Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నివేదిక వచ్చేవరకూ పాత పద్ధతిలోనే ప్రదర్శనలు

నివేదిక వచ్చేవరకూ పాత పద్ధతిలోనే ప్రదర్శనలు

టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా థియేటర్ల యాజమాన్యాలు, నిర్మాతల మధ్య కొనసాగుతున్న 'పర్సంటేజ్ సిస్టమ్' వివాదానికి ఎట్టకేలకు తెరపడింది.

సీనియర్‌ నటుడు చిరంజీవి జోక్యంతో ఎగ్జిబిటర్లు వెనక్కి తగ్గారు. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం రాత్రి చిరంజీవిని కలిసి తమ సమస్యలను వివరించారు. జూన్ 30 తర్వాత విడుదలయ్యే సినిమాలను పర్సంటేజ్ విధానంలో ప్రదర్శించాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీనిపై స్పందించిన చిరంజీవి, పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఫిలిం చాంబర్ కమిటీ సూచనల ప్రకారమే ముందుకు సాగాలని సూచించారు.

దీంతో ఎగ్జిబిటర్లు తమ నిర్ణయాన్ని మార్చుకుని, జూన్ 4న విడుదల కానున్న రామ్ చరణ్ 'పెద్ది' చిత్రాన్ని పాత రెంటల్ విధానంలోనే ప్రదర్శించేందుకు అంగీకరించారు. కమిటీ తుది నివేదిక వచ్చే వరకు సామరస్య వాతావరణంలో ముందుకు సాగాలని ఇరుపక్షాలు అంగీకరించాయి. 'పెద్ది' సినిమా విడుదలకు ఎలాంటి ఆటంకం లేకపోవడంతో ఫిలింనగర్‌లో సందడి నెలకొంది. భవిష్యత్తులో ఏదైనా భారీ చిత్రానికి ప్రభుత్వం టికెట్ ధరలు పెంచితే, ఆ పెరిగిన మొత్తంలో 7.5 శాతం వాటాను ఎగ్జిబిటర్లకు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం మల్టీప్లెక్స్ థియేటర్లలో కలెక్షన్ల ఆధారంగా పర్సంటేజ్ షేరింగ్ విధానం అమలులో ఉండగా, సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మాత్రం పాత అద్దె విధానమే కొనసాగుతోంది. ఓటీటీ ప్రభావం, విద్యుత్ చార్జీలు, నిర్వహణ ఖర్చులు పెరగడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ కష్టంగా మారిందని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. అందుకే ఇతర రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ కూడా రెవెన్యూ షేరింగ్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 'పెద్ది' సినిమా నుంచే పర్సంటేజ్ విధానం అమలు చేయాలని తొలుత హెచ్చరించిన ఎగ్జిబిటర్లు, చిరంజీవి జోక్యంతో వెనక్కి తగ్గారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti