ప్రజాశక్తి-కాకినాడ ఖరీప్ 2021-22 పంట కాలానికి కనీస మద్దతు ధరపై ధాన్యం కొనుగోలు చేసే విధంగా పెద్ద ఎత్తున రైతుల్లో అవగాహన కల్పించాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు.
శనివారం కాకినాడ కలెక్టరేట్‌లో నిర్వహించిన వ్యవసాయ సలహామండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన పంటను కనీస మద్దతుకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొనుగోళ్లు జరిగితే చట్టపరమైన చర్యలుంటాయన్నారు. రైతు పండించిన ధాన్యంలో 17 శాతం తేమ, నిమ్ము ఉండే కనీస మద్దతు ధర వస్తుందని మూడు రోజుల పాటు ఎండపెడితే సరిపోతుందన్నారు. కనీస మద్దతు ధర సాధారణ రకం క్వింటాలకు రూ.1940, 75 కేజీ బస్తా రూ.1455, గ్రేడ్ ఎ రకం క్వింటాలుకు రూ.1960లు, 75 కేజీ బస్తా రూ.1470లు ప్రభుత్వ ధరగా నిర్ణయించినట్టు చెప్పారు. సందేహాల కోసం కంట్రోల్ రూమ్ నెం.0884-6454341ను సంప్రదించాలన్నారు. ధాన్యం పండించిన రైతుల నుంచే ధాన్యం కొనుగోలు చేస్తారని దళారుల ద్వారా వచ్చే ధాన్యాన్ని కొనుగోలు చేయరని లక్ష్మీశ స్పష్టం చేశారు. మరింత సమాచారం కోసం స్థానిక రైతు భరోసా కేంద్రాలను సంప్రదించాలన్నారు. బొండాల రకం విత్తనాలను నియంత్రించి అపరాల సాగుకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా రైతులను చైతన్య పరచాలన్నారు. జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదని పుకారులను నమ్మవద్దదన్నారు. వ్యవసాయ అధికారులు, సలహామండలి సభ్యులు ధాన్యం కనీసం మద్దతు ధరపై రైతుల్లో విస్తత స్థాయిగా అవగాహన కల్పించాలని లక్ష్మిశ వివరించారు. జిల్లాలోని చివరి ఆయుకట్టుకు సాగునీరు అందించే విధంగా ఇరిగేషన్ ఇంజనీర్లు పర్యవేక్షిస్తున్నారని లక్ష్మీశ తెలిపారు. కాలువల్లో వున్న గుర్రపు డెక్కను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నట్లు ఇరిగేషన్ ఎస్‌ఇ బి.రాంబాబు తెలిపారు. పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్ ఇంజనీర్లు సమన్వయంతో పని చేస్తూ స్థానిక ప్రజా ప్రతినిధులైన జెడ్‌పిటిసిలు, ఎంపిటిసిలు, ఎంపిపి సర్పంచ్‌ల సహకారం తీసుకుని కాలువలపై ఉన్న ఆక్రమణలను తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ ఇంజనీర్లను ఆయన ఆదేశించారు. మండలాలవారీగా ఆక్రమణలను గుర్తించి వాటి వివరాలను అందిస్తే సంబంధిత తహశీల్దార్లకు పంపి తక్షణం తొలగించే విధంగా చర్యలు చేపట్టినట్టు చెప్పారు. కాలువల ఆక్రమణల వల్ల పంట చేలకు నష్టం జరుగుతుందనే పలువురు సభ్యులు ఈ సందర్భంగా సమావేశం దష్టికి తీసుకొని వచ్చారు. కోనసీమలో ఉపాధి హామీ పథకం కింద నాటుతున్న మొక్కల వల్ల ప్రయోజనం లేదని వీటికోసం హెచ్చించే మొత్తాన్ని కాలువ అభివద్ధికి వినియోగిస్తే మంచి ఫలితాలు వస్తాయని సభ్యులు తెలిపారు. పిడుగుపాటుకు నష్టపోయిన ఉద్యాన వన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని సభ్యులు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ వివరించారు. గ్రామ, మండల స్థాయిలో ప్రతినెలా నిర్వహిస్తున్న వ్యవసాయ సలహా మండలి సమావేశాల్లో చర్చించి వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు.

