థానే : దేశవ్యాప్తంగా బుధవారం మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఎఐఒసిడి) పిలుపు మేరకు 20న బంద్ పాటించనున్నట్లు పేర్కొన్నాయి.
సుమారు 15 లక్షలకు పైగా కెమిస్టులు, డ్రగ్గిస్టులు ఈ బంద్ లో పాల్గొననున్నారు. ఆన్ లైన్ లో మందుల విక్రయాలను నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లను నియంత్రించాలని, నకిలీ మందుల అమ్మకాలను నివారించాలని డిమాండ్ చేస్తూ బంద్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఆన్ లైన్ లో మందుల విక్రయాలకు కేంద్రం అనుమతించిం దని, ఏళ్లు గడిచినా నోటిఫికేషన్ ను వెనక్కు తీసుకోలేదని ఎఐఒసిడి అధ్యక్షుడు జగన్నాథ్ షిండే తెలిపారు. థానేలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్ కంపెనీలు కేంద్రం ఇచ్చిన సడలింపులను దుర్వినియోగం చేస్తూ, 20 నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్లు ఇవ్వడంతో అనైతిక పోటీ నెలకొందని అన్నారు. ఈ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆన్ లైన్ విక్రయాల కారణంగా నకిలీ మందులు, యాంటి బయాటిక్స్, ప్రిస్కిప్షన్ లేని మందులు చెలామణి లోకి వచ్చాయని, ఇది ప్రజారోగ్యానికి, ముఖ్యంగా యువతకు తీవ్ర ముప్పును కలిగిస్తున్నాయని తెలిపారు.

