Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహానాడు!

మహానాడు!

హానాడు పేరిట తెలుగుదేశం పార్టీ వార్షిక సమావేశాన్ని గతంలో ఎన్నడూ లేనివిధంగా 1875 చోట్ల హైబ్రిడ్ విధానంలో మే 27, 28 తేదీలలో రెండు రోజులపాటు నిర్వహించారు.

చట్ట సభల్లో పోటీ చేయడానికి మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని మహానాడు వేదికగా ప్రకటించడం ముదావహం. యువతకు పెద్ద పీట వేస్తామనడం మంచి విషయమే! ఆ పార్టీ వ్యవస్థాపకుడు తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం పొందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ టి రామారావుకు భారత రత్న ప్రదానం చేయాలని మరోసారి తీర్మానించడం స్వాగతించదగినదే! ఆ మహనీయుని బహుదా ప్రస్తుతించిన మహానాడులో ఆయన ప్రవచించిన సిద్ధాంతాలు, విధానాలను గురించి విస్మరించడం విచారించ వలసిన విషయం. ఎన్ టి రామారావు పేరెత్తితేనే తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదం మన చెవుల్లో గింగురుమంటుంది. ఆనాడు తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ పాలకులకు తాకట్టు పెట్టిన దుష్ట కాంగ్రెస్ నిరంకుశ పాలనపై ఎక్కుపెట్టిన శంఖారావమే కేవలం తొమ్మిది నెలల్లో అధికార పీఠానికి బాటలు వేసింది. రాష్ట్రాల హక్కుల కోసం పరితపించిన ఎన్ టి ఆర్ వివిధ ప్రతిపక్ష పార్టీలతో శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించారు. ఫెడరలిజం పరిరక్షణ ఆయన విధానంగా ఉండేది. కాగా అన్యాయంగా విభజించిన రాష్ట్రానికి మాటిచ్చిన ప్రత్యేక హోదాను, విభజన హామీలను తిరస్కరించిన బిజెపి తో జట్టు కట్టిన టిడిపి నేతలు ఆ వేదిక ద్వారా దాన్ని సమర్ధించుకోవడం ఎన్ టి ఆర్ వారసత్వం ఎలా అవుతుంది? గవర్నర్ రాంలాల్ ద్వారా ఎన్ టి ఆర్ ను పదవీచ్యుతుడ్ని గావించిన కేంద్ర ప్రభుత్వ దాష్టీకాన్ని ఇప్పుడు మరింత దారుణంగా అమలు చేస్తున్న మోడీ-షా ద్వయాన్ని ఆకాశానికెత్తడం తారక రాముని ఆశయాలకు పూర్తి విరుద్ధం.
​మత సామరస్యాన్ని నిలబెట్టడానికి మైనారిటీలకు రక్షణ కల్పించడానికి ఎన్ టి ఆర్ కృషి చేశారు. దేశంలో మత సామరస్య పరిరక్షణకు ఆనాటి విధ్వంసకర రథయాత్రను వ్యతిరేకించారు. అలాంటి చరిత్ర గల టిడిపి ఈనాడు మత విద్వేషాన్ని రగుల్చుతున్న బిజెపి తో చెలిమి చేయడాన్ని ఎలా సమర్ధించుకుంటారు? బిజెపి తెచ్చిన వినాశకర వక్ఫ్ బిల్లును పార్లమెంటులో టిడిపి బలపరచడం దారుణం. టిడిపి తీర్థం పుచ్చుకున్న ఉండి ఎం ఎల్ ఏ ఆకివీడు దళితవాడలో గొంతేనమ్మ గుడి కూల్చుతామని వీరంగం వేయడం, మరోవైపు కడపలో విద్వేష వివాదాల సృష్టి వంటివి కూటమిలో పరివార్ శక్తుల భాగస్వామ్యం ఉండడం వల్లనే పెచ్చరిల్లుతున్నాయి కదా! ఆరు నెలలు స్నేహం చేస్తే వారు వీరవుతారు అన్న మాదిరిగా సాక్షాత్తు చట్ట సభల్లో టిడిపి ముఖ్య నాయకులే మతం ప్రస్తావన చేసిన దుస్థితి గురించి మహానాడులో సమీక్షించారా? తెలుగు దేశం పార్టీ జెండా రూపకల్పనలో నాగలి రైతులకు చక్రం కార్మికులకు ప్రతీకగా ఆనాడు పేర్కొన్నారు. కానీ ఈనాటి కూటమి పాలనలో రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కాదు సరికదా మద్దతు ధరనైనా కల్పిస్తున్నారా? ఎల్లవేళలా కార్పొరేట్ల భజన, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనడమే తప్ప కార్మిక సంక్షేమం ఊసెత్తుతున్నారా ? పొరుగు రాష్ట్రం ప్రకటించిన తరువాతయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ పరిశ్రమల కార్మికులకు కనీస వేతనాలు గురించి కనీసంగా ఆలోచించదా? మరి ఆ పతాకానికి, అందులోని చిహ్నాలకీ విలువేమిటి అని నిజాయితీ గల టిడిపి కార్యకర్తలు ప్రశ్నిస్తే ఏలికలేం చెబుతారు?
​అయితే, బిజెపితో చెట్టపట్టాలు వేసుకుంటున్నప్పటికీ దేశమంతటా వారు తెచ్చి పెట్టిన వివాదాస్పద ఎస్ ఐ ఆర్ గురించి అప్రమత్తంగా వుండాలని టిడిపి అధినేత తమ కార్యకర్తలకు హెచ్చరించడం, ఆ ప్రమాదాన్ని గుర్తించడం బాగానే వుంది. అదే విధంగా వినాశకర కేంద్ర ప్రభుత్వ విధానాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎన్ టి ఆర్ జపం చేయడం మాత్రమే గాక అయన అనుసరించిన విధానాలను అమలు చేయడానికి, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి టిడిపి కృషి చేయాలి. అదే ఎన్ టి ఆర్ కి నిజమైన నివాళి అవుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti