Saturday, 08 Apr, 11.39 am ప్రజాశక్తి

తాజావార్తలు
మాయ‌బ‌జార్‌కి 60 ఏళ్ళు‌

                  తెలుగు సినిమా అడుగులు వేస్తున్న రోజులవి మాటలు నేర్చుకుని....పాటలు పాడుకుంటున్న రోజులవి. ఆ రోజుల్లో సినిమా ఓ కళ.....'వాణి' తర్వాత ఆ 'కళ'కు వ్యాపారం తోడయ్యింది.....'వాణి' కాస్తా వాణిజ్యంగా రూపాంతరం చెందింది. తెలుగు సినిమా బతికి బట్టకట్టి స్వతంత్రంగా బతుకుతున్న రోజుల్లో మూలా నారాయణ స్వామి వారి ఆధీనంలో వున్న విజయ వాహిని స్టూడియోస్‌ని నాగిరెడ్డి,చక్రపాణి గార్లు అందిపుచ్చుకున్నారు. ఆ రోజుల్లో వారి తపన ఒక్కటే సంస్థని బతికించుకోవాలి...ఏ సినిమా చేసినా ప్రేక్షకులు కలకాలం గుర్తుంచుకోవాలి. సరిగ్గా అదే సమయంలో ఆవిర్భవించిన కథే మాయాబజార్‌.


'శశిరేఖా పరిణయం' (1936) మాయాబజార్‌ ట్యాగ్‌లైన్‌తో వచ్చింది గాని జనరంజకంగా లేదు. ఎందుకో చక్రపాణి గారికి ఆ కథ మీద మక్కువ. చక్రపాణి మాట మీద నాగిరెడ్డికి అపారమైన నమ్మకం. ఒక్క మాటలో చెప్పాలంటే నాగిరెడ్డి, చక్రపాణిల శరీరాలు వేరయినా ప్రాణం ఒక్కటే. వాళ్లది ఒకేమాట...ఒకే బాట..ఒకే గమ్యం. అందుకే ఇన్ని విజయ వంతమైన చిత్రాలు చేయగలిగారు. ఇంత గొప్ప విజయవంతమైన పయనం ఒక్కటై చేసి చరిత్రని సృష్టించగలిగారు. తెలుగులో సువర్ణాధ్యాయాన్ని సృష్టించిన చిత్రంగా మాయాబజార్‌ని మలిచారు.
ఇందులో ఏముంది? 
'మాయాబజార్‌' చిత్రాలలో 'మాయ' వుంది....మత్తు వుంది...గమ్మత్తు వుంది. అదే ప్రేక్షకుల్ని మైకంలో పడేసింది. ఆ హ్యాంగోవర్‌ యింకా తగ్గలేదు. మరో నాలుగు పదుల వసంతాలు వుంటుందన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. 
మాయాబజార్‌ ఎలా పుట్టిందంటే...
నాగిరెడ్డి, చక్రపాణి, పింగళి, కె.వి.రెడ్డి కమలాకర కామేశ్వరరావు, మార్కస్‌ బార్లే ్ట, లింగమూర్తి, సంగీతం, యస్‌.రాజేశ్వర రావు, ఘంటసాల మాస్టారు ఇటువంటి మేధావులు మేలుకలయికతో పుట్టింది. అప్పుడు పుట్టిన ఈ 'మాయాబజార్‌' అనే పసిపాపకి ఇప్పుడు 60 ఏళ్లు!. మాయాబజార్‌ షష్ఠి పూర్తి జరుపుకుంటోంది.(ఎవరూ ఆ ఊసెత్తకపోయినా)కథ కావాలి. పాండవులు వుండకూడదు. కథలో చమక్కులుండాలి. చక్రపాణి మాటల్లో... ధియేటర్లో సినిమా చూస్తున్నా ప్రేక్షకుల్ని మూడుగంటలు మైకంలో పడేయాలి. ఇంటికొచ్చి ఆలోచించుకుంటే చెప్పుకోడానికి నెలరోజులు సరిపడా సమాచారం వుండాలి. పాటలు ప్రతిదీ ఆణిముత్యంలా వుండాలి. పండిత పామర జనాల నాల్కల మీద నానాలి. వెరసి నటీనటులు గానీ సాంకేతిక నిపుణులు గానీ ఈ సినిమాకి పూర్ణాయుష్షునివ్వాలి. ఇదే నాగిరెడ్డి, చక్రపాణి లక్ష్యం. ఈ లక్ష్యంలోంచి పుట్టుకొచ్చిన కథే మాయాబజార్‌. సన్నివేశాల రూపకల్పనలో చక్రపాణి గారి మ్యాజిక్‌ కనిపిస్తుంది. చక్రపాణి గొప్ప దార్శనికుడు...ఎంత గొప్ప దార్మినికుడు అంటే ఆ రోజుల్లో టీ.వి(శాటిలైట్‌)లైవ్‌ చూపించాడు. దానికి ప్రియదర్శిని పేరుపెట్టాడు. ఘటోత్కచుడు రూపకల్పన అదే. ఘటోత్కచుడి పాత్రని పరిచయం చేస్తూ... ఓ కొండమీద కాలు మోపితే... బండ విరిగి పడుతుంది. హిడింబి పాత్రకి ఓ ప్రయోజనం వుంటుంది. అదే శశిరేఖా అభిమన్యుల వివాహం. బలరామకృష్ణులు లీలావతి, సుభద్రలు....వారి బలహీనతలూ వారి బలాబలాలు, దుర్యోధనుడు, శకుని, లక్ష్మణ కుమారుడు వీరి దురహంకారం...లేకితనం...ఇవన్నీ కలగలిపి, అభిమన్యుడూ శశిరేఖల ప్రణయం చాలా తమాషాగా చూపించాడు. సన్నివేశాల రూపకల్పనలో ఇల్లుగా చూపించి ఫ్లోర్‌లోనే అందమైన నందనం సృష్టించి....లాహిరి లాహిరి..లాహిరిలో పాట ప్రేక్షకుల చేత పాడించాడు. మాయాబజార్‌లో వెన్నెల విహారానికి వెళ్లిన మూడు జంటల్ని ఎవరైనా మరిచిపోగలరా? అలాగే ఘటోత్కచుడి 'వివాహభోజనంబు' పాట ...ఫలహారాలూ...పిండివంటలు... ఇప్పటికీ కళ్లముందు మెదులుతూ వుంటుంది. ఈ సన్నివేశాలు అతికినట్లుండవు. అంతర్భాగంగా వుంటాయి. పడుగు పేకల్లా ....కల్నేతలా కలిసి పోతాయి. అదే చక్రపాణి చమక్కు. కథగా చెప్పుకోడానికి పెద్దగా ఏమీ వుండదు. ఏమీ లేదు కదా అని ఆలోచిస్తే ప్రతి ఫ్రేమూ ఆకర్షించేదే... ఆలోచింపచేసేదే...ఆనందింపజేసేదే. ఇదే మాయాబజార్‌ మాయ...కథ!
శ్రీకృష్ణుడిగా ఎన్‌.టి.ఆర్‌ పనికొస్తాడా?
ఈ ఆలోచన అందరికీ వచ్చింది. అప్పట్లో కృష్ణుడంటే ఈలపాట రఘురామయ్య, సి.యస్‌.ఆర్‌ ఆంజనేయులు, అమర్‌నాథ్‌, సి.హెచ్‌ నారాయణరావు, వై.విరావు ఇత్యాది అందగాళ్లుండేవారు. వీరికి ఆటా, మాటా, పాటా మూడూ తెలుసు వీరందర్నీ కాదని యన్‌.టి.ఆర్‌ ఎలా తెరమీదికొచ్చాడు. ఈ చిత్రానికి సహయక దర్శకుడు కమలాకర కామేశ్వరరావు మంచి పాత్రికేయుడు. సినిమాలపై గొప్ప సంచలనాత్మక సమీక్షలు రాస్తుండేవాడు. ఆయన సునిశిత పరిశీలనకి, సూక్ష్మదృష్టికి వెంటనే గోఖలే చేత స్కెచ్‌ వేయించి..యన్‌.టి.ఆర్‌ కృష్ణుడి వేషంలో ఎలావుంటాడో చూపించి...నాగిరెడ్డి చక్రపాణిలను సమ్మోహనపరిచాడు కమలాకర. లింగమూర్తి కూడా మంచి భావుకుడు..మంచి జర్నలిస్టు. లింగమూర్తి మాటమీద ఎన్‌.టి.ఆర్‌లో ఏదో సమ్మోహన శక్తి వుందని భావించేవాడు కె.వి.రెడ్డి. ఆయన నమ్మకం వమ్ము కాలేదు. మాయాబజార్‌ సినిమా రిలీజయ్యింది. ప్రేక్షకులు బళ్లు కట్టుకుని మరీ వచ్చి చూశారు. చూసిన వాళ్లు మళ్ళీ మళ్లీ చూశారు. మాయాబజార్‌ చిత్రంలో శ్రీకృష్ణుడి(ఎన్‌.టి.ఆర్‌) ఫోటో ఇంటింటా వెలసింది. చివరికి శ్రీకృష్ణుడంటే యన్‌.టీ.ఆర్‌ అన్నంతగా ప్రేక్షకుల మనోఫలకాల మీద ముద్రపడిపోయింది. 
మాయాబజార్‌ మాటలు...పాటలు..
మాయాబజార్‌ గొప్పదనం గురించి ఓ పుస్తకమే రాయొచ్చు. అంత విషయం వుంది. మాటలు రాయడం మాటలు కాదంటాడు ఆత్రేయ. ఎవరో ఒకరు ఏదో ఒక మాట పుట్టించకపోతే మాటలు ఎలా పుడతాయి? అలానే కంబలి, గింబలి, తల్పం, గిల్పం, అసమదీయులు, తసమదీయులు, హైహై నాయకులూ..ఇలా సందర్భోచితమైన సరసమైన మాటలు పుట్టుకొచ్చాయి. మాయాబజార్‌లోని పింగళి మాటల వెనుక చక్రపాణి గారి హాస్యముంది. దీర్ఘసమాసాలుంటేనే అది పౌరాణిక సంభాషణం అని భ్రమలో మూల్గుతున్న రోజులు...ఆ ఛాందసపు భావాలని భాష తెంచుకొని రావాలి. నేలక్లాసు ప్రేక్షకుడికి చేరాలి. ఇదీ చక్రపాణిగారి వాదం. కృష్ణుడు, బలరాముడు, సుభద్ర, శశిరేఖ, అభిమన్యుడు ఇలా అందరూ సర్వజనరంజకమైన, సర్వజన ఆమోదయోగ్యమైన భాషని మాట్లాడారు. అందుకే థియేటర్లో సినిమా చూస్తున్న ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. ఇప్పటికే మాయాబజార్‌ సినిమాని చూసి మైమరిచిపోతున్నారు. పింగళి మాటల మీద ఎంత శ్రద్ధపెట్టాడో, పాటల మీదా అంతే శ్రద్ధపెట్టాడు. ఇక స్వరసారథ్యం కోసం ముందుగా ఆ బాధ్యతని యస్‌.రాజేశ్వరరావుకి అప్పగించారు. రాజేశ్వరరావు అల్లి బిల్లి పిల్లలకు, 'విన్నావటమ్మా యశోదమ్మా చిన్న కృష్ణుడి వింతలు', 'చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మా', 'నీవేనా నను పిలచినది' నాలుగయిదు పాటలకు ట్యూన్‌ చేశారు. పాటలు ఓ మోస్తరుగా వున్నాయి. పాటలు చాలా చాలా బావుండాలి. కష్టపడి ప్రయత్నించండి' అని చక్రపాణిగారన్నారు. అందుకు రాజేశ్వరరావు కోపాన్ని బైటపెట్టకుండా..'అయ్యా! నేనేపని చేసినా కష్టపడే చేస్తాను. ఇంత కంటే ఎక్కువ కష్టపడలేను. మరొకరు కష్టపడేవార్ని పెట్టుకోండి!' అంటూ వెళ్లిపోయారు. ఆ తర్వాత ఘంటసాల వారిని సంప్రదిస్తే 'ఘంటసాల రాజేశ్వరరావు మిగతా పాటలూ పద్యాలకు స్వరరచన చేశారు. ఇవి ఘంటసాల మాధుర్యాన్ని సంతరించుకున్నాయి. 
మార్కస్‌ బార్ల్టే మాయాజాలం
మార్కస్‌ బార్ల్టే, కె.వి.రెడ్డి గారితో బాగా ట్యూనయ్యాడు. ఆ రోజుల్లో ఎన్నో విజువల్‌ వండర్స్‌ చూపించాడు. ముఖ్యంగా ఘటోత్కచుడు ఎపిసోడ్‌ ఇప్పటికీ వండర్‌. స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ లేవు. గ్రాఫిక్స్‌లేవు. కేవలం కెమేరాతో ట్రిక్‌వర్క్‌ చేసి ప్రచంచ తెలుగు ప్రేక్షకులందర్నీ అబ్బురపరిచాడు. దటీజ్‌ బార్ల్టే! బార్ల్టే పనితనానికి ఒక్క 'వివాహ భోజనంబు' పాట చాలు! అక్కినేని మాటల్లో...''మాయాబజార్‌'లో పేరుకి నేను రామారావు ప్రధాన పాత్రలు చేసినప్పటికీ నిజమైన హీరోలు సావిత్రి, యస్వీ రంగారావు. వీరిద్దరూ సినిమాలో దున్నేశారు. పాత్రలతో ఆడుకున్నారు. అందుకని ఫస్ట్‌ మార్కులు సావిత్రి యస్వీఆర్‌లకే దక్కుతాయి. తర్వాత రామారావు, ఆ తర్వాత నేను...ఇది నిజం!' అంటూ నిజం ఒప్పుకున్నాడు.
సావిత్రి యస్వీఆర్‌ల పరకాయ ప్రవేశం
అప్పటికే సావిత్రి గొప్ప నటిగా పేరుతెచ్చుకుంది. కె.వి.రెడ్డి సీను చెప్పేవారు. కళ్లు మూసుకొని వినేది. రెడీ టేక్‌ అనేది. ఆశ్చర్యం. ఒక్క టేకులో యూనిట్‌ అందరూ చప్పట్లు కొట్టేలా నటించేది. ఇది చూసి యస్‌వి రంగారావు తనవంతు వచ్చేసరికి ఒళ్లు దగ్గరుంచుకొని నటించేవాడు. ఈ మాట స్వయంగా ఆయనే ఒప్పుకున్నాడు. సెట్‌లో సావిత్రి యస్వీఆర్‌లు పోటీపడి నటించేవారు. అది చూసి కె.విరెడ్డి కాలుమీద కాలువేసుకుని చొక్కా బటన్స్‌ రెండు విప్పి...కాలర్‌ పైకి ఎగదోసి 'పాస్‌' అనేవారు. కె.వి రెడ్డిగారు పాస్‌ అంటే ఈ రోజుల్లో జాతీయ అవార్డు వచ్చినంతగొప్ప.(ఈ రోజుల్లో దర్శకుల కాళ్లమీద పడిపోతున్నారు. అది వేరే విషయం) సావిత్రి శశిరేఖ పాత్రలోనే కాదు. ఘటోత్కచుడి పాత్రలోనూ పరకాయప్రవేశం చేసింది. ముద్దుగా..బొద్దుగా..సెలయేటి గలగలల్లా నవ్వుతూ నిజంగా శశిరేఖ ఇలా వుంటుందేమో అనే భ్రమ కల్గించింది. ఇక యస్‌విఆర్‌ విషయానికొస్తే ఆయన ఆది నుంచీ ఇంగ్లీషు నటుల్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొనేవాడు. నేటివిటీ మనది. అభినయం ఇంగ్లీషు వారిది. షరాఫ్‌, షెల్లాక్‌ల నటన ప్రభావం యస్‌విఆర్‌ మీద చాలా వరకూ వుంది. శశిరేఖ, అభిమన్యు పాత్రలకు నటులు ప్రాణప్రతిష్ఠ చేసారు. ఈ సినిమా కలరింగ్‌ జగన్మోహనరావు చేసినప్పుడు గుమ్మడి ఎంత మురిసిపోయాడో...ఇప్పుడు ఎవరూ లేరు. సినిమా వుంది. మాయాబజార్‌ వుంది. ఇప్పటికి అరవై ఏళ్లు. త్వరలో సహస్ర పున్నముల దర్శనం చేసుకుంటుంది.
పూర్ణాయుష్షుతో శతమానంభవతి అనిపించుకుంటుంది. 
ఎప్పటికీ నిత్య నూతనంగా వుంటుంది. 
అందుకే అది మాయాబజార్‌ ...
ఆ మాయాబజార్‌కి షష్ఠిపూర్తి! 
ప్రపంచవ్యాప్తంగావున్న తెలుగువారందరూ గర్వపడే సినిమా..
ఇంతటి గొప్ప దృశ్యకావ్యాన్ని అందించిన దర్శకనిర్మాతలు పూజ్యనీయులు. 
తెలుగుజాతి కలకాలం దీన్ని గుర్తుంచుకుంటుంది...!!! 
- ఇమంది రామారావు
9010133844

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top