- లీటరుపై 90 పైసలు పెంపు
- ఐదు రోజుల్లో రెండోసారి ఇంధన ధరల పెంపు
న్యూఢిల్లీ : కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం మరోసారి పెరిగాయి.
ఈ పెంపు తక్షణమే అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని వేరియంట్లకూ లీటరుకు 90పైసలు చొప్పున పెంచారు. నాలుగేళ్ల విరామం తర్వాత ఈ నెల 15న లీటరుకు రూ.3 పెరిగినప్పటి నుండి తాజా పెంపును కూడా కలుపుకుంటే మొత్తంగా రెండు ఇంధనాల రిటైల్ ధరలు రూ.3.90 చొప్పున పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చేస్తున్నా… పట్టించుకోకుండా కేంద్రప్రభుత్వం ధరలను వరుసగా పెంచుకుంటూ పోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా పెంపుతో ఢిల్లీలో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.98.64గా వుండగా, డీజిల్ 91పైసలు పెరిగి లీటరు రూ.91.58కి చేరుకుంది.
సామాన్యులను దోచుకుంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ''నేపథ్యాన్ని సిద్ధం చేసుకుని, పొదుపు గురించి బోధిస్తూ, తమ వైఫల్యాల భారాన్ని మాత్రం ప్రజలపైకి తోసేసున్నారు - ఈ ప్రయత్నం పూర్తి స్థాయిలో సాగుతోంది.''అని ఖర్గే తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

