ప్రజాశక్తి-యలమంచిలి: చించినాడ బ్రిడ్జిపై మూడేళ్ల బాలుడిని వదిలి దంపతులు గోదావరిలోకి దూకి గల్లంతైన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. రాత్రి సుమారు 10 గంటల సమయంలో పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరుకు చెందిన దొడ్డా సాయి (29), దొడ్డా శిరీష (28) దంపతులు నంబర్ ప్లేట్ లేని స్కూటీపై చించినాడ బ్రిడ్జిపైకి వచ్చారు.
అనంతరం తమ మూడేళ్ల కుమారుడిని బ్రిడ్జి ఫుట్‌పాత్‌పై వదిలి, ఇద్దరూ గోదావరిలోకి దూకినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న యలమంచిలి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని బాలుడిని, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. గల్లంతైన దంపతుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దంపతులు కొంతకాలంగా భీమవరంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

