ప్రజాశక్తి- తాడేపల్లి రూరల్ (గుంటూరు) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన విధంగా మొక్కజొన్న పంటను 2,400 రూపాయలకు కొనుగోలు చేయాలని, ఆంధ్రప్రదేశ్ రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఎంటిఎంసి పరిధిలోని గుండిమెడ గ్రామంలో రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు మంగళవారం ఉదయం మొక్కజొన్న రైతులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం తాడేపల్లి మండల నాయకులు దొంతి రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మొక్కజొన్న వేసిన రైతును ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రామీణ ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, క్వింటా మొక్కజొన్న 2400 మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. ఇప్పటికే మొక్కజొన్న వేసిన రైతులు వ్యవసాయ పెట్టుబడులు పెరిగి, సరైన మద్దతు ద్వారా లేక, దళారులకు క్వింటా 1700 రూపాయలకు అమ్ముకుంటున్నారని అన్నారు. ఒక్కో ఎకరానికి 30 బస్తాలు చొప్పున దిగుబడి వచ్చిన, ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయకపోవడంతో ఎకరానికి 21000 రూపాయల నష్టానికి అమ్ముకవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మొక్కజొన్న రైతులు నష్టపోకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు, కౌలు రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో సిఐటియు తాడేపల్లి మండల కార్యదర్శి పల్లె కృష్ణ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తాడేపల్లి మండల కార్యదర్శి బత్తుల సంసోన్, కెవిపిఎస్ మండల నాయకులు నాగ పోగు విజయరాజు, వెంకటేశ్వరరావు, నల్ల బాబు, వీరయ్య, పి. వెంకటేశ్వరరావు, జోజి బాబు తదితర రైతులు పాల్గొన్నారు.

