54 స్మార్ట్ కిచెన్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
4వేల మంది ఎండిఎం కార్మికుల ఉపాధికి ఎసరు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : బడి పిల్లలకు నాణ్యతతో కూడిన పౌష్టికాహార భోజనం అందిస్తామన్న పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు చర్యలు ప్రారంభించింది.
కార్మికులతో పాఠశాలల్లో వంటలు చేసే విధానానికి స్వస్తి పలికి స్మార్ట్ జిల్లాలోని పలుచోట్ల స్మార్ట్ కిచెన్‌లు ఏర్పాటు చేసి వాటి ద్వారా పాఠశాలలకు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇదే జరిగితే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందకపోవడంతో పాటు జిల్లాలో పనిచేస్తున్న సుమారు 4వేల మంది మధ్యాహ్న భోజన కార్మికుల ఉపాధి దూరం కానుంది.జిల్లాలో 1719 పాఠశాలల్లో సుమారుగా లక్షన్నర మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకాన్ని వినియోగించుకుంటున్నారు. వీరికి వేడివేడిగా భోజనం సకాలంలో అందించేందుకు పాఠశాలల్లో సుమారు 4వేల మంది మహిళా కార్మికులు వంటలు చేస్తున్నారు. అయితే మహిళా కార్మికులతో కాకుండా ప్రైవేటు వ్యక్తులతో అందించేందుకు ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ విధానాన్ని ముందుకు తీసుకొచ్చింది. గతంలో ధార్మిక సంస్థలకు మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రయత్నం చేయగా అప్పుడు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, పలు ప్రజాసంఘాలు, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం, ఉపాద్యాయులు మద్దతుతో పోరాడి వెనక్కి తిప్పికొట్టారు. అయితే మళ్లీ నేడు ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ పేరుతో మధ్యాహ్న భోజన పథకం ప్రైవేటీకరణ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ప్రతి జిల్లా నుంచి స్మార్ట్ కిచెన్‌లు ఏర్పాటు కోసం ప్రతిపాదనలు కోరింది. గత ఏడాది డివిజన్‌కు ఒక స్మార్ట్ కిచెన్ అనే ప్రతిపాదనను పక్కన పెట్టి నేడు ప్రతి మండలానికి రెండు స్మార్ట్ కిచెన్‌లు ఏర్పాటుకు ప్రతిపాదనలు కోరింది. దీంతో జిల్లాలో ఉన్న 27మండలాలకు 54 స్మార్ట్ కిచెన్‌లు ఏర్పాటుకు జిల్లా విద్యా శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం అర గంట సమయంలోనే భోజనాన్ని 2500 మంది విద్యార్థులకు సరఫరా చేసే విధంగా స్మార్ట్ కిచెన్‌లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీని ప్రకారం జిల్లాలో వేపాడ, లక్కవరపుకోట మండలాల్లో ఒక్కొక్కటి తప్ప మిగిలిన అన్ని మండలాలకు రెండేసి స్మార్ట్ కిచెన్ లు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి అధికారులు పంపించారు. వేడి వేడి అన్నానికి దూరం కానున్న విద్యార్థులుప్రభుత్వ పాఠశాలల్లో అమలు జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఇప్పటివరకు వేడి వేడిగా తయారైన భోజనాన్ని విద్యార్థులు తినేవారు. స్మార్ట్ కిచెన్‌ల ద్వారా వేడి వేడి అన్నం, కూరలు అందే అవకాశం లేదు. ఉదయం మండల కేంద్రంలో ఎక్కడా తయారు చేసిన భోజనం మధ్యాహ్నం 12 గంటల సమయంలో వాహనాలు ద్వారా తీసుకెళ్లి విద్యార్థులకు అందిస్తామని అధికారులు చెబుతున్నారు. ఆచరణలో ఒకే సమయానికి అన్ని పాఠశాలలకు భోజనం తరలించే అవకాశం ఉండదు. ఉదయం నుంచి వంట చేస్తే తప్ప 2500 మంది విద్యార్దులకు అందించలేని పరిస్తితి ఏర్పడుతుంది. దీంతో వేడి వంటకాలకు విద్యార్థులకు దూరమయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం భోజనం నిర్వాహకులు అందించే వేడివేడి భోజనాన్ని పిల్లలకుదూరం చెయ్యొద్దని కార్మికులు కోరుతున్నారు.4 వేల మంది ఉపాధికి మంగళంస్మార్ట్ కిచెన్లు రావడం వలన జిల్లాలో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తున్న 4వేల మంది మహిళలు ఉపాధికి మంగళం పాడే అవకాశం ఉంది. స్మార్ట్ కిచెన్ పేరుతో వచ్చే ఏడాది నుంచి పాఠశాలల్లో భోజనాలు అందించే అవకాశం వర్కర్లకు లేకుండా ప్రైవేటు వెహికల్స్ ద్వారా పంపించనున్నారు, దీనివల్ల జిల్లాలో ఉన్న నాలుగువేల మంది కార్మికులు ఉపాధి పోతుంది. గత 25 సంవత్సరాల నుండి బిల్లులు రాకపోయినా, జీతాలు రాకపోయినా, అప్పులు చేసి పుస్తెలతాలు తాకట్టు పెట్టి పిల్లలకి వేడివేడి భోజనం పెట్టారు. అంతటి త్యాగాలు చేసిన భోజన కార్మికులపై స్మార్ట్ కిచెన్‌ల పేరిట వేటు వేసే చర్యలు పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. స్మార్ట్ కిచెన్‌ల ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి స్మార్ట్ కిచెన్‌ల ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. గతంలో నెల్లిమర్ల ప్రాంతాన్ని నవప్రయాస్ అనే సంస్థకు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు, మధ్యాహ్న భోజన పథక కార్మిక యూనియన్‌గా సిఐటియు, ఎస్‌ఎఫ్‌ఐ తదితర ప్రజాసంఘాలతోకలసి పోరాటం చేశాం. ప్రభుత్వం దిగివచ్చి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది, తాజాగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మానుకోవాలి. లేదంటే పెద్ద ఎత్తున పిల్లల తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు, ప్రజలతో కలిసి పోరాటం చేస్తాం. బి.సుధారాణి,
ఎపి మధ్యాహ్న భోజన పథకం కార్మిక యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి
54 స్మార్ట్ కిచెన్లకు ప్రతిపాదనలుపంపించాం
ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం అర గంటలో విద్యార్దులకు వేడి వేడి అన్నం, కూరలు పంపించే విధంగా జిల్లాలో 54 స్మార్ట్ కిచెన్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనల పంపించాం. ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలూ రాలేదు. ఉత్తర్వులు వస్తే స్మార్ట్ కిచెన్‌లు ఏర్పాటు చేస్తాం.యు.మాణిక్యం నాయుడు జిల్లా విద్యాశాఖ అధికారి, విజయనగరం

