@ఇరాన్‌తో చర్చలు క్లిష్టంగా మారాయన్న ట్రంప్ వ్యాఖ్యలు @అయితే ఒప్పందం కావాలని వారు కోరుకుంటున్నారని వెల్లడి
@అమెరికాను నమ్మలేకపోతున్నామన్న ఇరాన్
@బీరుట్‌లో దాడులు : 8మంది మృతి
టెహ్రాన్, వాషింగ్టన్ : ఇరాన్ మిలటరీ స్థావరాలపై అమెరికా ఆదివారం దాడులు చేసింది. ఇందుకు ప్రతిగా అమెరికా స్థావరాన్ని తాము లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సోమవారం తెలిపింది. మూడు మాసాలుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఇరు పక్షాల మధ్య చర్చలు జరుగుతున్న వేళ మళ్ళీ పరస్పర దాడులు చోటు చేసుకున్నాయి. ఈ దాడులు జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్ నిజంగానే కోరుకుంటోందని, అది అమెరికాకు, దాని మిత్రపక్షాలకు మంచిగా వుంటుందని ఆయన ఆ పోస్టులో వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఘర్షణను చుట్టుముట్టిన రాజకీయ వ్యాఖ్యానాల నడుమ ఇరాన్‌తో చర్చలు జరపడం తనకు కష్టంగా మారిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. 'ఈ విషయంలో వేగంగా వ్యవహరించాలా లేదా నెమ్మదిగా సాగాలా, యుద్ధం చేయాలా, వద్దా, ఇలా ప్రతీదీ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయన్నారు.
అంతర్జాతీయ జలాల్లో పనిచేస్తున్న అమెరికా ఎంక్యు-1 డ్రోన్ ను కూల్చివేయడంతో సహా ఇరాన్ దూకుడు చర్యలను ప్రతిగానే తాము ఇరాన్ గల్ఫ్ తీర ప్రాంతంపై దాడులు చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్ పోస్టులో తెలిపింది. దీనిపై ఐఆర్‌జిసి సోమవారం స్పందిస్తూ, దక్షిణ ఇరాన్‌పై దాడి చేసేందుకు అమెరికా ఉపయోగించిన వైమానిక స్థావరాన్నే లక్ష్యంగా చేసుకుని తాము దాడి చేశామని తెలిపింది. ఆ స్థావరం పేరును వెల్లడించలేదు.
ఇదిలావుండగా, అమెరికా ప్రధాన స్థావరం వున్న కువైట్‌లో వైమానిక రక్షణ బలగాలు క్షిపణులను, డ్రోన్ల దాడులను అడ్డుకుంటన్నాయని ప్రభుత్వ వార్తా సంస్థ కునా తెలిపింది. దేశవ్యాప్తంగా సైరన్ మోతలు వినిపిస్తున్నాయని తెలిపింది. అంతకుమించి వివరాలు వెల్లడించలేదు.
మరోవైపు అమరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రస్తుతం కొనసాగుతున్న దౌత్య చర్చలపై లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్, ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహులతో మాట్లాడారని అమెరికా సీనియర్ అధికారి వెల్లడించారు. హిజ్బుల్లానే ముందుగా దాడులు విరమించాలని స్పష్టం చేశారు.
అమెరికాను నమ్మలేకపోతున్నాం
అమెరికాపై విశ్వసముంచలేకపోతున్నామని ఇరాన్ చీఫ్ నెగోషియేటర్ ఆదివారం వ్యాఖ్యానించారు. ఇరాన్ హక్కులన్నింటినీ పూర్తిగా సాధించుకునేవరకు అమెరికాతో ఒప్పందానికి అంగీకరించలేమని స్పష్టం చేశారు. అమెరికా పదే పదే కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘె విమర్శించారు. తమ దేశ భద్రతకు ఏది అవసరమో అది కచ్చితంగా చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇరాన్‌కు మరింత కఠినమైన ప్రతిపాదనలను ట్రంప్ పంపినట్లు తెలుస్తోంది. వాటి వివరాలు స్పష్టంగా తెలియరాలేదు. ఇరాన్ ఎలాంటి అణ్వాయుధాన్ని తయారుచేయకుండా అడ్డుకోవాలని, హర్మూజ్ జలసంధిని తిరిగి ప్రారంభించాలన్నదే తన ప్రాధాన్యతలని ట్రంప్ స్పష్టం చేశారు.
దక్షిణ బీరుట్ శివార్లలో ఇజ్రాయిల్ దాడులు
గత 26ఏళ్ళలో ఎన్నడూ లేని విధంగా లెబనాన్‌లో లోపలికంటా ఇజ్రాయిల్ పదాతి బలగాలు చొచ్చుకుపోయిన నేపథ్యంలో దక్షిణ బీరుట్ శివార్లలో సోమవారం దాడులకు ఇజ్రాయిల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ దాడుల్లో 8మంది మరణించారని లెబనాన్ ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో ముగ్గురు మహిళలేనని తెలిపింది. మరోవైపు ఉత్తర ఇజ్రాయిల్‌లో హిజ్బుల్లా రాకెట్ దాడులు ప్రారంభించింది.

