాలు ఇచ్చారు. డిజిటల్ సామర్థ్యాలను పెంచడం, ఉద్యోగుల వినియోగాన్ని సమర్థవంతంగా మార్చడం ద్వారా సంస్థను మరింత దృఢంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ మార్పులు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti