తమిళనాడు : తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన టివికె సత్తా చాటుతూ గెలుపు దిశగా పరుగులు తీస్తోంది. దీంతో ఆ పార్టీ అధినేత, అగ్ర కథానాయకుడు విజయ్‌కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు ప్రారంభమయ్యాయి.
సెలబ్రిటీలు విజయ్‌ను ప్రశంసిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ విజయం సినిమాను తలపిస్తోందంటూ నాని శుభాకాంక్షలు తెలిపారు.
''మొదట అందరూ ఈ పార్టీ గెలుస్తుందా అని సందేహించారు. కానీ, ప్రజలు దానికే పట్టంకట్టారు. మన రాష్ట్రంలోనూ గతంలో ఇలాంటి విజయమే నమోదైంది. ఇప్పుడు మన పక్క రాష్ట్రంలో ఇదే తరహాలో విజయ్ విజిల్ మోగించారు. అంచనాలను తలకిందులు చేస్తూ విజయం సాధించిన ఈ ఎన్నికల ఫలితాలు సినిమాను తలపిస్తున్నాయి. బహుశా ఇదేనేమో రాజకీయం అంటే. స్పష్టమైన మెజారిటీతో విజయ్‌ను తమిళ ప్రజలు గెలిపించారు. వారి నిర్ణయంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు తీయాలని కోరుకుంటున్నా'' - నాని
''ప్రజలు తమ తీర్పును స్పష్టంగా చెప్పారు. దశాబ్దాలుగా ఎంతోమంది ప్రయత్నించారు. కానీ, ప్రజలు ఎవరిని కోరుకుంటారో విజయం వారినే వరిస్తుందని మరోసారి రుజువైంది. తమిళ ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారు.'' - వరలక్ష్మి శరత్‌కుమార్
''కంగ్రాట్స్ విజయ్. ఇది చారిత్రాత్మక విజయం. గతంలో ఇలాంటి గెలుపు లేదు.. భవిషత్తులో రాదు'' - జీవి ప్రకాశ్ కుమార్
''అభినందనలు విజయ్. మీపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని చూస్తుంటే ఆనందంగా ఉంది. మరింత బలంగా ముందుకు సాగండి'' - టైగర్ ష్రాఫ్
''మన భారతీయ సినిమాకు చెందిన విజయ్ విజయం చూస్తుంటే గర్వంగా ఉంది. ఇది ఒక చారిత్రాత్మక విజయం'' - నిఖిల్

