Dailyhunt
ఓ తాడుముక్క

ఓ తాడుముక్క

రోజు సంత అవడం వలన గోడర్‌విల్లే చుట్టుపక్కల ఉన్నగ్రామాల రైతులతో, వారి భార్యలతో పట్టణానికి వచ్చే రోడ్లన్నీ కిక్కిరిసి పోయాయి. మగవాళ్లు నెమ్మదిగా ముందుకు అడుగులు వేస్తున్నారు.

వారి పొడవాటి, మెలితిరిగిన కాళ్లు ముందుకు వంగి ఉన్నాయి. కుడి భుజం పై నాగలి వేసుకుంటుండడం వలన, ఆ భుజం కిందికి వంగింది. ఎడమ భుజంపైకి లేచి ఎత్తుగా ఉంది. వారు చేసే కాయకష్టం వల్ల శరీరం వికృతంగా తయారైంది. నిత్యం గోధుమలను కోసే కష్టమైన పని చేయడం వల్ల, ఆ కష్టం చేసుకునే పల్లెటూరి మోటు మనుషుల మోకాళ్లు వెడల్పుగా విడిపోయి, నేలను గట్టిగా పట్టుకోవడానికి వీలుగా సాగాయి. మెడ, మణికట్టు వద్ద తెల్లటి చిన్న డిజైన్లతో అలంకరించిన, వార్నిష్ పూసినట్లుగా మెరుస్తున్న నీలి రంగు, గంజి పెట్టిన చొక్కా లు, ఎముకల గూళ్ల లాంటి వాళ్ల శరీరాల చుట్టూ కమ్ముకుని ఉన్నాయి. అవి గాలి బుడగలలాగా ఉబ్బి, గాలిలో ఎగరడానికి సిద్ధంగా ఉన్న బెలూన్లలాగా కనిపిస్తున్నాయి. వాటిలో నుండి ప్రతి వాడి తల, రెండు చేతులు, రెండు పాదాలు ముందుకు చొచ్చుకొని వస్తున్నాయి. కొందరు ఒక తాడుతో ఆవును, దూడను తోలుకు వెళ్తుండగా, వారి భార్యలు ఆ పశువుల వెనుక నడుస్తూ, వాటి నడకను వేగవంతం చేయడానికి ఆకులున్న కొమ్మతో కాళ్లపై కొడుతున్నారు. వారు పెద్ద పెద్ద బుట్టలు మోస్తున్నారు. వాటిలోని కొన్నింటి నుండి కోళ్లు, మరి కొన్నింటి నుండి బాతులు బయటకు పొడుచుకు వస్తున్నాయి. ఆ స్రీలు తమ భర్తల కంటే వేగంగా, చురుకుగా అడుగులు వేస్తూ నడుస్తున్నారు. వారి సన్నని, నిటారు కొయ్యలాంటి శరీరాల చదునైన వక్షస్థలాలపై శాలువాలు, ఇటూ అటూ కదలకుండా గట్టిగా బిగించి, కట్టుకున్నారు. తలపై ఉన్న జుట్టును ఒక తెల్లని గుడ్డతో కప్పుకుని, దానిపై టోపీలు పెట్టుకున్నారు. అప్పుడు, గతుకులతో నిండిన ఆ ఇరుకు దారిపై ఒక గుర్రం బగ్గీ విపరీతంగా కుదుపులకు లోనవుతూ జన సమూహాన్ని దాటి ముందుకు వెళ్ళింది. ఆ బండిలో పక్కపక్కన కూర్చున్న ఇద్దరు మగవాళ్ళు , కింద కూర్చున్న ఒక స్త్రీ విచిత్రంగా ఆ బగ్గీ కుదుపులకు ఊగుతున్నారు. ఆ స్త్రీ కుదుపుల నుండి తప్పించుకోవడానికి బగ్గీ సీట్లను గట్టిగా పట్టుకుంది.
గోడర్‌విల్లేలోని బహిరంగ కూడలిలో మనుషులు, జంతువులు కలగలిసిన ఒక సమూహం అది. పశువుల కొమ్ములు, పొడవైన మెత్తటి రోమాలు ఉన్న ధనిక రైతుల పొడవాటి టోపీలు, దిట్టంగా కట్టుకున్న రైతు స్త్రీల తలపాగాలు ఆ జనసంద్రంపైన కనిపిస్తున్నాయి. ఆ గందరగోళం, చెవులు చిల్లులు పడే, హోరెత్తే శబ్దాలకు ఎక్కడా విరామమే లేదు. అంతేకాదు అవి తీవ్రమైన గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. అప్పుడప్పుడు ఒక పల్లెటూరి వాడు పగలబడి నవ్వే నవ్వులు, లేదా ఇంటి గోడకు కట్టిన ఆవు మోరెత్తి గట్టిగా "అంబా" అని అరిచే అరుపులు, మాత్రమే ఆ గందరగోళాన్ని డామినేట్ చేస్తున్నాయి. పశువుల శాల, పాడి ఆవుల కొట్టం, మట్టి దిబ్బ, గడ్డి, చెమట, అన్నీ కలిసి ఆ పల్లెలో ప్రత్యేకమైన, మానవ, జంతు సంబంధిత అసహ్యకరమైన వాసనను వెదజల్లుతున్నాయి.
బ్రూటెకు చెందిన మైత్రే హాషెకోవ్నా అప్పుడే గోడర్‌విల్లేకు చేరుకుని, బహిరంగ ప్రదేశం వైపు అడుగులు వేస్తూ, నేలపై ఒక చిన్న తాడుముక్కను గమనించాడు. ఒక నిజమైన నార్మన్ లాగా పొదుపుగా ఉండే జిత్తులమారి మైత్రే హాషెకోవ్నా, ఎందుకైనా పనికి వస్తుందని దానిని తీసుకోవాలని అనుకున్నాడు. అతనికి అసలే కీళ్లవాతం (రుమటాయిడ్ ఆర్థరైటిస్)ఉన్నందు వలన బాధ పడుతూనే వంగి ఆ తాడుముక్కను అందుకున్నాడు. నేల మీద నుండి ఆ సన్నని తాడుముక్కను తీసుకుని జాగ్రత్తగా చుట్టడం ప్రారంభించాడు. అప్పుడు, జీను తయారీ చేసే మైత్రే మలందైన్, తన ఇంటి గుమ్మం దగ్గర నిలబడి, తననే చూస్తూ ఉండడం గమనించాడు. అంతకుముందు, వాళ్లిద్దరూ కలిసి పలుపు తాళ్లు వ్యాపారం చేశారు. ఒకప్పుడు ఇద్దరూ మంచి స్నేహితులే. అయితే వ్యాపారంలో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చి, ఇద్దరూ ఒకరినొకరు ద్వేషించుకోవడం మొదలు పెట్టారు. కాబట్టి, బురద మట్టిలో నుండి ఒకతాడు ముక్కను ఏరుతుండగా తన శత్రువు చూడడంతో, మైత్రే హాషెకోవ్నా సిగ్గుపడ్డాడు. అతను, తాను కనుగొన్న ఆ వస్తువును వెంటనే చొక్కా కింద, ఆ తర్వాత ప్యాంటు జేబులో దాచుకున్నాడు. తర్వాత అతను నొప్పితో అయినా సరే, నడుము వంచి, తల కూడా మరింత ముందుకు వంచి నొప్పిని భరిస్తూ, తనకు దొరకని దేనికోసమో నేల మీద ఇంకా వెతుకుతున్నట్లు నటిస్తూ, సంతవైపు వెళ్ళాడు.
అంతులేని బేరసారాలతో తీరిక లేకుండా, కోలాహలంగా ఉన్న సంతలో, నెమ్మదిగా కదులుతున్న జనసమూహంలో అతను త్వరలోనే కలిసిపోయాడు. సంతలో రైతులు ఎక్కడ మోసపోతామో అనే భయంతో, అయోమయంగా, అటూ ఇటూ తిరుగుతున్నారు. ఏం కొనాలో నిర్ణయించుకోలేక, మోసపోకుండా ఉండాలనే కోరికతో అమ్మకందారుడి కళ్లలోకి చూస్తూ, మనిషిలోని మోసాన్ని, జంతువులోని లోపాన్ని వెతకడానికి నిరంతరంగా ప్రయత్నిస్తున్నారు.
స్త్రీలు, తమతో తెచ్చుకున్న పెద్ద బుట్టలను కాళ్ల దగ్గర పెట్టుకుని, తమ ఎర్రని జుట్టు నేలను తాకుతుండగా, భయం నిండిన కళ్లతో, కాళ్లు కట్టేసి ఉన్న కోళ్లను ఒక్కొక్క దానిని బుట్టలో నుంచి బయటికి తీస్తున్నారు. చుట్టూ ఉన్న వారు తాము ఎంతకి అమ్ముతున్నదీ కేకలు వేస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. వారి ఆఫర్లను వింటూ, గంభీరమైన ముఖంతో, నిర్లిప్తంగా తాము అమ్మే ధరలను అక్కడి స్త్రీలు కొనుగోలుదారులకు చెపుతున్నారు. లేదా ఒక్కొక్కసారి కొనుగోలుదారుడు ధర ఎక్కువుందని అనుకుని వెనుతిరిగి పోతుంటే, బేరం పోకుండా ఉండడానికి అకస్మాత్తుగా ధర తగ్గించి, నెమ్మదిగా తిరిగి వెళ్ళిపోతున్న కొనుగోలుదారుడితో, "సరే మైత్రే ఆథిర్న్, నేను మీకు ఆ ధరకే ఇస్తాను" అని అరిచి వెనక్కు పిలుస్తున్నారు. ఆ తర్వాత క్రమంగా ఆ ప్రాంగణం అంతా నిర్మానుష్యంగా మారింది. మధ్యాహ్నం చర్చి నుండి ప్రార్ధనచేసే సమయంలో వెలువడే 'ఏంజిలుస్' గంటలు మోగుతుండగా, అప్పటివరకు అక్కడే సంతలో ఉండిపోయినవారు తమతమ దుకాణాల వైపులకు కదిలిపోయారు. జోర్డెయిన్ ఒక సత్రం. అందులో ఉన్న ఆ పెద్ద గది అంతా భోజనం చేస్తున్న జనంతో నిండిపోయి ఉంది. అలాగే, ఆ విశాలమైన ప్రాంగణమంతా రకరకాల వాహనాలతో నిండిపోయింది. బండ్లు, గుర్రపు బగ్గీలు, వ్యాగన్లు, డంప్ కార్ట్‌లు. మురికితో పసుపు రంగులోకి మారి, బాగుచేసి, అతుకులు వేసిన తమ బండ్ల కాడీలను రెండు చేతుల్లాగా ఆకాశంవైపు ఎత్తి ఉంచారు లేదా నేలలో దింపి, వీపు భాగాలు గాలిలో పైకి లేపి ఉంచారు. బల్ల వద్ద భోజనం చేస్తున్న వ్యక్తులకి సరిగ్గా ఎదురుగా, ప్రకాశవంతగా, మంటలు ఎగసిపడుతున్న భారీ పొయ్యి ఉంది. అది కుడి వైపు వరుసలో కూర్చున్న వారి వీపుపై తీవ్రమైన వేడిని ప్రసరింపజేస్తోంది. మూడు ఇనప చువ్వలపై కోళ్లు, పావురాలు, గొర్రె కాళ్లు కాలుస్తున్నారు. ఆ తర్వాత, పొయ్యిలోంచి చక్కగా చర్మం కాలిన గొడ్డు మాంసం పైకి రావడంతో, అక్కడి వారి ఉల్లాసం మరింత పెరిగి, అందరి నోళ్లలో నీళ్లూరాయి. మాత్రే జౌర్డెయిన్ ఆ సత్రం యజమాని, గుర్రాల వ్యాపారి, ధనికుడైన అతని వద్దే ఉన్నత వర్గాల వారందరూ భోజనం చేస్తారు. అతగాడు పరమదుర్మార్గుడు.
పసుపు రంగు సైడర్ ఉన్న కూజాలలాగానే, వంటకాలు కూడా ఒకరి నుండి మరొకరికి అందుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ వ్యవహారాలు, కొనుగోళ్లు, అమ్మకాల గురించి మాట్లాడుకుంటున్నారు. పంటల గురించి చర్చించుకుంటున్నారు. వాతావరణం పచ్చని పంటలకు అనుకూలంగా ఉంది. కానీ గోధుమలకు కాదు. అకస్మాత్తుగా ఇంటి ముందున్న ప్రాంగణంలో డప్పు మోగింది. కొద్దిమంది పట్టించుకోకుండా ఉదాసీనంగా ఉన్నా, చాలామంది లేచి, చేతుల్లో రుమాళ్లతో, ఇంకా కిక్కిరిసి ఉన్న ద్వారం వైపు పరుగెత్తారు. ఆ చాటింపువేసే వాడు డప్పు వాయించడం ఆపిన తర్వాత, మాటలను అడ్డదిడ్డంగా పలుకుతూ, వణుకుతున్న స్వరంతో ఇలా దండోరా వేసాడు. "గోడర్‌విల్ నివాసులకు, సాధారణంగా మార్కెట్‌లో ఉన్న ప్రజలందరికీ దీనిద్వారా తెలియజేయునది ఏమనగా, ఈ ఉదయం 9 మరియు 10 గంటల మధ్య బెంజెవిల్ వెళ్లే రహదారిపై, 500 ఫ్రాంకులు, కొన్ని వ్యాపార పత్రాలు ఉన్న ఒక నల్లతోలు జేబు పుస్తకం పోయింది. దానిని కనుగొన్నవారు అందులో ఉన్న వాటన్నింటినీ మేయర్ కార్యాలయంలో లేదా మానావిల్‌లోని మైత్రే ఫార్చ్యూన్ హాబ్రెక్యూకు తిరిగి ఇవ్వవలసిందిగా కోరడమైనది. తిరిగి ఇచ్చినవారికి 20 ఫ్రాంకుల బహుమతిగా ఇవ్వబడుతుంది" అంటూ దండోరా వేసిన ఆ వ్యక్తి తర్వాత వెళ్ళిపోయాడు.
దూరంగా మళ్ళీ డప్పుల గంభీరమైన శబ్దం, కేకలు వేసే వాడి స్వరం వినిపించాయి. అప్పుడు వారు ఈ సంఘటన గురించి మాట్లాడటం మొదలుపెట్టారు, మిస్టర్ హాల్ బ్రూక్ పోయిన తన జేబు పుస్తకాన్ని తిరిగి పొందే అవకాశాల గురించి చర్చిస్తూ కాలక్షేపం చేసారు. భోజనాలు ముగిసాయి. వారు తమ కాఫీ తాగడాన్ని ముగిస్తుండగా, పొలీసు గుమ్మం వద్ద కనిపించాడు. అతను,"మిస్టర్ బ్రేఅవుటేకి చెందిన మైత్రే హాషెకోవ్నా ఉన్నారా?"
" నేను ఇక్కడే ఉన్నాను" అని మైత్రే హాషెకోవ్నా జవాబిచ్చాడు. అప్పుడా అధికారి: "మిస్టర్ మైత్రే హాషెకోవ్నా, దయచేసి నాతో పాటు మేయర్ కార్యాలయానికి వస్తారా? మేయర్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు." అక్కడున్న వ్యక్తి ఆశ్చర్యంతో, కలవరంతో గుటకలు మింగి, తన చిన్న బ్రాందీ గ్లాసును పైకి లేపి తాగి, లేచాడు; అయితే ఇప్పుడు ఉదయం కంటే మరింత వంగిపోయాడు. ఎందుకంటే, కాస్తంత విశ్రాంతి తీసుకుని లేచిన ప్రతిసారి రుమాటిజంతో బాధపడుతున్న ఆ వ్యక్తికి మొదటి అడుగు వేయడం మరింత కష్టంగా ఉంటుంది.
"నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇక్కడే ఉన్నాను" అని పదే పదే చెప్పుకుంటూ బయలుదేరాడు. మేయర్ ఒక చేతులున్న కుర్చీలో కూర్చుని అతని కోసం ఎదురుచూస్తున్నాడు. అతను ఆ ప్రాంతానికి నోటరీ, ఆడంబరమైన పదజాలంతో మాట్లాడే ఒక స్థూలకాయుడు, గంభీరమైన వ్యక్తి. "మనవిల్లి బృందానికి చెందిన మిస్టర్ ఆల్ పోగొట్టుకున్న జేబు పుస్తకాన్ని బెంజెనెలీకి వెళ్లే దారిలో ఉదయాన్నే మీరు తీసుకుంటుండగా చూశారని మిస్టర్ మలందైన్ చెప్పారు."
అకారణంగా తనపై పడిన నిందతో అప్పటికే భయపడి ఉన్న ఆ పల్లెటూరివాడు, మేయర్ వైపు ఆశ్చర్యంగా చూశాడు.
"నేనా? నేనా? జేబు పుస్తకాన్ని తీసుకోవడమా?"
"అవును, మీరే."
"గౌరవనీయులైన మేయర్ గారూ, నాకా విషయం అస్సలు తెలియదు"
"కానీ మిమ్మల్ని చూశారు."
"నన్ను చూశారా? నేనా? నన్ను చూశానని ఎవరు చెప్పారు?"
"జీనుల తయారీదారు మిస్టర్ మలందైన్"
ఆ ముసలాయనకు విషయం అర్థమై, కోపంతో ఒళ్ళు మండిపోయింది. "ఓ, ఆ మోటు మనిషా, నేను అక్కడ ఈ తాడుముక్క ను తీసుకుంటుండగా చూశాడు మిస్టర్ మేయర్!" అంటూ ఆ చిన్నతాడు ముక్క కోసం తన జేబులు వెతుకుతున్నాడు. కానీ మేయర్ నమ్మలేనట్లుగా తల అడ్డంగా ఊపాడు.
"నమ్మదగిన వ్యక్తి అయిన మిస్టర్ మలందైన్ తాడుని జేబు పుస్తకం అనుకుని పొరబడ్డాడని మీరు నన్ను నమ్మించలేరు మిస్టర్ మైత్రే హాషెకోవ్నా."
కోపంతో ఊగిపోతున్న ఆ రైతు, తన చేతిని పైకెత్తి, తన నిజాయితీని రుజువు చేసుకోవాలనుకున్నాడు. "దేవుడి సాక్షిగా ఇది నిజం, అసలైన నిజం ఇదే మిస్టర్" అని తిరిగి అన్నాడు. మేయర్ గారూ, నా ఆత్మ మీద, నేను సంపాదించిన పుణ్యం మీద ప్రమాణం చేసి మళ్ళీ చెప్తున్నాను."
మేయర్ నమ్మలేదు. వస్తువును చేతిలోకి తీసుకుని నువ్వు కొయ్యలాగా అక్కడే నిలుచున్నావు(ట), అందులో ఏమైనా డబ్బులు పడిపోయాయేమోనని చాలాసేపు బురదలో వెతికావు(ట)."
ఆ పెద్దాయన ఆగ్రహంతో, భయంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఒక నిజాయితీపరుడి పరువు తీయడానికి ఎవరైనా ఇంత అబద్ధాలు ఆడాలా! ఎవరైనా ఎలా?. నిరసన తెలపడం వల్ల ప్రయోజనం లేదు, ఎవరూ అతన్ని నమ్మలేదు. అతనికి ఎదురుగా మిస్టర్ మలందైన్ నిలబడ్డాడు, అతను తన వాదనను పునరావృతం చేస్తూ, సమర్థించుకున్నాడు. వాళ్లిద్దరూ గంటసేపు ఒకరినొకరు తిట్టుకున్నారు. మిస్టర్ హాషెకోవ్నా స్వయంగా కోరడంతో అతన్ని సోదా చేశారు. అతని వద్ద ఏమీ దొరకలేదు. చివరకు మేయర్ చాలా ఆవేశంతో, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను సంప్రదించి తదుపరి ఆదేశాలు కోరతానని హెచ్చరించి అతడిని వదిలిపెట్టారు. ఈ వార్త వెంటనే ఆ ప్రాంతమంతా పాకింది. అతను మేయర్ ఆఫీసు నుండి బయటికి వస్తుండగా, ఆ వృద్ధుడిని జనాలు చుట్టుముట్టి, తీవ్రమైన ప్రశ్నల వర్షం కురిపించారు. అందులో ఎటువంటి ఆగ్రహం లేదు. అతను ఆ తాడుముక్క కథ చెప్పడం ప్రారంభించాడు, ఎవరూ అతన్ని నమ్మలేదు. నవ్వుకున్నారు. అతను తన స్నేహితులను ఆపుతూ, తన వాదనను వినిపించాడు. నిరసనను తెలిపాడు. తన వద్ద ఏమీ లేదని నిరూపించుకోవడానికి తన జేబులను తిరగేసి చూపిస్తూ, ఎంతకీ నమ్మకపోవడంతో, ఏమి చేయాలో తోచక, అదే విషయాన్ని పదేపదే చెప్పుకుంటూ పోతున్నాడు. రాత్రయింది. ఇక తాను ఇంటికి వెళ్లే సమయమైంది. తన ఊరి స్నేహితులతో కలిసి ఇంటికి బయలుదేరాడు. వెళుతూ దారిలో తాను తాడుముక్కని తీసుకున్న స్థలాన్ని వాళ్ళకి చూపించాడు. తాను చేసిన సాహసాన్ని గురించి స్నేహితులతో పంచుకోవడం మొదలుపెట్టాడు. సాయంత్రం మళ్ళీ బ్రెఅంతే గ్రామానికి వెళ్ళీ, అక్కడా కనిపించిన ప్రతివారికీ తన కథ చెప్పడం మొదలుపెట్టాడు. కానీ ఎవరి విశ్వాసాన్నీ పొందలేకపోయాడు. దానితో రాత్రయ్యే సరికి అనారోగ్యం పాలయ్యాడు. ఆ మర్నాడు మధ్యహ్నం ఒంటి గంటకు మన్నేవెల్లికి చెందిన మైత్రే బ్రెటన్ నియమించుకున్న మాఉయిర్స్ పామెల్లె అనే పొలీసు, పొకెట్ డైరీని, అందులో ఉన్న వస్తువులతో సహా తెచ్చి మన్నేవెల్లికి చెందిన మైత్రే హాల్బ్రెక్కి తిరిగి ఇచ్చాడు. అతనికి పొకెట్ డైరీ, ఇతర వస్తువులు రోడ్ పై దొరికాయట!. కానీ చదవ లేకపోవడం వలన అవి ఎవరికి చెందుతాయో తెలుసుకోలేకపోయాడు. అందువలన వాటిని తన యజమానికి అందచేసాడు. చుట్టుపక్కల ప్రాంతమంతా ఈ విషయం పాకింది. మైత్రే హాషెకోవ్నాకి కూడా ఆ విషయం వెంటనే తెలియజేసారు. అతను వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. మళ్ళీ తన కథనంతా చెప్పుకున్నాడు. కథ సుఖాంతం అయినందుకు చాలా సంతోషించాడు.
"నన్ను అతిగా బాధించింది పోయిన వస్తువు కాదు. నేను అబద్ధం చెపుతున్నాననే ఆరోపణ" అన్నాడు. తన సాహసాన్ని గురించి రోజంతా కనిపించిన ప్రతివాడికీ చెప్పుకున్నాడు. దారిలో పోయే వాళ్లందరికీ చెప్పాడు. మందుషాపులకు వెళుతున్న ప్రజలకు, అక్కడ తాగుతున్నవారికి, తర్వాత ఆదివారం చర్చికి వచ్చిపోయే వారందరికీ కూడా చెప్పుకున్నాడు. ముక్కూ మొఖం తెలియని వాళ్ళను కూడా ఆపి మరీ తాడుముక్క కథ వినిపించాడు. అతను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు; కానీ అతనికి తెలియకుండానే మనసులో ఏదో కలవరం, ఆ కలవరానికి కారణం అతనికే అంతుబట్టలేదు. కథ ముక్క వాళ్లంతా వెనుక నవ్వుకోవడం గమనించాడు. ఎంతగా వాస్తవాన్ని చెపుతున్నా వాళ్ళు ఎవరూ నమ్మడం లేదు. తన వెనుక గసగు సలు ఆగలేదు. మరుసటి మంగళవారం, ఆ కేసు గురించి చర్చించాల్సిన అవసరం ఉందని అనిపించి గోడెర్లోవిల్లే మార్కెట్‌కు వెళ్ళాడు. తన ఇంటి గుమ్మంలో ఎదురుగా నిలబడి ఉన్న మలందైన్, మైత్రే హాషెకోవ్నా అటుగా వెళ్తుండగా చూసి నవ్వడం మొదలు పెట్టాడు.
" ఎందుకు?"
క్రికెతో నుండి వచ్చిన ఒక రైతు దగ్గరికి వెళ్లి జరిగిన సంగతి చెప్పబోతే, మధ్యలోనే పిడికిటితో పొట్టలో ఒక గుద్దు గుద్ది, మొఖం మీదే "నువ్వో వెధవవి" అని వెళ్ళిపోయాడు. మైత్రే హాషెకోవ్నా ఆందోళన చెందాడు తనను వెధవని ఎందుకన్నాడు? జోర్దాయం సత్రంలో బల్ల దగ్గర కూచుని తానే అతడికి "జరిగిన విషయం" చెప్పాడు. గుర్రాలమ్మే ఒక డీలర్,"ఇది అంతా తెలివైన పాత ఎత్తుగడే! నీ తాడుముక్క కథ నాకు బాగా తెలుసు " అన్నాడు.
మైత్రే హాషెకోవ్నా నివ్వెరపోయాడు.
"కానీ పోయిందని అన్న పాకెట్ డైరీ, వస్తువులు దొరికాయి కదా! "
అందుకు అవతలివ్యక్తి, "నోరుముయ్యరా మామా! ఒకడికి దొరుకుతాయి, మరొకడు పిర్యాదు ఇస్తాడు. ఏమయితేనేం, నీకు ఆ కేసుతో సంబంధం అయితే ఉంది కదా !" అన్నాడు. రైతు మైత్రే హాషెకోవ్నా నోటమాట రాలేదు. అతనికి విషయం అర్ధమయింది. వాళ్లంతా తానే, దొంగిలించిన పొకెట్ డైరీని ఒక నమ్మకస్తుడి చేతిలో పెట్టి, దొరికినట్టు చూపుతున్నానని అనుకుంటున్నారు. ఇందుకు నిరసన తెలియచేయాలని అనుకున్నాడు. కానీ బల్ల చుట్టూ ఉన్న వాళ్లంతా గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. ఇక అక్కడ భోజనం చేయలేకపోయాడు. ఆ హేళనల మధ్య నుండి తప్పించుకుని ఇంటికి చేరుకున్నాడు. అవమానభారంతో, కోపం కట్టలుతెంచుకుని వస్తుండగా ఆలోచనలతో సతమతమవుతూ ఇంటికి చేరుకున్నాడు. భరించలేనంతగా కుంగిపోయాడు.
ఒక నార్మన్ గా తనకున్న నక్కజిత్తుల తో, ఎదుటివారు తనపై మోపిన నిందలను వదిలించుకోగలనని, తనపై వారు మోపిన ఆరోపణలు తప్పని రుజువు చేయగలనని, అది నమ్మి వారు తనని మంచివాడిగా స్వీకరిస్తారని భ్రమపడ్డాడు. కానీ, అతని స్వచ్ఛతని ఏవీ నిరూపించలేకపోయాయి. అతని జిత్తులమారితనం మాత్రమే ప్రజలకు తెలిసినందువలన, విషయం గందరగోళంగా మారి, అతని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం అసాధ్యం అయింది. అన్యాయంగా తనను అనుమానిస్తున్నారు అని తెగ బాధ పడ్డాడు మైత్రే హాషెకోవ్నా. ఆ అనుమాన భూతం అతని గుండెను ఛిద్రం చేసింది. ఇప్పుడు అతను తను చేసిన సాహస కార్యాన్ని మళ్ళీ మననం చేసుకోవడం మొదలుపెట్టాడు. గతంలో జరిగిన తన కథను పొడిగిస్తూ పోయాడు. ప్రతిసారీ కొత్తకోణాలను, మరింత శక్తివంతమైన వాదనలను చేర్చాడు. వంటరిగా ఉన్నప్పుడు వాదనలు ఊహించుకుని, సమాధానాలు సిద్ధం చేసుకున్నాడు. ఎప్పటికప్పుడు గంభీరమైన ప్రమాణాలను జోడిస్తున్నాడు, అతని మనసంతా ఆ తాడుముక్క కథకే అంకితమైపోయింది. కానీ చిత్రంగా అతని సమర్థన ఎంత క్లిష్టంగా ఉంటే, అతని వాదనలు ఎంత సూక్ష్మంగా ఉంటే, అతన్ని అంత తక్కువగా నమ్మారు ప్రజలు. అతనిని ,అతని కుట్రలను, కుతంత్రాలను నమ్మినంతగా ప్రజలు అతని నిజాయితీని నమ్మలేదు.
"అవి శుద్ధ అబద్ధాలు" అని అతని వెనుక చెప్పుకున్నారు.
అతను వారి భావనలను గ్రహించగలు గుతున్నాడు. ఆ భావన అతని గుండెను పిండేసింది. తన అమాయకత్వాన్ని రుజువు చేసుకునే ప్రయత్నాలు ఫలించవని తెలుసుకున్నాడు. అప్పటివరకు చేసిన ప్రయత్నాలతో పూర్తిగా అలసిపోయాడు. వారి కళ్ల ముందే అతను క్షీణించిపోయాడు. యుద్ధానికి వెళ్లిన సైనికుడి దగ్గర తన యుద్ధాల గురించి కథలు చెప్పించుకున్నట్లుగా, ఇప్పుడు ఆ హాస్యగాళ్లు తాము నవ్వుకోడానికి అతనిని ఆ తాడుముక్క గురించి కథ చెప్పమని బలవంతం చేస్తున్నారు. ఆ బాధ అతని మనసు లోతుల్లోకి పాకి, అతనిని మరింత బలహీనపరచడం ప్రారంభించింది. డిసెంబర్ నెలాఖరులో అతను మంచానపడ్డాడు. జనవరి తొలి రోజుల్లో మరణించాడు. మరణ వేదనతో కూడిన మతిభ్రమణంలో కూడా, అతను తన నిర్దోషిత్వాన్ని పదేపదే నొక్కిచెబుతూ, ఇలా అన్నాడు. "ఒక తాడు ముక్క, ఒక తాడు ముక్క, - చూడండి - ఇదిగోండి, మేయర్ గారూ!"

మూలం: గైదీ మోపసా

అనువాదం : కె. ఉషారాణి

9492879210

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti